– వరల్డ్‌కప్‌పై రోహిత్, కోహ్లి గురి
– చీఫ్ కోచ్ ద్రవిడ్‌కు సైతం పరీక్షే
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ.. భారత క్రికెట్ దిగ్గజాలు. గత దశాబ్ద కాలంగా టీమ్ ఇండియాను ఈ ఇద్దరు క్రికెటర్లు ముందుండి నడిపిస్తున్నారు. కోహ్లి కెప్టెన్సీలో రోహిత్ శర్మ విజయాల్లో విలువైన పాత్ర పోషించగా.. ఇప్పుడు రోహిత్ సారథ్యంలో కోహ్లి అటువంటి బాధ్యతే తీసుకున్నాడు. కెప్టెన్సీ కుర్చీలో ఎవరు కూర్చున్నా.. టీమ్ ఇండియా గెలుపు భారం ఈ ఇద్దరిదే. ఇప్పుడు ఈ ఇద్దరు మేటీ క్రికెటర్లకు ఐసీసీ టైటిల్ సమస్య ఎదురైంది. 2023 వన్డే వరల్డ్‌కప్ విజయానికి అడుగు దూరంలో నిలిచిన భారత్‌ను ఈసారి 2024 టీ20 ప్రపంచకప్‌లో పోడియంపై నిలబెట్టేందుకు కోహ్లి, రోహిత్ పట్టుదలగా ఉన్నారు. 2026 టీ20 ప్రపంచకప్‌లో ఆడే అవకాశం లేకపోవటంతో.. కప్పు కొట్టేందుకు కోహ్లి, రోహిత్‌కు ఇదే ఆఖరు అవకాశం!.
నవతెలంగాణ క్రీడావిభాగం
రెండు నెలల వేసవి వినోదం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ముగిసింది. ఐసీసీ 2024 టీ20 ప్రపంచకప్ జట్టులో నిలిచిన ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఒకరికొకరు భిన్నమైన ప్రదర్శనలు చేశారు. ఐపీఎల్ మెరుపుల ఆత్మవిశ్వాసంతో కొంతమంది అమెరికా చేరుకుంటే.. భారత జెర్సీ ధరించే దీమాతో మరికొందరు యుఎస్‌ఏలో అడుగుపెట్టారు. విరాట్ కోహ్లి మినహా జట్టులోని అందరూ ప్రాక్టీస్ మొదలెట్టారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు తొలిసారి ఆతిథ్యం వహిస్తున్న యుఎస్‌ఏ వాతావరణం, పరిస్థితులకు అలవాటు పడేందుకు టీమ్ ఇండియా ఫోకస్ పెట్టింది. ఫ్లడ్‌లైట్ల వెలుతురులోనే ఎక్కువగా వైట్‌బాల్ క్రికెట్ ఆడే టీమ్ ఇండియా.. ఇక్కడ ఉదయం వేళల్లో ధనాధన్ దంచుడుకు అలవాటు పడేందుకు ప్రయత్నం చేస్తోంది. టీ20 ప్రపంచకప్ కప్పుతోనే స్వదేశానికి రావలనే సంకల్పంతో టీమ్ ఇండియా ఉండగా.. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సహా చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఐసీసీ టైటిల్ సమస్యలో పడ్డారు!.
కసిగా రోహిత్ : రోహిత్ శర్మ ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ కెప్టెన్సీ పగ్గాలు హార్దిక్ పాండ్యకు అప్పగించి.. ఆశించిన ప్రదర్శన చేయలేదు. సూపర్ కింగ్స్‌పై 61 బంతుల్లో సెంచరీ మినహా హిట్‌మ్యాన్ నుంచి చెప్పుకోదగిన ప్రదర్శన రాలేదు. 417 పరుగులతో సీజన్‌ను ముగించిన రోహిత్ శర్మ.. భారత జట్టు తరఫున బరిలోకి దిగితే పూర్తి భిన్నమైన ఆటగాడు. విధ్వంసక బ్యాటింగ్, భారీ ఇన్నింగ్స్‌లకు రోహిత్ శర్మ చిరునామా. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో భారత్‌ను ఫైనల్స్‌కు చేర్చిన రోహిత్ శర్మ.. ఆఖరు మెట్టుపై తడబడింది. టీమ్ ఇండియా ఫైనల్ ప్రస్థానంలో రోహిత్ శర్మ అద్వితీయ పాత్ర పోషించాడు. 50 ఓవర్ల ఫార్మాట్‌లోనే ఏకంగా టీ20 తరహా ఇన్నింగ్స్‌లు ఆడాడు. పవర్‌ప్లే పది ఓవర్లలోనే ప్రత్యర్థిపై మానసికంగా పైచేయి సాధించగల ఇన్నింగ్స్‌లతో కదం తొక్కాడు. నాయకుడిగా స్వార్థం లేని ప్రదర్శన చేసిన రోహిత్ శర్మ టీ20 ప్రపంచకప్‌లోనూ అటువంటి ప్రదర్శన పునరావృతం చేసే అవకాశం ఉంది. అయితే, నాయకుడిగా రోహిత్ శర్మ కఠిన సవాల్ ఎదుర్కొంటున్నాడు. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌కు ఐదు ట్రోఫీలు అందించిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. భారత్ ఐసీసీ టైటిల్ దాహం తీర్చుతాడనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. కోహ్లి నుంచి కెప్టెన్సీ తీసుకున్నా.. రోహిత్ శర్మ భారత్‌కు ఐసీసీ టైటిల్ సాధించలేదు. దీంతో నాయకుడిగా రోహిత్ శర్మ టైటిల్ కొట్టాలనే కసితో ఉన్నాడు.
విరాట్ పట్టుదల : ఐపీఎల్ 17వ సీజన్‌లో విరాట్ కోహ్లి 741 పరుగులు చేశాడు. కోహ్లి జట్టు ఆర్సీబీ అంచనాలను అందుకోలేదు. కానీ పరుగుల యంత్రం ఎప్పటిలాగే తన పని సాఫీగా చేశాడు. కానీ విరాట్ కోహ్లి ఓ విమర్శ ఎదుర్కొంటున్నాడు. పరుగుల పరంగా ఫర్వాలేదు కానీ పరుగుల వేటలో వేగం ఆశించినట్టు లేదని ప్రధాన విమర్శ. టీ20 క్రికెట్‌లో సగటుకు విలువ ఉండదు. స్ట్రయిక్‌రేట్‌కు మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు అభిషేక్ శర్మ ఏ ఇన్నింగ్స్‌లోనూ పట్టుమని 30 బంతులు ఆడలేదు కానీ 200కు పైగా స్ట్రయిక్‌రేట్‌తో సుమారు 500 పరుగులు సాధించాడు. ఆధునిక టీ20 వేగాన్ని కోహ్లి అందుకోవటంలో విఫలమవుతున్నాడు. అయినా, టీమ్ ఇండియాకు అతడి నిలకడ అవసరం. నిలకడైన ప్రదర్శనకు వేగాన్ని సైతం జోడిస్తే టాప్ ఆర్డర్‌లో భారత్‌కు ఎదురుండదు. రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్‌గా వస్తాడా.. లేదంటే యశస్వి, రోహిత్ ఓపెనింగ్ జోడిని అనుసరిస్తూ నం.3 బ్యాటర్‌గా క్రీజులో వస్తాడా అనేది ఇంకా తేలాల్సి ఉంది. బ్యాటింగ్‌కు ఏ స్థానంలో వచ్చినా ప్రపంచకప్‌లో జట్టుతో స్థానానికి పూర్తి న్యాయం చేయాలనే ఆలోచనలో కోహ్లి ఉన్నాడు. 2022 ప్రపంచకప్‌లో మరపురాని ఇన్నింగ్స్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఊపేసిన విరాట్ కోహ్లి.. ఇప్పుడు అమెరికాలోనూ అదే తరహా ప్రదర్శన పునరావృతం చేసేందుకు పట్టుదలగా ఎదురుచూస్తున్నాడు.
చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కెరీర్‌లోనూ ఐసీసీ టైటిల్ కనిపించదు. ఆటగాడిగా ఐసీసీ ట్రోఫీ అందుకోని రాహుల్ ద్రవిడ్..కోచ్‌గానైనా ఆ కల నెరవేర్చుకోవాలని తపిస్తున్నాడు. 2023 వరల్డ్‌కప్ తృటిలో చేజారినా.. 2024 టీ20 ప్రపంచకప్‌ను పట్టుకోవాలనే సంకల్పం ద్రవిడ్‌లో ఎక్కువగా ఉంది. 2007 ఐసీసీ టీ20 ప్రపంచకప్ విజయంలో రోహిత్ శర్మ, 2011 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ విజయంలో విరాట్ కోహ్లి భాగస్వాములు. ఈ రెండు ఐసీసీ టైటిళ్లు కెరీర్ ఆరంభంలో అందుకున్నవే. భారత క్రికెట్ పతాకాధారులుగా ఎదిగిన తర్వాత దేశానికి ఓ ఐసీసీ టైటిల్ అందించలేదనే వేదన కోహ్లి, రోహిత్‌లో ఉండిపోయింది. ఆ లోటు 2024 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌తో తీరనుందా?! చూడాలి.