వదిలేశారు..!

– టాప్‌-4 బ్యాటర్లు విఫలం
– పీకల్లోతు కష్టాల్లో భారత్‌

– ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ 469/10
– ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌

టీమ్‌ ఇండియా కష్టాల్లో కూరుకుంది. టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లు విఫలం కావటంతో ఆసీస్‌ కొండంత తొలి ఇన్నింగ్స్‌ స్కోరును చేరుకునేందుకు తంటాలు పడుతుంది. అదనపు బౌన్స్‌, అనూహ్య సీమ్‌తో భారత బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. వికెట్ల మీదకు వచ్చిన బంతిని వదిలేసి శుభ్‌మన్‌ గిల్‌, చతేశ్వర్‌ పుజార నిష్క్రమించగా.. బౌన్స్‌కు కోహ్లి బలయ్యాడు. 71 పరుగులకే టాప్‌ ఆర్డర్‌ను కోల్పోయిన టీమ్‌ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో ఎదురీదుతుంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగుల భారీ స్కోరు చేసింది.
నవతెలంగాణ-కెన్నింగ్టన్‌
ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో టీమ్‌ ఇండియా క్రమంగా పట్టు కోల్పోతుంది. ట్రావిశ్‌ హెడ్‌ (163, 174 బంతుల్లో 25 ఫోర్లు, 1 సిక్స్‌), స్టీవ్‌ స్మిత్‌ (121, 268 బంతుల్లో 19 ఫోర్లు) శతకాలతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 469 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. బంతితో ఆసీస్‌ను కట్టడి చేయటంలో విఫలమైన రోహిత్‌సేన… బ్యాట్‌తో లెక్క సమం చేయటంలో తేలిపోతుంది!. కంగారూ పేసర్లు కలిసికట్టుగా మెరవటంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోరుకు పరిమితమయ్యే ప్రమాదంలో పడింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (15), శుభ్‌మన్‌ గిల్‌ (13), చతేశ్వర్‌ పుజార (14), విరాట్‌ కోహ్లి (14) స్వల్ప స్కోర్లకు నిష్క్రమించారు. టాప్‌-4 బ్యాటర్లను త్వరగా అవుట్‌ చేసిన ఆస్ట్రేలియా.. ది ఓవల్‌లో షో చూపిస్తుంది. అజింక్య రహానె, రవీంద్ర జడేజా ఐదో వికెట్‌కు అజేయంగా 70 పరుగులు జోడించి భారత్‌ పోరాటానికి కొనసాగిస్తున్నారు. రెండో రోజు ఆట మూడో సెషన్లో 34 ఓవర్లలో 141/4 పరుగులతో భారత్‌ ఎదురుదీతుంది. జడేజా (48), రహానె (26) అజేయంగా పోరాడుతున్నారు.
లెక్క తప్పి.. వికెట్‌ జారి..! : ఆసీస్‌కు భారీ స్కోరు కోల్పోయిన భారత్‌.. తొలి ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (15) రెండు ఫోర్లతో ఆరంభంలోనే ఎదురుదాడి చేశాడు. శుభ్‌మన్‌ గిల్‌ సైతం రెండు బౌండరీలు బాదాడు. కానీ బంతి స్వింగ్‌, అదనపు బౌన్స్‌ అంచనా వేయటంలో మనోళ్లు లెక్క తప్పారు. పాట్‌ కమిన్స్‌ బంతికి రోహిత్‌ శర్మ వికెట్ల ముందు దొరికిపోగా.. క్రీజులో కుదురుకున్నట్టే కనిపించిన గిల్‌ లెక్క తప్పాడు. బొలాండ్‌ వేసిన బంతిని తప్పుగా అంచనా వేసిన గిల్‌ ఆడకుండా వదిలేశాడు. ఆ బంతి నేరుగా వికెట్లను గిరాటేసింది. ఇదే తప్పిదం పుజార సైతం పునరావృతం చేశాడు. కామెరూన్‌ గ్రీన్‌ ఓవర్లో బంతిని ఆడకుండా వదిలేసి మూల్యం చెల్లించాడు. ఇక విరాట్‌ కోహ్లిని మిచెల్‌ స్టార్క్‌ మెరుపు బంతితో సాగనంపాడు. పిచ్‌ నుంచి అదనపు బౌన్స్‌ రాబట్టిన స్టార్క్‌.. స్లిప్స్‌లో క్యాచౌట్‌గా అవుట్‌ చేశాడు. దీంతో 18.2 ఓవర్లలో 71 పరుగులకే భారత్‌ టాప్‌ ఆర్డర్‌ నాలుగు వికెట్లు చేజార్చుకుంది. మరో 142 పరుగులు : ఓవర్‌నైట్‌ స్కోరు 327/3తో రెండో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన ఆస్ట్రేలియా మరో 142 పరుగులు జోడించింది. స్టీవ్‌ స్మిత్‌, ట్రావిశ్‌ హెడ్‌ నాల్గో వికెట్‌కు 285 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. దూకుడు కొనసాగించిన హెడ్‌.. 23 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 164 బంతుల్లో 150 పరుగుల మార్క్‌ అందుకున్నాడు. స్టీవ్‌ స్మిత్‌ సంప్రదాయ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 16 ఫోర్లతో 224 బంతుల్లో స్మిత్‌ శతక గర్జన చేశాడు. హెడ్‌, స్మిత్‌ ఇన్నింగ్స్‌లతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించింది. లంచ్‌కు ముందే హెడ్‌, స్మిత్‌ నిష్క్రమించినా.. ఆసీస్‌ టెయిలెండర్లు విలువైన పరుగులు జత చేశారు. వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ కేరీ (48, 69 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుపు ఇన్నింగ్స్‌తో కదం తొక్కాడు. కామెరూన్‌ గ్రీన్‌ (6), పాట్‌ కమిన్స్‌ (9), మిచెల్‌ స్టార్క్‌ (5), నాథన్‌ లయాన్‌ (9)లు స్వల్ప స్కోరుకు నిష్క్రమించారు. 121.3 ఓవర్లలో 469 పరుగుల భారీ స్కోరుకు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. సిరాజ్‌కు ‘4’ : హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ డబ్ల్యూటీసీ ఫైనల్లో మెరిశాడు. షమి, ఉమేశ్‌, శార్దుల్‌తో కలిసి పేస్‌ బాధ్యతలు పంచుకున్న సిరాజ్‌ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఉస్మాన్‌ ఖవాజ (0), ట్రావిశ్‌ హెడ్‌ (163), పాట్‌ కమిన్స్‌ (9), నాథన్‌ లయాన్‌ (9) వికెట్లను సిరాజ్‌ పడగొట్టాడు. మహ్మద్‌ షమి (2/122), శార్దుల్‌ ఠాకూర్‌ (2/83) రెండేసి వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా (1/56) ఓ వికెట్‌ తీశాడు. ఉమేశ్‌ యాదవ్‌ (0/77) వికెట్లేమీ దక్కలేదు.

Spread the love