Sunday, August 9, 2026
E-PAPER
Homeజాతీయంయుద్ధం నేర్పిన పాఠాలు

యుద్ధం నేర్పిన పాఠాలు

- Advertisement -

ఆధునిక సాంకేతికతతో ప్రత్యర్థికి చుక్కలు
న్యూఢిల్లీ : ప్రతి యుద్ధానికీ ఓ ప్రత్యేకత ఉంటుంది. యుద్ధానికి ముందు జరిగే భౌగోళిక-రాజకీయ సంఘర్షణలు, వాటిని నడిపించే అనివార్యతలు, యుద్ధక్షేత్రం, సైనిక దళాల బలాబలాలు, యుద్ధానికి దిశానిర్దేశం చేసే రాజకీయ-సైనిక ప్రముఖులు, ఎత్తుగడలు, ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం.. ఇవన్నీ ఒక్కో సందర్భంలో ఒక్కోలా ఉంటాయి. ప్రతి యుద్ధాన్ని విశ్లేషిస్తే వాటి ద్వారా పాలకులు పాఠాలు నేర్చుకోవచ్చు. విమర్శకులు వ్యాఖ్యానాలు చేయవచ్చు. పరిశోధకులు అధ్యయనాలు జరపొచ్చు. ఇప్పుడు ఇరాన్‌ యుద్ధం విషయానికి వద్దాం. చరిత్రలో ప్రత్యర్ధి దళాల మధ్య దాదాపు పూర్తిగా ప్రత్యక్ష సంబంధం లేకుండా జరిగిన యుద్ధమిది. చరిత్రను తిరగేస్తే చాలా యుద్ధాలు పొరుగు దేశాల మధ్యే జరిగాయి. అయితే ప్రస్తుతం యుద్ధం చేస్తున్న రెండు పక్షాల మధ్య భౌగోళికంగా చాలా దూరం ఉంది. దీనిని అధిగమించడానికి వాయుసేనలను రంగంలోకి దింపారు. సంప్రదాయ యుద్ధ విమానాలతో పాటు డ్రోన్లు, శత్రు లక్ష్యాల పైకి దూసుకుపోయే ఆయుధాలు, బాలిస్టిక్‌-క్రూయిజ్‌-హైపర్‌సోనిక్‌ క్షిపణులు వంటి వాటిని కూడా పెద్ద ఎత్తున వినియోగించారు.

ముందుగానే సన్నద్ధత
యుద్ధాన్ని ఇరాన్‌ ముందుగానే ఊహించింది. సంఘర్షణ తప్పదని దానికి తెలుసు. అందుకోసం సిద్ధపడింది కూడా. వికేంద్రీకృత కమాండ్‌ వ్యవస్థపై ఇరాన్‌ పూర్తి విశ్వాసాన్ని ఉంచింది. దాడులను చాలా కాలం ముందే అంచనా వేసిన ఇరాన్‌ కొన్ని అణు కర్మాగారాలను శత్రు దుర్బేధ్యమైన భూగర్భంలోనే నిర్మించుకుంది. భూగర్భంలో సొరంగాలు, బంకర్లను ఏర్పాటు చేసుకుంది. క్షిపణులను ప్రయోగించే వేదికలను సిద్ధం చేసుకుంది. సుదూరు లక్ష్యాలను ఛేదించగల డ్రోన్లు, క్షిపణులను రంగంలోకి దింపింది. ఇప్పటికీ ఇరాన్‌ ముందస్తు చర్యలు అమెరికా, ఇజ్రాయిల్‌ను కలవరపరుస్తూనే ఉన్నాయి. ఇరాన్‌ డ్రోన్లు జీపీఎస్‌కు బదులుగా చైనా బీడౌ కాన్‌స్టలేషన్‌ను ఉపయోగించడంతో ప్రత్యర్థుల ఆటలు సాగలేదు. అగ్ర రాజకీయ, సైనిక నాయకత్వం లేకపోయినా యుద్ధాన్ని కొనసాగించడానికి మొజాయిక్‌ డిఫెన్స్‌ అని పిలిచే వికేంద్రీకృత కమాండ్‌ను ఇరాన్‌ నిర్మించుకుంది. ఇక గగనతల రక్షణ వ్యవస్థల సంగతి సరేసరి. యుద్ధంలో ప్రత్యర్థి వైమానిక దాడులను తిప్పికొట్టడానికి ఈ వ్యవస్థలు ఎంతగానో ఉపకరిస్తున్నాయి. అయినా ఇరాన్‌ క్షిపణులు, డ్రోన్లు ఇజ్రాయిల్‌ గగనతల రక్షణ వ్యవస్థలను పదే పదే ఛేదించడం గమనార్హం. కొన్ని వేల డాలర్ల విలువైన డ్రోన్‌ను ధ్వంసం చేయడానికి కేవలం పది లక్షల డాలర్ల విలువ చేసే వ్యవస్థలను ఉపయోగించింది. ఇజ్రాయిల్‌, అమెరికా తనపై ప్రయోగించిన అపరిమిత వైమానిక దాడులను ఇరాన్‌ తట్టుకోగలిగింది.

సాంకేతికతే కీలకం
సుదూర భౌగోళిక ప్రాంతంపై పోరుకు ఇప్పుడు ఆధునిక సాంకేతికత బాగా ఉపయోగపడుతోంది. భవిష్యత్తులో శత్రువులు సరిహద్దు దేశానికే పరిమితం కారు. సాంకేతికత మాదిరిగానే భౌగోళిక రాజకీయాలు కూడా యుద్ధ క్షేత్రాన్ని విస్తరించడానికి అవకాశాలు కల్పిస్తాయి. ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రంలో శత్రువును ఇబ్బంది పెట్టడానికి హౌతీలు, హిజ్బొల్లాలపై ఇరాన్‌ ఆధారపడింది. ఆధునిక యుద్ధాలలో పోరాటాల ఫలితాన్ని సాంకేతికతే నిర్ణయిస్తుంది. యుద్ధం ప్రారంభమైన తొలి రోజులలో అమెరికా, ఇజ్రాయిల్‌ సేనలు రోజుకు సగటున 800, 400కు పైగా దాడులు చేశాయి. మొదటి మూడు వారాలలో ఈ సేనలు ఇరాన్‌ లక్ష్యాలపై 16 వేలకు పైగా దాడులు చేశాయని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ తెలిపింది. డేటా అనలిటిక్స్‌, ఏఐ వంటి ఆధునిక సాధనాలు, వాటిని ఉపయోగించే నైపుణ్యం కలిగిన నిపుణులు లేకుండా ఈ స్థాయిలో దాడులు చేయడం అసాధ్యం. పర్షియన్‌ గల్ఫ్‌ యొక్క భౌగోళిక స్వరూపాన్ని…ముఖ్యంగా హార్ముజ్‌ జలసంధిని తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం ఇరాన్‌ ఉపయోగించుకుంది. హార్ముజ్‌ను ఇరాన్‌ మూసివేయడంతో ప్రపంచ దృష్టి యావత్తూ అత్యాధునిక అమెరికా ఆపరేషన్‌ మీద కాకుండా ఈ కీలక ప్రదేశం పైనే నిలిచింది. అమెరికా, ఇజ్రాయిల్‌ సైనిక కార్యకలాపాలు ఇరాన్‌ భౌగోళిక ప్రాంతం పైనే సాగగా గల్ఫ్‌లోని అమెరికా లక్ష్యాలపై టెహ్రాన్‌ విరుచుకుపడింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -