ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడమే మోడీ గ్యారంటీ..

– నిజామాబాద్‌ ఎంపీగా జీవన్‌రెడ్డిని గెలిపించాలి : ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ-నిజామాబాద్‌ సిటీ
ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడమే మోడీ గ్యారంటీ అని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. నిజామాబాద్‌ పార్లమెంటు సభ్యునిగా కాంగ్రెస్‌ అభ్యర్థి టీ.జీవన్‌రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం నిజామాబాద్‌ నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డి రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడని, అలాంటి నాయకుడిని గెలిపించుకుంటే పార్లమెంటు లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని అన్నారు. మోడీ ‘సబ్‌కా సాత్‌.. సబ్‌కా వికాస్‌ ఎక్కడుందో’ చెప్పాలని ప్రశ్నించారు. ‘ఫీర్‌ ఏక్‌ బార్‌.. మోడీ కా సర్కార్‌’ అని నినదించడానికి సిగ్గు పడాలన్నారు. ఎవరికి అచ్చేదిన్‌.. ఈ దేశంలో బడా కార్పొరేట్లకు తప్ప శ్రమజీవులకు మోడీ గ్యారంటీ ఇచ్చింది ఏమీ లేదని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా అమ్మడం మోడీ గ్యారంటీ, మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం మోడీ గ్యారంటీ, ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని ఖూనీ చేయడం మోడీ గ్యారంటీనా..? అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ రవీంద్రనాథ్‌ సూరి, తెలంగాణ ప్రజా జేఏసీ నాయకులు భాస్కర్‌, షేక్‌ హుస్సేన్‌, జైహిర్‌, రిటైర్డ్‌ ఉద్యోగుల నాయకులు కె.రామ్మోహన్‌, బిఎస్‌ ఎన్‌ఎల్‌ రిటైర్డ్‌ ఉద్యోగుల నాయకులు ఈవీఎల్‌ నారాయణ పాల్గొన్నారు.

Spread the love