కేటీఆర్‌ X రేవంత్‌రెడ్డి

KTR X Revanth Reddy– కొడంగల్‌లో గెలుపే లక్ష్యంగా ప్రయత్నాలు
– ఆ రెండు పార్టీల రాష్ట్ర నాయకత్వాలకు అగ్ని పరీక్ష
– రేవంత్‌రెడ్డికి ఉచ్చుబిగించేందుకు బీఆర్‌ఎస్‌ వ్యూహం
– గెలుపు బాధ్యతలు హరీశ్‌ నుంచి కేటీఆర్‌కు..!
అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌ నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవడం బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అగ్రనాయకత్వానికి సవాల్‌గా మారింది. కొడంగల్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి బరిలో నిలిచేందుకు సిద్దమయ్యారు. ఈ ప్రాంతంలో రేవంత్‌ను ఓడించాలన్నదే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ పావులు కదుపుతోంది. కొడంగల్‌ను మరోసారి కైవసం చేసుకోవడానికి బీఆర్‌ఎస్‌ కేటీఆర్‌ను రంగంలోకి దించేందుకు రెడీ అయినట్టు ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. దాంతో కొడంగల్‌ రాజకీయం రేవంత్‌ వర్సెస్‌ కేటీఆర్‌ అన్న చందంగా ఉత్కంఠ భరితంగా మారింది.
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాల్లో రోజుకో పరిణామం చోటు చేసుకుంటుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నయంగా కాంగ్రెస్‌ ఊహించని వేగంతో పుంజుకున్నది. ఎదురేలేదనుకున్న అధికారపక్షానికి గుబులు పుట్టిస్తున్నది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రధాన నాయకులు బరిలో నిలిచే నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ ఇప్పటి నుంచే ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రత్యేకించి రేవంత్‌రెడ్డి టార్గెట్‌గా కొడంగల్‌పై కేంద్రీకరించింది. కొడంగల్‌ నియోజవకవర్గం నుంచి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి తప్ప మరో దరఖాస్తు రాలేదు. దాంతో అప్పటి దాకా రేవంత్‌రెడ్డి మల్కాజిగిరి, ఎల్బీనగర్‌ ప్రాంతాల నుంచి పోటీ చేస్తారన్న వార్తలకు చెక్‌ పెట్టినట్టయింది. దీనికి తోడు రేవంత్‌రెడ్డి కచ్చితంగా కొడంగల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచే బరిలో నిలుస్తానని కార్యకర్తల సమావేశంలో స్పష్టం చేశారు. దాంతో రేవంత్‌రెడ్డికి చెక్‌పెట్టడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ పావులు కదుపుతోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రేవంత్‌రెడ్డి ఓటమిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌కు ట్రిబుల్‌ షూటర్‌గా ఉన్న హరీశ్‌రావుకు తోడు తన ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. హరీశ్‌రావు తమ రాజకీయ వ్యూహాలతో పాటు అంగబలం, అర్థబలం, అధికార బలం ప్రయోగించి స్వల్ప మెజార్టితో ప్రస్తుత ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని గట్టెక్కించారు. అయితే ప్రస్తుతం కొడంగల్‌ నుంచి రేవంత్‌రెెడ్డిని ఓడించే బాధ్యతను కేటీఆర్‌కు అప్పగించనున్నట్టు ఆ పార్టీ శ్రేణులు తెలుపుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంతో పాటు కొడంగల్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ వేవ్‌ కొనసాగుతున్న పరిస్థితులను గమనించిన కేటీఆర్‌ ఇప్పటికే అండర్‌ గ్రౌండ్‌ వర్క్‌ మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. రాబోయే కాలంలో కాబోయే సీఎం అన్న మార్కును చాటుకున్న కేటీఆర్‌కు ఇప్పుడు కొడంగల్‌ గెలుపు అగ్నిపరీక్ష కానుంది.
కొడంగల్‌ గెలుపు కాంగ్రెస్‌ కీలకం
రాష్ట్రంలో కాంగ్రెస్‌ గట్టెక్కించేందుకు టీపీసీసీ అధ్యక్షుని గెలుపు కాంగ్రెస్‌కు కీలకం. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి తేవడంతో పాటు రేవంత్‌రెడ్డికి తన గెలుపు కూడా కీలకం. అందుకే కొడంగల్‌పై ఫోకస్‌ పెట్టి రేవంత్‌ను నియోజకవర్గానికే పరిమితం చేయడం ద్వారా అతన్ని రాష్ట్రవ్యాపిత ప్రచారాన్ని, ప్రభావాన్ని అడ్డుకోవాలన్నది బీఆర్‌ఎస్‌ వ్యూహం. అయితే ఈ సవాల్‌ను ఎదుర్కోవడానికి రేవంత్‌ సైతం సిద్ధమైనట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలో కాంగ్రెస్‌కున్న బలమైన ఓటు బ్యాంకును కాపాడుకోవడంతోపాటు పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్‌ నాయకులను పార్టీలోకి చేర్చుకోవడం, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు టచ్‌లోకి వెళ్లి వారిని మచ్చిక చేసుకోవడంలో రేవంత్‌రెడ్డి తీవ్ర కృషి చేస్తున్నారు. ఎవరి ప్రయత్నాలు ఫలిస్తాయో.. ఎవరి పంతం నెగ్గుతుందో చూడాలి మరి.

Spread the love