నెలాఖరున హైదరాబాద్‌కు కేటీఆర్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
యూకే, యూఎస్‌ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ ఈ నెలాఖరున హైదరాబాద్‌కు తిరిగిరానున్నారు. ఈ నాలుగు రోజుల పాటు కేటీఆర్‌ తన కుటుంబంతో అక్కడ గడపనున్నారు. ఆ తర్వాత ఆయన రాష్ట్రానికి బయలుదేరతారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పెట్టుబడుల ఆకర్షణ కోసం ఈ నెల 16న విదేశాలకు వెళ్లిన కేటీఆర్‌.. రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించి 42 వేల ఉద్యోగాల కల్పనకు కషి చేశారు. ఇంతకు మూడు రెట్లు పరోక్షంగా ఉపాధి లభించేలా పాటుపడ్డారు.
మంత్రి కేటీఆర్‌ తన రెండు వారాల పర్యటనలో వివిధ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలతో బిజీగా గడిపారు. ఈ సందర్భంగా 80కిపైగా బిజినెస్‌ సమావేశాలు, వివిధ అంశాలపై నిర్వహించిన 5 రౌండ్‌టేబుల్‌ సమావేశాల్లో పాల్గొన్నారు. రెండు ప్రపంచ సదస్సుల్లో ప్రసంగించి తెలంగాణ రాష్ట్ర ప్రగతి, ఇక్కడి వ్యాపార అవకాశాలను ప్రపంచానికి చాటిచెప్పారు. యూకే పర్యటనలో భాగంగా లండన్‌ను సందర్శించిన కేటీఆర్‌, అమెరికాలో న్యూయార్క్‌, వాషింగ్టన్‌ డీసీ, హ్యూస్టన్‌, హెండర్సన్‌, బూస్టన్‌ తదితర నగరాల్లో పర్యటించారు. ఆయా చోట్ల దిగ్గజ సంస్థలతో భేటీ అయి బీఎఫ్‌ఎస్‌ఐ(బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ సేవలు, బీమా రంగం) ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌, ఐటీ, ఐటీఈఎస్‌, మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏరోస్పేస్‌, డిఫెన్స్‌, లైఫ్‌ సైన్సెస్‌, మెడికల్‌ డివైజెస్‌, డిజిటల్‌ సొల్యూషన్స్‌, ఇన్నోవేషన్‌, డాటా సెంటర్స్‌, ఆటోమోటివ్‌ అండ్‌ ఈవీ తదితర రంగాలనుంచి పెట్టుబడులను రాష్ట్రానికి తెచ్చేలా కషి చేశారు. ఈ మేరకు ఆయన కార్యాలయం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.

Spread the love