భారత్-ఆసీస్ డబ్ల్యూటీసీ ఫైనల్లో బాల్ టాంపరింగ్ కలకలం

నవతెలంగాణ – హైదరాబాద్
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్ లో బాల్ టాంపరింగ్ కలకలం రేగింది. టీమిండియా కీలక ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, ఛటేశ్వర్ పుజారాలను అవుట్ చేసేందుకు ఆసీస్ బాల్ టాంపరింగ్ కు పాల్పడిందని పాకిస్థాన్ మాజీ ఆటగాడు బాసిత్ అలీ సంచలన ఆరోపణలు చేశాడు. మైదానంలోని ఆసీస్ ఆటగాళ్లు ఉద్దేశపూర్వకంగానే బాల్ ఆకారాన్ని మార్చేశారని బాసిత్ అలీ తన యూట్యూబ్ చానల్లో వెల్లడించాడు. ఆసీస్ బాల్ టాంపరింగ్ టీవీలో స్పష్టంగా కనిపించిందని, కానీ మైదానంలో ఉన్న అంపైర్లకు, కామెంటరీ బాక్స్ లో ఉన్నవారికి మాత్రం అది కనిపించలేదని వ్యాఖ్యానించాడు. ఆసీస్ ఆటగాళ్లు 16, 18వ ఓవర్లలో బాల్ టాంపరింగ్ చేయడం కనిపించిందని బాసిత్ అలీ వివరించాడు. 18వ ఓవర్ సమయంలో బంతి ఆకారం దెబ్బతిన్నదంటూ మరో బంతిని తీసుకున్నారని వెల్లడించాడు. ఆసీస్ బాల్ టాంపరింగ్ కు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని వెల్లడించాడు. కాగా, ఈ మ్యాచ్ లో పుజారా 14వ ఓవర్ లో అవుట్ కాగా, కోహ్లీ 19వ ఓవర్ లో అవుటయ్యాడు.

Spread the love