కాందిశీకుల భూములను కాపాడాలి

కాందిశీకుల భూములను కాపాడాలి– 401 ఎకరాల భూములను భూమిలేని పేదలకు పంచాలి
– తెలంగాణ వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్‌రాములు
నవతెలంగాణ-చౌటుప్పల్‌ రూరల్‌
చౌటుప్పల్‌ మండలం దండు మల్కాపురం గ్రామ రెవెన్యూ పరిధిలో కాందిశీకుల భూములను భూబకాసురుల నుంచి కాపాడాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌. వెంకట్రాములు డిమాండ్‌ చేశారు. శనివారం యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండల కార్మిక సంఘం బృందంతో కలిసి సర్వేనెంబర్‌ 114,115లలో కాందిశీకుల భూములను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, అధికార పార్టీ పెద్దలు కలిసి 401 ఎకరాల భూములను కాజేయడానికి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. జిల్లా కలెక్టర్‌, చౌటుప్పల్‌ ఆర్డీఓ, తహసీల్దార్‌ మంత్రి జగదీశ్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మాటలు వినకపోవడంతో రాత్రికి రాత్రే వారిని బదిలీ చేయించారని అన్నారు. కాందిశీకుల వారసుల పేర్లపై దొంగ చాటుగా భూములను ఆక్రమించుకునేందుకు యత్నించారని విమర్శించారు. ఈవిషయం మీడియాకు లీకు కావడంతో విషయం వెలుగులోకొచ్చిందన్నారు. 1952 సంవత్సరంలో కాందిశీకులకు 401 ఎకరాల భూములను కేటాయించగా వారు దేశ విభజనలో పాకిస్తాన్‌కు వెళ్లారన్నారు. అప్పటినుండి ఆ భూములు పడావుగా ఉందన్నారు. ఈ మధ్యకాలంలో కొంతమంది తప్పుడు ధృవపత్రాలు సృష్టించి ఆ భూములకు మేమే వారసులమంటూ చూస్తున్నారని విమర్శించారు. ఒకట్రెండు కుటుం బాలకు వంద ఎకరాల భూములు ఎట్లా వస్తాయని ఆయన ప్రశ్నించారు. నిజమైన వారసులు ఎవరో తేల్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నిరుపేదలకు పంచకపోతే తమ సంఘం ఆధ్వర్యంలో ఇండ్లు, భూములు లేని నిరుపేదలకు పంచుతామని హెచ్చరించారు. చౌటుప్పల్‌ మండలంలో ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో సర్వే చేసి ఇండ్లస్థలాలు, భూములు లేని నిరుపేదలకు పంచాలని కోరారు. రానున్న కాలంలో ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఉద్యమాలు చేపడతామన్నారు. కొంతమంది ఆ భూములను కాజేయాలని కుట్రలు చేస్తున్నారని పెద్దఎత్తున వార్తలు వస్తున్నాయన్నారు. ఈ వ్యవహారంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ప్రకటన చేయాలని కోరారు. జిల్లా రెవెన్యూ యంత్రాంగం స్పందించాలని డిమాండ్‌ చేశారు.
ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ,రాష్ట్ర కమిటీ సభ్యులు, సీపీఐ(ఎం) మండలకార్యదర్శి గంగాదేవి సైదులు, జిల్లా సహాయ కార్యదర్శి గుంటోజు శ్రీనివాస్‌చారి, మండల ప్రధానకార్యదర్శి బొజ్జ బాలయ్య, జిల్లా కమిటీ సభ్యులు బోయ యాదయ్య, మానే సాలయ్య, మండల సహాయకార్యదర్శి మీసాల శ్రీనివాస్‌, గ్రామ నాయకులు గుండ్ల మహేష్‌, చెంచలమదారి, కాసం వెంకటేష్‌ పాల్గొన్నారు.

Spread the love