ఈడెన్‌లో థ్రిల్లర్‌!

ఈడెన్‌లో థ్రిల్లర్‌!– ఒక్క పరుగుతో కోల్‌కత గెలుపు
– ఛేదనలో బెంగళూర్‌కు తప్పని నిరాశ
– కోల్‌కత 222/6, బెంగళూర్‌ 221/10
ఈడెన్‌గార్డెన్స్‌లో భారీ స్కోర్ల థ్రిల్లర్‌. ధనాధన్‌ మోత మోగిన మ్యాచ్‌లో ఆతిథ్య కోల్‌కత నైట్‌రైడర్స్‌ పైచేయి సాధించింది. 223 పరుగుల ఛేదనలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ ఆఖరు బంతి వరకు పోరాడినా.. ఒక్క పరుగు తేడాతో పరాజయం పాలైంది. విల్‌ జాక్స్‌ (55), రజత్‌ పాటిదార్‌ (52), కరన్‌ శర్మ (20) పోరాడినా గెలుపు గీతకు బెంగళూర్‌ పరుగు దూరంలో నిలిచింది. ఫిల్‌ సాల్ట్‌ (48), శ్రేయస్‌ అయ్యర్‌ (50), రమణ్‌దీప్‌ సింగ్‌ (24 నాటౌట్‌) రాణించటంతో తొలుత కోల్‌కత నైట్‌రైడర్స్‌ 222/6 పరుగులు చేసింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన అండ్రీ రసెల్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు.
నవతెలంగాణ-కోల్‌కత
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ కథ ముగిసే!. ఐపీఎల్‌ 17 ప్లేఆఫ్స్‌ రేసులో నిలిచేందుకు తాడోపేడో తేల్చుకోవాల్సిన తరుణంలో కోల్‌కత నైట్‌రైడర్స్‌ చేతిలో బెంగళూర్‌కు భంగపాటు తప్పలేదు. సీజన్లో ఏడో పరాజయం చవిచూసిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ దాదాపుగా ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది!. 223 పరుగుల రికార్డు ఛేదనలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ ఆఖరు బంతి వరకు పోరాడింది. విల్‌ జాక్స్‌ (55, 32 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), రజత్‌ పాటిదార్‌ (52, 23 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో మెరువగా.. కరన్‌ శర్మ (20, 7 బంతుల్లో 3 సిక్స్‌లు) ఆఖర్లో ఆశలు రేపినా ప్రయోజనం దక్కలేదు. 20 ఓవర్లలో పది వికెట్లకు 221 పరుగులే చేసిన బెంగళూర్‌.. ఏడో ఓటమి మూటగట్టుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కత నైట్‌రైడర్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 222 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ (48, 14 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), శ్రేయస్‌ అయ్యర్‌ (50, 36 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్థ సెంచరీలతో కదం తొక్కారు. రింకూ సింగ్‌ (24), అండ్రీ రసెల్‌ (27), రమణ్‌దీప్‌ సింగ్‌ (24 నాటౌట్‌) ఆకట్టుకున్నారు. కోల్‌కత నైట్‌రైడర్స్‌కు ఏడు మ్యాచుల్లో ఇది ఐదో విజయం కాగా.. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌కు ఎనిమిది మ్యాచుల్లో ఇది ఏడో పరాజయం.
ఆఖరు వరకు పోరాడినా.. : 223 పరుగుల ఛేదనలో బెంగళూర్‌కు ఆరంభం దక్కలేదు. విరాట్‌ కోహ్లి (18) రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో ధనాధన్‌తో చెలరేగాడు. కానీ హర్షిత్‌ రానా ఓవర్లో రిటర్న్‌ క్యాచౌట్‌ అయ్యాడు. నో బాల్‌ కోసం టీవీ అంపైర్‌ సమీక్ష కోరినా.. కోహ్లి క్రీజు బయట ఉండటంతో డగౌట్‌కు చేరుకోక తప్పలేదు. కెప్టెన్‌ డుప్లెసిస్‌ (7) సైతం నిరాశపరిచాడు. ఈ సమయంలో విల్‌ జాక్స్‌ (55), రజత్‌ పాటిదార్‌ (52) అర్థ సెంచరీలతో కదం తొక్కారు. ఛేదనలో బెంగళూర్‌ ఆశలను సజీవంగా నిలిపారు. అర్థ సెంచరీల అనంతరం జాక్స్‌, పాటిదార్‌ నిష్క్రమించగా.. కోల్‌కత మ్యాచ్‌పై పట్టు బిగించింది. కామెరూన్‌ గ్రీన్‌ (6), సుయాశ్‌ ప్రభుదేశారు (24) సహా మహిపాల్‌ (4) నిరాశపరిచారు. దినేశ్‌ కార్తీక్‌ (25) క్రీజులో నిలిచినా.. తనదైన జోరు చూపించలేకపోయాడు. ఆఖరు ఓవర్లో మిచెల్‌ స్టార్క్‌పై కరన్‌ శర్మ మూడు సిక్సర్లు సంధించి మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా మార్చాడు. చివరి బంతికి మూడు పరుగులు అవసరమైన దశలో బెంగళూర్‌ ఒక్క పరుగే చేసింది. నైట్‌రైడర్స్‌ బౌలర్లలో ఆండ్రీ రసెల్‌ (3/25), సునీల్‌ నరైన్‌ (2/34), హర్షిత్‌ రానా (2/33) రాణించారు. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ 20 ఓవర్లలో పది వికెట్లకు 221 పరుగులు చేసింది.
చెలరేగిన సాల్ట్‌ : టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన కోల్‌కత నైట్‌రైడర్స్‌కు ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ (48) విధ్వంసక ఆరంభాన్ని అందించాడు. పించ్‌హిట్టర్‌ సునీల్‌ నరైన్‌ (10, 15 బంతుల్లో 2 ఫోర్లు) నిరాశపరిచినా.. సాల్ట్‌ మెరుపులతో కోల్‌కత స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. యశ్‌ దయాళ్‌ మెరవటంతో నైట్‌రైడర్స్‌ వరుసగా సునీల్‌ నరైన్‌, రఘువంశీ వికెట్లను పడగొట్టినా ఫిల్‌ సాల్ట్‌ జోరుతో పవర్‌ప్లేలో ఆ జట్టు 75 పరుగులు చేసింది. మూడు సిక్సర్లు, ఏడు ఫోర్లతో చెలరేగిన ఫిల్‌ సాల్ట్‌ పవర్‌ప్లేను శాసించాడు. రఘువంశీ (3), వెంకటేశ్‌ అయ్యర్‌ (16) నిరాశపరిచినా.. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (50) అర్థ సెంచరీతో కదం తొక్కాడు. లోయర్‌ ఆర్డర్‌లో రింకూ సింగ్‌ (24), అండ్రీ రసెల్‌ (27 నాటౌట్‌), రమణ్‌దీప్‌ సింగ్‌ (24 నాటౌట్‌) రాణించారు. 20 ఓవర్లలో కోల్‌కత నైట్‌రైడర్స్‌ 6 వికెట్లకు 222 పరుగులు చేసింది. బెంగళూర్‌ బౌలర్లలో కామెరూన్‌ గ్రీన్‌ (35), యశ్‌ దయాల్‌ (2/56) రాణించారు.
స్కోరు వివరాలు :
కోల్‌కత నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌ : ఫిల్‌ సాల్ట్‌ (సి) పాటిదార్‌ (బి) సిరాజ్‌ 48, సునీల్‌ నరైన్‌ (సి) కోహ్లి (బి) యశ్‌ 10, రఘువంశీ (సి) గ్రీన్‌ (బి) యశ్‌ 3, వెంకటేశ్‌ అయ్యర్‌ (సి) మహిపాల్‌ (బి) గ్రీన్‌ 16, శ్రేయస్‌ అయ్యర్‌ (సి) డుప్లెసిస్‌ (బి) గ్రీన్‌ 50, రింకూ సింగ్‌ (సి) యశ్‌ (బి) ఫెర్గుసన్‌ 24, రసెల్‌ నాటౌట్‌ 27, రమణ్‌దీప్‌ సింగ్‌ నాటౌట్‌ 24, ఎక్స్‌ట్రాలు : 20, మొత్తం : (20 ఓవర్లలో 6 వికెట్లకు) 222.
వికెట్ల పతనం : 1-56, 2-66, 3-75, 4-97, 5-137, 6-179.
బౌలింగ్‌ : మహ్మద్‌ సిరాజ్‌ 4-0-40-1, యశ్‌ దయాళ్‌ 4-0-56-2, ఫెర్గుసన్‌ 4-0-47-1, కరన్‌ శర్మ 4-0-33-0, కామెరూన్‌ గ్రీన్‌ 4-0-35-2.
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ ఇన్నింగ్స్‌ : విరాట్‌ కోహ్లి (సి,బి) హర్షిత్‌ రానా 18, డుప్లెసిస్‌ (సి) వెంకటేశ్‌ (బి) వరుణ్‌ 7, విల్‌ జాక్స్‌ (సి) రఘువంశీ (బి) రసెల్‌ 55, రజత్‌ పాటిదార్‌ (సి) హర్షిత్‌ రానా (బి) రసెల్‌ 52, కామెరూన్‌ గ్రీన్‌ (సి) రమణ్‌దీప్‌ (బి) నరైన్‌ 6, సుయాశ్‌ ప్రభుదేశారు (సి) రఘువంశీ (బి) హర్షిత్‌ రానా 4, మహిపాల్‌ (సి,బి) నరైన్‌ 4, దినేశ్‌ కార్తీక్‌ (సి) సాల్ట్‌ (బి) రసెల్‌ 25, కరన్‌ శర్మ (సి,బి) స్టార్క్‌ 20, సిరాజ్‌ నాటౌట్‌ 0, ఫెర్గుసన్‌ (రనౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు : 9, మొత్తం : (20 ఓవర్లలో ఆలౌట్‌) 221.
వికెట్ల పతనం : 1-27, 2-35, 3-137, 4-138, 5-151, 6-155, 7-187, 8-202, 9-220, 10-221.
బౌలింగ్‌ : హర్షిత్‌ రానా 4-0-33-2, మిచెల్‌ స్టార్క్‌ 3-0-55-1, వరుణ్‌ చక్రవర్తి 4-0-36-1, సునీల్‌ నరైన్‌ 4-0-34-2, సుయాశ్‌ శర్మ 2-0-33-0, అండ్రీ రసెల్‌ 3-0-25-3.

Spread the love