గుకేశ్‌ అదరహో..

గుకేశ్‌ అదరహో..– అలిరెజాపై మెరుపు విజయం
– అగ్రస్థానం మరింత సుస్థిరం
– ఫిడె క్యాండిడేట్స్‌ చెస్‌ 2024
టోరంటో (యుఎస్‌ఏ) : 17 ఏండ్ల యువ గ్రాండ్‌మాస్టర్‌, భారత నయా చదరంగ మేధావి డి. గుకేశ్‌ అదరగొట్టాడు. ప్రతిష్టాత్మక ఫిడె క్యాండిడేట్స్‌ టోర్నమెంట్‌లో కీలక సమయంలో అద్భుత విజయం సాధించాడు. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో పోటీపడే అర్హత సాధించేందుకు అడుగు దూరంలోనే నిలిచాడు. ఆదివారం టోరంటోలో జరిగిన 13వ రౌండ్‌ మ్యాచ్‌లో డి.గుకేశ్‌ మెరుపు విజయం సాధించాడు. అలిరెజా ఫిరౌజ్జాపై గెలుపొంది అగ్రస్థానంలో నిలిచాడు. రురు లోపేజ్‌ బెర్లిన్‌లో 63 ఎత్తుల్లో గుకేశ్‌ పైచేయి సాధించాడు. తెలివిగా ఎత్తులు వేసిన గుకేశ్‌.. కచ్చితమైన ఎత్తులతో అలిరెజాను బోల్తా కొట్టించాడు. దీంతో 8.5 పాయింట్లతో డి. గుకేశ్‌ అగ్రస్థానంలో నిలిచాడు. ఐయాన్‌ నెపోమ్నియాచి (రష్యా) 13వ రౌండ్‌ మ్యాచ్‌ను డ్రా చేసుకున్నాడు. హికారు నకమురు (యుఎస్‌ఏ)తో రురు లోపెజ్‌లో 27 ఎత్తుల్లోనే డ్రాకు అంగీకరించాడు. ప్రజ్ఞానందపై విజయంతో ఫాబినాయో (యుఎస్‌ఏ) సైతం ఉమ్మడిగా రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ టోర్నీలో తొలిసారి నెపోమ్నియాచి అగ్రస్థానం కోల్పోయాడు.
ఒక్క అడుగు : ప్రపంచ చెస్‌ చాంపియన్‌షిప్స్‌లో చైనా దిగ్గజం డింగ్‌ లైరెన్‌ను ఢకొీట్టే చాలెంజర్‌గా నిలిచేందుకు గుకేశ్‌ అడుగు దూరంలో నిలిచాడు. సోమవారం జరిగే ఆఖరు రౌండ్లో హికారు నకముర తో గుకేశ్‌ ఆడనున్నాడు. నకమురపై విజయం సాధిస్తే ఎటువంటి సమీకరణాలతో సంబంధం లేకుండా గుకేశ్‌ క్యాండిడేట్స్‌ విజేతగా అవతరి స్తాడు. ఒకవేళ నకమురతో మ్యాచ్‌ను గుకేశ్‌ డ్రా చేసుకున్నా..భారత గ్రాండ్‌మాస్టర్‌కు చాలెంజర్‌గా నిలిచే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. ఫాబియా నో, నెపోమ్నియాచి మ్యాచ్‌ డ్రా ముగిస్తే గుకేశ్‌కు తిరుగులేదు. కానీ నెపోమ్నియాచి నెగ్గినా.. గుకేశ్‌కు టైబ్రేక్‌ గేమ్‌ల రూపంలో మరో అవకాశం లభించ నుంది. సోమవారం చివరి రౌండ్‌లో నకమురతో గుకేశ్‌ నల్ల పావులతో ఎత్తులు వేయనున్నాడు.

Spread the love