వైవిధ్య భారత్‌ను కాపాడుకుందాం

Let's save a diverse India– దేశాన్ని తిరోగమనం పట్టిస్తున్న బీజేపీని ఓడిద్దాం
– ‘రాజ్యాంగం – జాతి ఐక్యత’ సదస్సులో వక్తలు
బెంగళూరు : మనువాద భావజాలంతో ‘హిందూ రాష్ట్ర’గా మార్చేందుకు ప్రయత్నిస్తూ దేశాన్ని తిరోగమనం పట్టిస్తున్న బీజేపీని ఓడించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. భారతదేశ విశిష్ట లక్షణమైన భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకోవాలని, సందేహాలకు తావులేని విధంగా, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించాలని ఆకాంక్షించారు. బెంగళూరులోని ప్యాలెస్‌ గ్రౌండ్స్‌లో ఆదివారం ‘రాజ్యాంగం, జాతీయ ఐక్యత’ సదస్సు నిర్వహించారు. జమ్ముకాశ్మీర్‌ పూర్వ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధినేత ఫరూఖ్‌ అబ్దుల్లా సదస్సులో ప్రారంభోపన్యా సం చేశారు. ఈ కార్యక్రమంలో ఫరూఖ్‌తో పాటు కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సీపీఐ(ఎం) ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి, కర్నాటక సామాజిక న్యాయ శాఖ మంత్రి ఎంహెచ్‌ మహదేవప్ప, పార్టీ సీనియర్‌ నేత సూర్జేవాలా పాల్గొన్నారు.
కాశ్మీర్‌ ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగమే : ఫరూఖ్‌
జమ్ముకాశ్మీర్‌ ఇదివరకు, ఇప్పుడు, భవిష్యత్‌లో ఎల్లప్పడూ భారత్‌లో అంతర్భాగమేనని సదస్సు ప్రారంభోపన్యాసంలో ఫరూఖ్‌ అబ్దుల్లా చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఈవీఎం)ల వినియోగంపై కొన్ని అనుమానులు ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం సందేహాలను నివృత్తి చేసి, ఎన్నికలను సజావుగా నిర్వహించగలదన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ‘కాశ్మీర్‌ ప్రజల తరపున మీకందరికీ శుభాకాంక్షలు. కాశ్మీర్‌ భారత్‌లో భాగమే. ఇదివరకు భారత్‌లోనే భాగంగా ఉంది. భవిష్యత్‌లోనూ భాగంగానే ఉంటుంది’ అని అబ్దుల్లా అన్నారు. దేశ వైవిధ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు. విశిష్టమైన ఈ లక్షణాన్ని మరింత పటిష్టపర్చుకోవాల్సివుందని ఆయన తెలిపారు. మతం మనల్ని ఎప్పుడు విడదీయలేదని, వాస్తవానికి ఐక్యం చేస్తుందని ఆయన చెప్పారు. చెడు ఏదైనా దానికి మతం ఉండదని, మనమే దానికి మతం అంటగడుతున్నామని పేర్కొన్నారు. పురోగమనంలో వెళ్లాలనుకుంటే ఒకరినొ కరు కలిసికట్టుగా సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకెళ్లడమే ఏకైక మార్గమని చెప్పారు. దేశ ప్రజానీకం గతంలోనూ ఎన్నో సవాళ్లను ఐక్యంగా ప్రతిఘటించిందని, విడదీసే ప్రయత్నాలను తిప్పికొట్టిందని ఈ సందర్భం గా ఫరూఖ్‌ గుర్తు చేశారు. ప్రస్తుతం దేశ రాజ్యాంగమే ప్రమాదంలో పడిందని, ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఐక్యతతో కృషి చేసి పరిరక్షించుకొని, మరింత పటిష్టపర్చుకో వాలని ఆయన పిలుపునిచ్చారు. ఒక వేళ మనం ఈ కృషి చేయకపోతే రాబోయే రోజుల్లో చింతించాల్సివస్తుందని ఆయన హెచ్చరించారు. ఇప్పుడు ఈవీఎంల విషయంలో చింతిస్తున్నట్లే రాజ్యాంగం విషయంలోనూ విచారపడాల్సివస్తుందని పేర్కొన్నారు. ‘ప్రస్తుతం ప్రజల్లో ఓటింగ్‌ యంత్రాలపై నమ్మకం లేదు. ఇవిఎంల్లో అక్రమాలకు పాల్పడే అవకాశాలను కొట్టిపారేయలేం. సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది’ అని ఆయన అన్నారు.
ఫాసిస్టు బాట
పడుతున్న బీజేపీ : ఏచూరి
లౌకిక, ప్రజాస్వామ్య భారత్‌ను ఫాసిస్టు ‘హిందూ రాష్ట్ర’గా మార్చేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్దేశంలో బీజేపీ ముమ్మరంగా ప్రయత్నిస్తోందని సీపీఐ(ఎం) ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. మనుస్మృతి భావజాలంతో అసమానతలు, అంటరానితనంతో కూడిన కులాధిపత్య సమాజాన్ని నిర్మించాలన్నదే వారి లక్ష్యమని పేర్కొన్నారు. ‘రాజ్యాంగాన్ని ఆమోదించే సమయంలో ఈ జాఢ్యాలన్నిటిని మనం చరిత్రలో కలిపేశాం. బీజేపీ ఈ రుగ్మతల దిశగా మనల్ని తిరోగమనం పట్టించేందుకు యత్నిస్తోంది. మనం దేశాన్ని ప్రగతిశీల వెలుగులతో పురోగమనం వైపు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. అందువల్ల ఇప్పుడు జరుగుతున్న పోరాటం భారత తిరోగమనాన్ని కోరుకుంటున్న మితవాద శక్తులకు, భారత పురోగమనం కాంక్షిస్తున్నవారికి మధ్య జరుగుతున్న పోరాటం’ అని ఏచూరి అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, దానికి నేతృత్వం వహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని, రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నిస్తున్నారని ఏచూరి విమర్శించారు. ఇలాంటి వారిని ఓడించితీరాలని ఆయన కోరారు. దేశ పరిరక్షణ కోసం అమృతకాలాన్ని నిజమైన ప్రజల అమృతకాలంగా మార్చేందుకు భారత ప్రజలమంతా ఐక్యంగా పోరాడాలని, మన గౌరవాన్ని, మన వైవిధ్యతను, సమానత్వాన్ని పునరుద్ధరించుకోవాలని ఏచూరి పిలుపునిచ్చారు.

Spread the love