Tuesday, June 30, 2026
E-PAPER
Homeఎడిట్ పేజికార్పొరేట్ వైద్యంలో వైద్యుడూ బాధితుడే

కార్పొరేట్ వైద్యంలో వైద్యుడూ బాధితుడే

- Advertisement -

రోగి ఆసుపత్రికి వెళ్లినప్పుడు అతని కళ్లలో కనిపించేది ఆశ. ఆ ఆశకు రూపం వైద్యుడు. కానీ నేడు ఆరోగ్యరంగం గురించి చర్చ జరిగినప్పుడల్లా వైద్యులపై విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. పెరుగుతున్న వైద్య ఖర్చులు, కార్పొరేట్ ఆసుపత్రుల వ్యాపార ధోరణి, ప్రజలకు అందని చికిత్సలు ఆ విమర్శలకు కారణమ వుతున్నాయి. అయితే ఈ వ్యవస్థలో వైద్యుడు కూడా ఎన్నో ఒత్తిళ్లు, పరిమితులు ఎదుర్కొంటున్నాడనే విషయం తరచూ విస్మరించబడుతోంది. రోగి బాధను తగ్గించాల్సిన వైద్యుడు, యాజమాన్యాల ఆర్థిక లక్ష్యాలు, వృత్తి నైతికత మధ్య నిత్యం సంఘర్షణ పడుతున్నాడు. ప్రజారోగ్య వ్యవస్థ బలహీనపడటం, వైద్య విద్య ఖరీదైపోవడం, కార్పొరేట్ సంస్కృతి విస్తరించడం ఈ పరిస్థితిని మరింత సంక్లిష్టం చేశాయి. ఫలితంగా రోగి, వైద్యుడు ఇద్దరూ ఒకే వ్యవస్థకు బలవుతున్న వాస్తవం కనిపిస్తోంది. నేడు వైద్యుల దినోత్సవం సందర్భంగా ఈ వాస్తవాన్ని గుర్తించడం అవసరం. ఆరోగ్యరంగ సంక్షోభాన్ని అర్థం చేసుకోవాలంటే వైద్యుడిని కాదు, అతను పనిచేస్తున్న వ్యవస్థనూ పరిశీలించాల్సిందే. ఒకప్పుడు ఆరోగ్యం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యతగా, ప్రతి పౌరుడి హక్కుగా పరిగణించబడేది. కానీ ఆర్థిక సంస్కరణల తర్వాత ప్రభుత్వాలు ప్రజారోగ్య రంగంపై పెట్టుబడులను తగ్గిస్తూ ప్రైవేటు రంగాన్ని ప్రోత్స హించాయి.

ఫలితంగా ఆరోగ్య సేవల బాధ్యత క్రమంగా కార్పొరేట్ ఆసుపత్రుల చేతుల్లోకి వెళ్లింది. ఆరోగ్యం ఒక సామాజిక హక్కు అనే భావన బలహీనపడగా, అది కొనుగోలు చేయాల్సిన సేవగా మారింది. చికిత్స నాణ్యత కంటే చెల్లించే సామర్థ్యం ముఖ్యమైన అంశంగా మారుతున్న పరిస్థితి ఏర్పడింది. ప్రైవేటు ఆసుపత్రులు ఆధునిక సదుపాయాలు అందిస్తున్నప్పటికీ వాటి ఖర్చులు సాధారణ ప్రజలకు భారంగా మారుతున్నాయి. ప్రజారోగ్య వ్యవస్థ బలహీనపడటంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి. ఆరోగ్య రంగంలో లాభాల లక్ష్యం పెరగడం వల్ల సేవాభావం క్రమంగా వెనుకబడుతోంది. ఈ పరిస్థితి ఆరోగ్య అసమానతలను మరింత పెంచుతోంది. ఒకప్పుడు వైద్య వృత్తి ప్రధానంగా సేవా దృక్పథంతో నడిచేది. రోగి సంక్షేమమే కేంద్రబిందువుగా ఉండేది. కానీ గత మూడు దశాబ్దాలుగా ఆరోగ్యరంగంలో చోటుచేసుకున్న మార్పులు వైద్య వృత్తి స్వరూపాన్నే మార్చే శాయి. ప్రభుత్వాలు ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయాల్సిన బాధ్యత నుంచి క్రమంగా తప్పుకుంటూ, ప్రైవేటు రంగానికి పెద్దపీట వేశాయి. ఫలితంగా ఆరోగ్యం ప్రజా హక్కు నుంచి మార్కెట్ వస్తువుగా మారింది. ఈ మార్పు వల్ల అత్యధికంగా ప్రభావితమైన వారిలో వైద్యులు కూడా ఉన్నారు. నేడు పెద్ద కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యుడు తన వృత్తిపరమైన నిర్ణయాలను పూర్తిగా స్వేచ్ఛగా తీసుకునే పరిస్థితిలో లేడు. యాజమాన్యాల ఆర్థిక లక్ష్యాలు, ఆదాయ ఒత్తిళ్లు, పనితీరు కొలమానాలు అతని చుట్టూ గోడల్లా నిలుస్తున్నాయి.

ఎంతమంది రోగులను చూశాడు, ఎన్ని పరీక్షలు సూచిం చాడు, ఎన్ని ప్రొసీజర్లు నిర్వహించాడు అనే లెక్కలు అతని పనిని అంచనా వేసే ప్రమాణాలుగా మారుతున్నాయి. రోగిని మనిషిగా చూడాల్సిన చోట, మార్కెట్ దృష్టితో చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇది వైద్యుడికి కూడా అంతర్మథనమే. ఎందుకంటే వైద్య విద్యలో అతను నేర్చుకున్నది మాన వత్వం. రోగి ప్రయోజనాన్ని మొదటి స్థానంలో ఉంచాలని ప్రమాణం చేస్తాడు. కానీ ఉద్యోగ జీవితంలో లాభనష్టాల లెక్కలు అతని వృత్తి ధర్మాన్ని సవాలు చేస్తాయి. రోగి అవసరం ఒకవైపు, సంస్థ లక్ష్యాలు మరోవైపు నిలిచినప్పుడు వైద్యుడు ఎదుర్కొనే మానసిక సంఘర్షణ గురించి సమాజం చాలా అరుదుగానే ఆలోచిస్తుంది. ఈ పరిస్థితికి ప్రభుత్వ విధానాలు కూడా కారణమయ్యాయి. వైద్య విద్యను విపరీతంగా ప్రైవేటీకరిం చడం వల్ల డాక్టర్ కావడం నేడు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారింది. లక్షలు, కోట్ల రూపా యలు ఖర్చు చేసి చదువు పూర్తి చేసిన యువ వైద్యుడు ఉద్యోగంలోకి అడుగుపెట్టే సరికి అప్పుల భారం మోస్తూ ఉంటాడు. వైద్య విద్యను సేవా రంగం కోసం మానవ వనరులను తయారుచేసే ప్రక్రియగా కాకుండా, పెట్టుబడి–లాభాల వ్యవస్థగా మార్చినప్పుడు దాని ప్రభావం వైద్య వృత్తిపై పడటం సహజమే. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితి మరోలా ఉంది. అక్కడ వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. ఖాళీ పోస్టులు సంవత్సరాల తరబడి భర్తీ కావడం లేదు. ఒకే వైద్యుడు వందలాది మంది రోగులకు సేవలు అందించాల్సి వస్తోంది.

అవసరమైన సిబ్బంది, పరికరాలు, మౌలిక సదుపాయాలు లేకపోయినా ప్రజల అసంతృప్తి మాత్రం నేరుగా వైద్యుడిపైనే పడుతోంది. వ్యవస్థ వైఫల్యాలకు ముఖచిత్రంగా వైద్యుడు నిలబడాల్సి వస్తోంది. రోగి మరణించినప్పుడు లేదా చికిత్సలో సమస్యలు వచ్చినప్పుడు వైద్యులపై దాడులు జరగడం ఇటీవలి కాలంలో పెరిగింది. బాధలో ఉన్న కుటుంబాల ఆవేదన అర్థం చేసుకోవాల్సిందే. కానీ వ్యవస్థలోని లోపాలకు బాధ్యులు విధాన నిర్ణేతలు, యాజమాన్యాలు, ప్రభుత్వ నిర్లక్ష్యం అయినప్పటికీ, ఆగ్రహం ఎదుర్కొనేది మాత్రం చివరికి వైద్యుడే. ఇది సమాజం ఆలోచించాల్సిన విషాదకర వాస్తవం. కరోనా మహమ్మారి సమయంలో వైద్యుల పాత్రను దేశం ప్రత్యక్షంగా చూసింది. ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ వారు విధుల్లో నిలిచారు. అనేక మంది తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ సేవలు అందించారు. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఆ సమయంలో వారిని యోధులుగా కొనియాడిన సమాజం, తరువాత వారి పని పరిస్థితుల గురించి పెద్దగా పట్టించుకోలేదు.

ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతాన్ని పాలకులు నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రైవేట్ వైద్య రంగం విచ్చలవిడిగా విస్తరించింది. ప్రజలకు నాణ్యమైన, ఉచిత వైద్య సేవలు అందించాల్సిన ప్రభుత్వ దవాఖానలు సిబ్బంది, మం దులు, మౌలిక వసతుల కొరతతో సతమతమవుతున్నాయి. ఫలితంగా సామాన్య ప్రజలు తప్పనిసరిగా ప్రైవేట్ ఆసుపత్రుల గడప తొక్కాల్సి వస్తోంది. ఈ బలహీనతను అవకాశంగా మార్చుకున్న కార్పొరేట్ ఆసుపత్రులు అధిక ఫీజులు, అనవసర పరీక్షలు, ఖరీదైన చికిత్సలతో ప్రజల జేబులను ఖాళీ చేస్తున్నాయి. ఆరోగ్యం సేవ కాకుండా వ్యాపార వస్తువుగా మారిపోతోంది. ప్రభుత్వ వైద్య వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయడం ప్రైవేట్ వైద్య రంగానికి పరోక్ష ప్రోత్సాహంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల ఆరోగ్య భద్రతను మార్కెట్ శక్తులకు వదిలేయడం సామాజిక న్యాయానికి విరుద్ధం. వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులను కేవలం అభినందించడం సరిపోదు. వారు పనిచేస్తున్న వ్యవస్థను కూడా పరిశీలించాలి.

ప్రజారోగ్యంపై ప్రభుత్వ పెట్టుబడులు పెరగాలి. ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతం కావాలి. కార్పొరేట్ వైద్య రంగంపై సమర్థవంతమైన నియంత్రణ ఉండాలి. ముఖ్యంగా వైద్యుడు తన వృత్తి నైతికతకు అనుగుణంగా పనిచేసే స్వేచ్ఛను కల్పించాలి. నేడు ఆరోగ్యరంగంలో కనిపిస్తున్న సంక్షోభానికి వైద్యుడిని ఒక్కరినే బాధ్యుడిగా చూపించడం సులభం. కానీ అది పూర్తి సత్యం కాదు. రోగి బాధను అర్థం చేసుకోవడం ఎంత అవసరమో, వైద్యుడు ఎదుర్కొంటున్న వ్యవస్థాగత ఒత్తిడిని అర్థం చేసుకోవడం కూడా అంతే అవసరం. ఎందుకంటే అనేక సందర్భాల్లో రోగి, వైద్యుడు ఇద్దరూ ఒకే వ్యవస్థకు బలవుతున్నారు. ప్రజల ఆరోగ్య హక్కు లను కాపాడే విధానాలు, వైద్యుల వృత్తి గౌరవాన్ని నిలబెట్టే వాతావరణం, లాభాల కంటే మానవ జీవి తానికి విలువ ఇచ్చే ఆరోగ్య వ్యవస్థ-వైద్యుల దినోత్సవం సందర్భంగా మనం కోరుకోవాల్సింది ఇదే. అప్పుడే వైద్య వృత్తి పట్ల సమాజ విశ్వాసం బలపడుతుంది. అప్పుడే వైద్యం మళ్లీ సేవా ధర్మంగా నిలుస్తుంది.
(నేడు డాక్టర్స్‌ ‌డే)
డా. రమాదేవి, 9490300863

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -