అబద్ధాలకోరు మోడీని, బీజేపీని సాగనంపాలి

– ఇండియా కూటమిని గెలిపించాలి : సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ
నవతెలంగాణ – కరీంనగర్‌
గత ఎన్నికల్లో దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, ప్రజలను వంచించిన అబద్ధాలకోరు నరేంద్ర మోడీని, మతోన్మాద బీజేపీని ఇంటికి సాగనంపాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ అన్నారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు గెలుపు కోసం పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని సీపీఐ, ప్రజాసంఘాల ముఖ్య నాయకుల సమావేశం సోమవారం నియోజకవర్గ కన్వీనర్‌ మర్రి వెంకటస్వామి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. పది సంవత్సరాల బీజేపీ పరిపాలనలో మతోన్మాదం పెరిగిపోయిందని, హిందువులు, మైనార్టీల మధ్య చిచ్చుపెట్టేందుకు బీజేపీ నేతలు అనేక కుట్రలు పన్నారని అన్నారు. దేశవ్యాప్తంగా దళితులు, మైనార్టీలు, మేధావులపై దాడులు, హత్యలు జరిగాయని, అనేకమంది మేధావులను నిర్బంధించి జైల్లో పెట్టిన బీజేపీని ప్రజలు ఎందుకు ఆదరించాలని ప్రశ్నించారు. నరేంద్రమోడీకి వివాహ వ్యవస్థపై గౌరవం లేదని, తాళి విలువ తెలియదని విమర్శించారు. తాళి కట్టిన భార్యను వదిలేసినోడు విలువల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. పదేండ్ల మోడీ పాలనలో ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో సామాన్యులపై భారం పడిందని, పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలో మోడీ వైఫల్యం చెందారని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండకుండా, అభివృద్ధి పనులు చేపట్టని బండి సంజరుకి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. సీపీఐ బలపర్చిన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావును కరీంనగర్‌ ఎంపీగా గెలిపించాలని శ్రేణులకు సూచించారు.
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. దేశ పయనం ఎటువైపు ఉంటుందో ఈ ఎన్నికల ఫలితాల ద్వారా తేటతెల్లమవుతుందన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తేనే కులగణన జరిగి తీరుతుందని, తద్వారా ఆయా సామాజిక తరగతులకు రిజర్వేషన్ల ప్రకారం మేలు చేకూరుతుందన్నారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు మాట్లాడుతూ.. దేశంలో మత సామరస్యం, దేశ భద్రత, సమగ్రతను కాపాడుకునేందుకు ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి రావాల్సిన చారిత్రక అవసరం ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇవ్వడం సంతోషకరమని, తన గెలుపు కోసం పనిచేస్తున్న సీపీఐ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్‌, సిద్దిపేట, హనుమకొండ, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల సీపీఐ కార్యదర్శులు పాల్గొన్నారు.

Spread the love