కార్మికోద్యమ నేత నీలిమా మైత్రా కన్నుమూత

కార్మికోద్యమ నేత నీలిమా మైత్రా కన్నుమూత– సీఐటీయూ సంతాపం
న్యూఢిల్లీ : కార్మికోద్యమ ప్రముఖ నేత, వర్కింగ్‌ వుమెన్‌, స్కీమ్‌ వర్కర్ల ముఖ్యంగా అంగన్‌వాడీ ఉద్యమాల నిర్వాహకురాలు నీలిమా మైత్రా కోల్‌కతాలోని నర్సింగ్‌హోంలో శుక్రవారం కన్నుమూశారు. దీర్ఘకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆమె వయస్సు 92సంవత్సరాలు. ఆమెది ఆరు దశాబ్దాలకు పైగా సాగిన రాజకీయ జీవితం. యువతగా వున్న సమయంలో ఉత్తర కోల్‌కతాలో మహిళా ఆర్గనైజేషన్‌లో పనిచేయడం ఆరంభించారు. ఇక ఆ తర్వాత రాష్ట్రంలో వామపక్ష ఉద్యమంలో ఆమె చాలా క్రియాశీలంగా పనిచేస్తూ వచ్చారు. తనపై జరిగిన అన్ని రకాల దాడులను నిర్భయంగా తట్టుకుని మరీ ఆమె పోరాటం సాగించారు. పాలక పక్షం, రాజకీయ గూండాలు సాగించిన సెమీ ఫాసిస్ట్‌ తరహా దాడులను కూడా ఆమె ఎదుర్కొన్నారు. తదనంతరం ఆమె అంగన్‌వాడీ వర్కర్లను, హెల్పర్లను సంఘటితం చేయనారంభించారు. ఆ యూనియన్‌ను పశ్చిమ బెంగాల్‌లోనే సీఐటీయూకు అనుబంధంగా గల అతిపెద్ద యూనియన్లలో ఒకటిగా రూపొందించడంలో ఆమె పాత్ర ఎనలేనిది. జాతీయ స్థాయిలో కూడా అంగన్‌వాడీలు, హెల్పర్లను సంఘటితం చేయడానికి ఆమె పాటుపడ్డారు. 1991లో అఖిల భారత అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల సమాఖ్య (ఎఐఎఫ్‌ఎడబ్ల్యుహెచ్‌) ఏర్పాటులో చాలా కీలకంగా వ్యవహరించారు. ఆ సమాఖ్యకు ఆమె వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1998లో అధ్యక్షురాలయ్యారు. 2019 వరకు ఆమె ఆ పదవిలో కొనసాగారు. దేశంలో అంగన్‌వాడీ ఉద్యోగుల సంఘాల్లో అతిపెద్ద సంఘంగా ఎఐఎఫ్‌ఎడబ్ల్యుహెచ్‌ను అభివృద్ధిపరచడానికి ఆమె దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పర్యటించారు.
వయసు ఎంతలా మీదపడినా ఆమె చివరి వరకు చురుగ్గానే పనిచేశారు. చనిపోవడానికి కొన్ని వారాలు ముందు వరకు ఆమె యూనియన్‌ కార్యాలయానికి వస్తూ క్రియాశీలంగా కార్యకలాపాల్లో పాల్గొన్నారు. సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడు, దేశంలో బీమా ఉద్యోగుల ఉద్యమ వ్యవస్థాపక నేతల్లో ఒకరైన సునీల్‌ మైత్రాను ఆమె వివాహం చేసుకున్నారు. వారి కుమారులు కూడా కార్మికోద్యమంలోని వారి వారి రంగాల్లో క్రియాశీలంగా పనిచేస్తున్నారు.
సీఐటీయూ సంతాపం
ప్రముఖ కార్మిక నేత, మహిళా ఉద్యమాలను అగ్ర భాగాన వుంటూ సమర్ధవంతంగా నడిపించిన కార్యదక్షురాలు నీలిమా మైత్రా మృతికి సీఐటీయూ తీవ్రంగా సంతాపాన్ని ప్రకటించింది. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేసింది. ఉద్యమానికి ఆమె చేసిన విశేష సేవలకు గానూ ఘనంగా నివాళులర్పించింది. ఆమె మృతితో దేశంలో కార్మికోద్యమం ముఖ్యంగా వర్కింగ్‌ వుమెన్‌ ఉద్యమం కోలుకోలేని నష్టాన్ని ఎదుర్కొంటుందని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Spread the love