– బల్మూరు సీపీఐ(ఎం) పిలుపు
– ఉత్సవాలకు హాజరుకారున్న రాష్ట్ర నాయకులు
నవతెలంగాణ – బల్మూరు
ఎర్రజెండా అంటేనే కార్మికుల హక్కులు, ప్రజా పోరాటాలు నిర్వహించేందుకు ముందుంటుందని బల్మూరు మండల సీపీఐ(ఎం) మండల కమిటీ పేర్కొన్నది. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) నాయకులు శంకర్ నాయక్, లాల్ అహ్మద్ మాట్లాడుతూ.. మే 1 న ఉద్యమాలను గౌరవించే ఆధునిక అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అని.. 1886లో చికాగోలోని హే మార్కెట్ లో జరిగిన దుస్సంఘటన జ్ఞాపకార్థం 1889లో ‘మే’ డే దినోత్సవాన్ని స్థాపించారని తెలిపారు. ఆరోజు 66 దేశాల కార్మికులు హక్కుల కోసం కవాతు, ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహిస్తారని గుర్తు చేశారు.
ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఆయా రంగాల కార్మికులు ఒక్కటై హక్కులకై నినదిస్తారు. పోరాడి హక్కులను సాధించుకున్న రోజు అని, దోపిడీ పెట్టుబడిదారులు, పెత్తందారులు సాగించిన మారణహోమంలో రక్తాలు చిందించి ప్రాణ త్యాగాలు చేయగా ఎరుపెక్కిందే మే డే దినోత్సవం అని వారు గుర్తు చేశారు. చికాగో నగరాన పోరు కెరటమైన ఎర్ర జెండాల వారసత్వమే ప్రజా పోరాటాలుగా ఎరిపెక్కాయని తెలిపారు. నాటి నుంచి నేటి వరకు సీపీఐ(ఎం) సుత్తి కొడవలి గుర్తుతో ప్రజా పోరాటాలలో ముందుండి నిలుస్తోందని అన్నారు. సమస్యలు పరిష్కరించాలని.. అందుకు మార్గం ఇదని.. పోరుకు ప్రజలను సన్నద్ధం చేస్తుందని అన్నారు. మే డే స్ఫూర్తితో ఎర్రజెండా చేతబట్టి కార్మికుల హక్కులు ప్రజా పోరాటాలే ధ్యేయంగా మేడే ఉత్సవాలను జయప్రదం చేద్దామని ప్రజా పోరాటాలను కొనసాగిద్దామని పిలుపునిచ్చారు.
కార్మికులు కర్షకులు రైతు కూలీలు మహిళలు, ఉద్యోగులు, యువకులు, నిరుద్యోగులు, ఉపాధి కూలీలు, హమాలీలు, భవన నిర్మాణ తాపీ మేస్త్రీలు, భవన పెయింటర్స్, పంచాయితీ వర్కర్స్, మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన వర్కర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు, జూనియర్ డాక్టర్లు, కేజీబీవీ సిబ్బంది, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, పరిశ్రమలు, ఫ్యాక్టరీలు ఎన్నో రకాల కార్మికులు, మరెన్నో రంగాల కార్మికులు ఐక్య పోరాట వేదిక మేడే అని.. ఉత్సవాలను ఘనంగా నిర్వహిద్దాం అంటూ పిలుపునిచ్చారు.
ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు తగ్గిస్తూ ఉన్న కొద్దిపాటి కార్మికులపై పని భారం పెంచే ఆధిపత్యాన్ని వ్యతిరేకిద్దాం.. ఉపాధిని జీవనోపాధినీ దూరం చేస్తున్న సామ్రాజ్యవాద టెక్నాలజీ విధానాన్ని వ్యతిరేకిద్దాం.. మానవ శ్రమను గుర్తించి తగిన వేతనం ఇచ్చినప్పుడే ఆర్థిక సామర్థ్యం సాధ్యమవుతుందన్నారు. సామ్రాజ్యవాదం నేడు స్వార్థం, సోమరితనం అనే ఆధునిక టెక్నాలజీకి మానవాళిని అలవాటు చేస్తుందని వారు మండిపడ్డారు. ముందు తరాన్ని ప్రశ్నించకుండా బానిసలుగా చేసుకునేందుకు ఉద్యోగ ఉపాధి చూపక ఉచిత పథకాలు ప్రవేశపెట్టడమే ఉదాహరణలు అని చెప్పవచ్చని అన్నారు. మండల కేంద్రంలో మరియు మండలంలోని వివిధ గ్రామాలలో జరిగే మేడే ఉత్సవాలకు సీపీఐ(ఎం), సీఐటీయూ అనుబంధ సంఘాల రాష్ట్ర నాయకులు హాజరవుతున్నట్లు తెలిపారు. కార్మికులు, కర్షకులు, నాయకులు, ప్రజలందరూ మేడే దినోత్సవాలను జయప్రదం చేయాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.



