Tuesday, June 30, 2026
E-PAPER
Homeఎడిట్ పేజికార్పొరేట్ విధానాలపై సమరశంఖం

కార్పొరేట్ విధానాలపై సమరశంఖం

- Advertisement -

దేశాన్ని అభివృద్ధి పేరుతో కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రక్రియ రోజురోజుకూ వేగవంతమవుతోంది. గత పుష్కర కాలంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలను పరిశీలిస్తే, దేశ సంపదను కొద్దిమంది కార్పొరేట్ శక్తుల చేతుల్లో కేంద్రీకరించడం, ప్రభుత్వ రంగాన్ని బలహీన పరచడం, కార్మిక-రైతు హక్కులను కుదించడం, ప్రజలపై పన్నులు, ధరల భారం మోపడం వంటి చర్యలే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తున్నాయి. ‘సంస్కరణలు’ పేరుతో అమలు చేస్తున్న ఈ విధానాలు వాస్తవానికి ప్రజల జీవి తాలను మరింత సంక్షోభంలోకి నెట్టే చర్యలుగా మారాయి. దీనికి కారణం, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థలు, పెద్ద కార్పొరేట్ సంస్థలు సూచిస్తున్న నయా ఉదారవాద విధానాలనే కేంద్రం అక్షరాలా అమలు చేయడం. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికుల ప్రయోజనాలను పక్కనపెట్టి, కొద్దిమంది కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా విధానాలు రూపొందించడం ఆందోళనకరం. అందుకే సిఐటియు, ఎఐకెఎస్‌, ఎఐఎడబ్ల్యుయు సంఘాలు నేటి నుంచి సంయుక్త కార్యచరణకు దిగాయి. ఇవి కేవలం కార్యక్రమాలు కాదు, దేశ ప్రజల జీవన హక్కులను కాపాడే ప్రజా ఉద్యమాలు.

నాలుగు లేబర్ కోడ్‌‌లతో ప్రత్యక్ష దాడి
స్వాతంత్ర్యం తర్వాత కార్మిక ఉద్యమాలు దశాబ్దాల పోరాటాల ద్వారా సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మిక, ఉద్యోగ భద్రత, ట్రేడ్ యూనియన్ హక్కులు, పని పరిస్థితులు, సంక్షేమ ప్రయోజ నాలను ఒక్క దెబ్బతో నిర్వీర్యం చేసే ప్రయత్నమే ఈ కోడ్‌‌లు. ఉద్యోగాల భద్రత లేకుండా, కాంట్రాక్టు విధానాన్ని విస్తరించి, యాజమాన్యాలకు కార్మికులను ఇష్టానుసారంగా తొలగించే అధికారాలు ఇవ్వడం ద్వారా కేంద్ర ప్రభుత్వం కార్మికులను ఆధునిక బానిసత్వం వైపు నెట్టుతోంది. ‘ఈజీ డూయింగ్ ఆఫ్‌ ‌బిజినెస్‌’ పేరుతో కార్మి కుల జీవితాలను ‘ఈజీ ఆఫ్‌ ఎక్స్పొల్టేషన్‌’గా మార్చడం జరుగుతోంది. దీంతో దేశ సంపదను సృష్టించే కార్మికుడే పేదరికంలో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయల పన్ను రాయితీలు ఇస్తూ, మరోవైపు కార్మికులకు కనీస వేతనం చెల్లించడంలో ప్రభుత్వం వెనుకడుగు వేయడం దాని వర్గపక్ష పాతాన్ని బహిర్గతం చేస్తోంది. అందువల్ల నెలకు రూ.26వేలు జాతీయ కనీస వేతనం చెల్లించడం అత్యవసర డిమాండ్‌గా మారింది.

ప్రశ్నార్థకంగా రైతు,కార్మికుల జీవన భద్రత
రైతాంగ పరిస్థితి కూడా భిన్నంగా లేదు. పంటల ఉత్పత్తి వ్యయం విపరీతంగా పెరిగినా, రైతుకు గిట్టుబాటు ధర లభించడం లేదు. ఎన్నికల సమయంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన కేంద్ర కేంద్ర ప్రభుత్వం, రైతులకు చట్టబద్ధమైన కనీస మద్దతు ధర హామీ ఇవ్వడానికి మాత్రం సిద్ధపడడం లేదు. మూడు వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా జరిగిన చారిత్రాత్మక రైతాంగ పోరాటం ముందు ప్రభుత్వం వెనక్కి తగ్గిన ప్పటికీ, కార్పొరేట్ వ్యవసాయ విధానాలను ఇతర మార్గాల్లో అమలు చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. రైతులకు చట్టబద్ధమైన ఎంఎస్‌‌పి అమలు చేయకపోవడం రైతాంగాన్ని మార్కెట్ దయాదాక్షిణ్యాలపై వదిలేయడమే. గ్రామీణ పేదల జీవనాధారంగా నిలిచిన ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్‌ఆర్‌ఈజిఎ)ను కూడా నిర్వీర్యం చేస్తూ విజి-జిరామ్‌‌జిని ప్రవేశపెట్టింది. ఇది అమలైతే హక్కుగా ఉన్న పని దయగా మారుతుంది. అందుకే దీన్ని ప్రతిఒక్కరూ వ్యతిరేకించాలి.

విద్యుత్ ప్రైవేటీకరణ, ప్రజలపై కొత్త భారం
ఇదే సమయంలో విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే ప్రయ త్నాలు వేగవంతమవుతున్నాయి. విద్యుత్ వంటి మౌలిక సేవలను కూడా కార్పొరేట్ లాభాల కోసం తెరవాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దేశవ్యాప్తంగా విద్యుత్ పంపిణీ సంస్థలను బలహీనపరచి, ప్రైవేట్ కంపెనీలకు అప్పగించేందుకు అనేక విధానాలు తీసు కొస్తోంది. విద్యుత్ రంగంలో తీసుకొస్తున్న మార్పులు చివరికి వినియోగదారులపై అధిక ధరల భారం మోపడంతో పాటు, వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ చర్యలను కూడా ప్రమాదంలోకి నెట్టివేస్తోంది. జూలై 1 నుంచి అమలు చేయబోతున్న విబిజి-రామ్‌‌జి , రైతు డిస్కంలు వంటి ప్రతిపాదనలు కూడా విద్యుత్ రంగాన్ని విభజించి ప్రైవేటీకరణ దిశగా నడిపించే ప్రమాదాన్ని కలిగి ఉన్నాయి. విద్యుత్ రంగంలో ప్రభుత్వ బాధ్యతలను తగ్గించి, లాభదాయక రంగాలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం ఈ విధానాల అసలు ఉద్దేశమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల పన్నుల డబ్బుతో నిర్మించిన విద్యుత్ వ్యవస్థను కొద్దిమంది కంపెనీలకు అప్పగించడం ఏ విధంగానూ సమర్థనీయం కాదు.

మిలిటెంట్ పోరాటాలే ప్రజలకు రక్షణ
ఈ పరిస్థితుల్లో సిఐటియు, ఎఐకెఎస్‌, ఎఐఎడబ్ల్యూయులు సమైక్యంగా కేంద్రంపై సమరశంఖం పూరించాయి. గ్రామ గ్రామాన, ప్రతి మండలంలో విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమయ్యాయి. సదస్సులు, కరపత్రాల పంపిణీ, ఇంటింటి ప్రచారం, గ్రూప్ సమావేశాలు, పని స్థలాల్లో ప్రచారం నిర్వహించి ప్రజల్లో అవగాహన, చైతన్యం పెంచేం దుకు పూనుకున్నాయి. అందులో భాగంగా జూలై 29న ఢిల్లీలో జరిగే జాతీయ సదస్సు, ఆగస్టు 10న నిర్వహించనున్న జైల్ భరో కార్యక్రమాన్ని ప్రజలు భారీగా విజయవంతం చేయాలి. ఇది ఒక్కరోజు చేసే పోరాటం కాదు. ప్రజల, కార్మిక, రైతుల జీవన హక్కులను కాపాడుకునే దీర్ఘకాలిక ఉద్యమం. అందుకే కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు, యువత, విద్యుత్ వినియోగదారులు ఐక్యంగా పోరాడితేనే కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఓడించడం సాధ్యమవుతుంది.

ఎస్‌ఎస్‌ఆర్‌ఎ ప్రసాద్‌, 9490300867

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -