నేడు ఆర్మూర్ కు కేటీఆర్ రాక.. భారీ ర్యాలీ

నవ తెలంగాణ- ఆర్మూర్: నియోజక వర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి  నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆర్మూర్ నుంచి ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై హ్యాట్రిక్ దిశగా దూసుకుపోతున్న జీవన్ రెడ్డి ముచ్చటగా మూడోసారి వేస్తున్న నామినేషన్ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పాల్గొన నున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తో పాటు జిల్లా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నేతలు జీవన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.
కాగా జీవన్ రెడ్డి నామినేషన్ ఘట్టాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. 50వేల మందితో ర్యాలీ జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం జీవన్ రెడ్డికి మద్దతుగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ముఖ్యంగా పలు సంక్షేమ పథకాల లబ్దిదారులు జీవన్ రెడ్డికి మద్దతుగా కదం తొక్కుతున్నారు. ఇదిలావుండగా జీవన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి మంత్రి కేటీఆర్ గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు పట్టణానికి చేరుకుంటారు. అనంతరం ఆలూరు బై పాస్ రోడ్ వద్ద బీఆర్ఎస్ ర్యాలీనుద్దేశించి ప్రసంగిస్తారు. తరువాత ఆలూరు బై పాస్ రోడ్  నుమచి ఎమ్మార్వో ఆఫీస్ వరకు 50వేల మందితో ర్యాలీ జరుగుతుంది. మంత్రి కేటీఆర్ ర్యాలీ అగ్రభాగాన సాగి జీవన్ రెడ్డి  నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు.
Spread the love