వంద శాతం కేసుల పరిష్కార దిశగా..

– కోర్టుల డిజిటలైజషన్ లో నల్గొండ రెండవది
– సమర్థవంతంగా పనిచేసేందుకు మంచి అవకాశం
– రాష్ట్రంలో అన్ని జిల్లా కోర్టుల డిజిటలైజేషన్ కు ప్రయత్నం
– రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే
నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్
తెలంగాణ రాష్ట్రంలో 100 శాతం  కేసుల పరిష్కారం దిశగా న్యాయ వ్యవస్థ ముందుకు సాగుతున్నదని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే అన్నారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన అధునాతన 5 కోర్టుల భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నల్గొండ జిల్లా కోర్టులో నూతనంగా నిర్మించిన 5 కోర్టుల అదునాతన భవనంలో డిజిటలైజేషన్ తో పాటు, అన్ని రకాల సౌకర్యాలను కల్పించడం జరిగిందని, ప్రత్యేకించి లైబ్రరీ, రిక్రియేషన్ వంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయని అన్నారు. కోర్టుల డిజిటలైజషన్ లో నల్గొండ రెండవదని, పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్, మౌలిక సదుపాయాల కల్పనతో న్యాయ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసేందుకు మంచి అవకాశం కలుగుతుందని తెలిపారు. రాస్త్రంలో అన్ని జిల్లా కోర్టులను డిజిటలైజేషన్ కు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. చాలామంది పౌరులకు  న్యాయవ్యవస్థతో సంబంధం ఉంటుందని,ఎప్పటికప్పుడు వచ్చే మార్పులకు అనుగుణంగా న్యాయవ్యవస్థ పనిచేసినట్లయితే చట్టాలను సమర్ధవంతంగా అమలు చేయవచ్చని అన్నారు. అంతేకాక మౌలిక సదుపాయాలు, అన్ని రకాల సౌకర్యాల కల్పనతో పాటు, అడ్వకేట్లు  న్యాయాధికారులకు ఎప్పటికప్పుడు  సామర్ధ్యాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని,  సుప్రీంకోర్టు సైతం సామర్థ్యం పెంపుదలకు ఉత్తర్వులు ఇచ్చిందని అన్నారు.
న్యాయం కోసం కోర్టుకు వచ్చేవారికి  అందుబాటులో ఉన్న చట్టాలు, సౌకర్యాలతో నాణ్యమైన న్యాయాన్ని ఇచ్చేందుకు న్యాయవ్యవస్థ కు ఇది మంచి అవకాశం కలుగుతుందని ఆయన తెలిపారు. ఇకపై నల్గొండ జిల్లా కోర్టులో కేసులన్నింటిని డిజిటలైజేషన్ చేసే అవకాశం ఉందని అన్నారు.నల్గొండ బార్ అసోసియేషన్, బెంచ్ సమన్వయంతో న్యాయం కోసం వచ్చే ప్రజల కోసం సహకరించి సత్వర న్యాయం అందించాలని  కోరారు. హైకోర్టు జడ్జి వినోద్ కుమార్, లక్ష్మణ్, విజయ్ సేన్ రెడ్డి ,జిల్లా ప్రిన్సిపల్, సెషన్స్ జడ్జి నాగరాజు, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటరెడ్డి తదితరులు మాట్లాడారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, జిల్లా ఎస్పీ చందనా దీప్తి,నూతన కోర్టు ఆవరణలో మర్యాదపూర్వకంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని,  హైకోర్టు జడ్జిలను కలిసి బొకేలు అందజేశారు.ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, న్యాయ అధికారులు, నల్లగొండ ఆర్డిఓ రవి, అడ్వకేట్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love