– నేటి ధర్నాను విజయవంతం చేయండి
– తెలంగాణ ఆయిల్‌పామ్ రైతు సమాఖ్య పిలుపు
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆయిల్‌ఫెడ్ ఆస్తుల పరిరక్షణ కోసం శనివారం ఆయిల్‌ఫెడ్ డివిజనల్ కార్యాలయం ఎదుట నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని తెలంగాణ ఆయిల్‌పామ్ రైతు సమాఖ్య బాధ్యులు తుంబూరు మహేశ్వరరెడ్డి, కొక్కెరపాటి పుల్లయ్య లు పామాయిల్ రైతులకు పిలుపునిచ్చారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడారు.. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని కోట్లాది రూపాయల విలువైన టీజీ ఆయిల్‌ఫెడ్ స్థలాన్ని ప్రైవేట్ కంపెనీకి విక్రయించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆయిల్‌ఫెడ్‌లో ప్రైవేటీకరణను ప్రోత్సహించడం, సంస్థకు చెందిన విలువైన స్థిరాస్తులను విక్రయించడం వల్ల పామాయిల్ రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పామాయిల్ సాగు విస్తరిస్తున్న నేపథ్యంలో ఆయిల్‌ఫెడ్‌కు చెందిన భూములను భవిష్యత్ అవసరాలకు సద్వినియోగం చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఆయిల్‌ఫెడ్‌ను నిర్వీర్యం చేసే ప్రభుత్వ అనాలోచిత చర్యలను తిప్పికొట్టేందుకు రైతులంతా ఐక్యంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఆయిల్‌ఫెడ్ ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా చేపడుతున్న ధర్నాకు పామాయిల్ రైతులు పెద్దసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.



