రైతు జీవితాన్ని నాశనం చేస్తున్న పాలకులు
పచ్చని పొలాల్లో కాలుష్య పరిశ్రమలు
ప్రకృతి వినాశనంతో భవిష్యత్‌లో ఆహార సంక్షోభం : అఖిలపక్ష సమావేశంలో వక్తలు
నవతెలంగాణ- హిమాయత్ నగర్
ఫ్యూచర్ సిటీ పేరుతో భూములను ఫార్మా కంపెనీలకు కట్టబెట్టాలని చూస్తున్నారని, భూములను లాక్కోవడం అంటే అది రైతు ఆధారం, జీవితాన్ని నాశనం చేయడమేనని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ, తెలంగాణ పీపుల్స్ జేఏసీ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ‘ఫార్మా సిటీ ప్రాంతంలో ఏం జరుగుతుంది’ అనే అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) అధ్యక్షులు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిస్సిగ్గుగా 13,500 ఎకరాల భూమిని ఫార్మాసిటీ కోసం లాక్కుందని, నేడు ఫ్యూచర్ సిటీ కోసం 30 వేల ఎకరాలు లాక్కొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు.
ఫార్మా సిటీలో ఎన్ని ఉద్యోగాలు ఇస్తారో స్పష్టంగా చెప్పడం లేదన్నారు. డేటా సెంటర్ల కారణంగా ఎంత పొల్యూషన్ అవుతుందో అంచనా వేయలేకపోతున్నారని, వాటి వల్ల పక్షులు కూడా బతకడం లేదని అన్నారు. రంగారెడ్డి జిల్లాలో రైతుల పట్టా భూముల జోలికి ప్రభుత్వం రావొద్దని హెచ్చరించారు. కొన్నిచోట్ల భూస్వాముల భూములను వదిలేసి, గిరిజనుల భూములు లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బీఆర్‌ఎస్ హయాంలో రైతులకు, ఉద్యమకారులకు జరిగిన నష్టంలో తాను కూడా భాగస్వామ్యంగా ఉన్నానని, ఆ పాపాలను కడుక్కోడానికి ఇప్పుడు వారి పక్షాన కొట్లాడుతున్నానని స్పష్టం చేశారు.
హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. రియల్ ఎస్టేట్ విస్తరణ వల్ల వ్యవసాయ భూములు కనుమరుగవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతిని నాశనం చేస్తే భవిష్యత్‌లో ఆహార సంక్షోభం తప్పదని హెచ్చరిం చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫార్మాసిటీ రైతులకు అండగా ఉంటామని, భూములు తిరిగి ఇస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చాక మాట మార్చారని విమర్శించారు. నేడు కాలుష్యం వల్ల గాలిని కొనుకొనే పరిస్థితి ఏర్పడిం దన్నారు. ప్రొఫెసర్ జి.హరగోపాల్ మాట్లాడుతూ.. పాలకులు అభివృద్ధి పేరిట రైతాంగాన్ని, రాజ్యం మధ్య వైరుధ్యం సృష్టిస్తున్నారన్నారు. పచ్చని పొలాల్లో కాలుష్య పరిశ్రమలు ఏర్పాటు చేయడంపై రైతులు ప్రశ్నిస్తున్నారని తెలిపారు. పటాన్‌చెరు ప్రాంతంలో కాలుష్య ప్రభావాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నామని అన్నారు. ప్రజా ఉద్యమాల ద్వారానే పాలకులలో మార్పు తీసుకురావాలన్నారు.
ధర్మ సమాజ్ పార్టీ నేత విశారదన్ మహారాజ్, వీకేసీ పార్టీ నేత తెలంగాణ శ్యామ్, సీపీఐ నేత నరేంద్రప్రసాద్ తదితరులు మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూరు మండలాల పరిధిలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మొదలైన ఫార్మా సిటీ ప్రతిపాదనను, తప్పుడు పద్ధతుల్లో సాగించిన భూసేకరణను రైతులు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ప్రకృతిని నాశనం చేసి, డబ్బులు సంపాదించడం సరి కాదన్నారు. రైతుల ఉద్యమానికి పౌర హక్కుల సంఘం మద్దతుం టుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ సరస్వతి కవుల, కో-కన్వీనర్ కన్నెగంటి రవి, విస్సా కిరణ్, ఆప్ హేమ, ఉషశ్రీ, సబితా తదితరులు పాల్గొన్నారు.
ఫ్యూచర్ సిటీ పేరుతో ఫార్మా కంపెనీలకు భూములు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



