కాంగ్రెస్‌ అంటేనే లీకులు, ఫేక్‌ న్యూస్‌లు

Congress means leaks and fake news– పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆ పార్టీని బొంద పెట్టాలి
– బీఆర్‌ఎస్‌ను వీడిన వారికి
– మూడో స్థానమే : మాజీ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ -భువనగిరి
కాంగ్రెస్‌ అంటేనే లీకులు.. ఫేక్‌ న్యూస్‌లు.. పాలన గాలికొదిలేసి అక్రమ కేసులతో కాలయాపన చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన బీఆర్‌ఎస్‌ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికలు తమ పాలనకు రెఫరెండమని సీఎం రేవంత్‌ రెడ్డి అంటున్నారని, కానీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను బొంద పెట్టాలని కార్యకర్తలకు సూచించారు. కేసీఆర్‌ బయటికి రాగానే రాష్ట్రంలో కాల్వల్లో నీళ్లు పారుతున్నాయని తెలిపారు. ఎన్నికల కోడ్‌ సాకుతో హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్‌ మోసం చేసిందన్నారు. ధాన్యానికి రూ.500 బోనస్‌ ఇస్తామని మాట తప్పిందన్నారు. ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 ఇస్తామని మోసం చేసిందన్నారు. కాంగ్రెస్‌కు ఓటు అడిగే హక్కు లేదన్నారు. కార్యకర్తలు కాంగ్రెస్‌ మోసాలను గ్రామాల్లో విడమర్చి చెప్పాలన్నారు. కొంత మంది స్వార్థపరులు పార్టీని వీడి పోతున్నారని, వాళ్లను ప్రజలు నమ్మడం లేదని అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్తేనే 6 గ్యారంటీల పథకాలు అమలవుతాయని అన్నారు. నలభై రోజులు కష్టపడితే భువనగిరిలో గెలుస్తామన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయని కాంగ్రెస్‌ నిజస్వరూపం ప్రజలకు తెలిసిందన్నారు. బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌ టికెట్‌ పై పోటీ చేస్తున్న దానం నాగేందర్‌, కడియం కావ్య, రంజిత్‌ రెడ్డి, పట్నం సునీత మూడో స్థానంలో ఉంటారని జోస్యం చెప్పారు.
స్వార్థపరులే పార్టీలు మారుతున్నారని, వారిని ఓడించాలని కార్యకర్తలు కసితో ఉన్నారని అన్నారు. ప్రజల మాస్‌ లీడర్‌, బలహీన వర్గాల నాయకుడు క్యామ మల్లేష్‌ భువనగిరిలో తప్పకుండా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. స్వయానా రాహుల్‌ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసి పార్టీ నుంచి సస్పెండ్‌ అయిన వ్యక్తి భువనగిరి కాంగ్రెస్‌ అభ్యర్థి చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి అని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో కొట్లాడాలంటే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలవాల్సిన అవసరముందన్నారు. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్‌ పార్టీనేనని చెప్పారు. కొంత మంది పార్టీ వీడి పోతే నష్టమేమి లేదన్నారు. పార్టీ వదిలి పోయిన వారు కాళ్లు పట్టుకొని బతిమిలాడినా మళ్లీ వారిని పార్టీలో చేర్చుకోమన్నారు.
ఈ భూమి ఉన్నంత కాలం బీఆర్‌ఎస్‌ ఉంటుందని, కార్యకర్తలు అంతా ఉద్యమ స్ఫూర్తితో పోరాటం చేయాలన్నారు.
ఈ సమావేశంలో భువనగిరి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి క్యామ మల్లేశ్‌, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, జెడ్పీ చైర్మెన్‌ సందీప్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, పైళ్ల శేఖర్‌రెడ్డి, గాదరి కిషోర్‌, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి, బూడిద భిక్షమయ్య గౌడ్‌, నాయకులు బడుగుల లింగయ్య యాదవ్‌, కర్నె ప్రభాకర్‌, పొన్నాల లక్ష్మయ్య, చింతల వెంకటేశ్వర్‌ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Spread the love