పీఎం స్థాయిలో ఇంతటి మతవిద్వేషమా?

– మోడీ వ్యాఖ్యలతో హిందువుల్లో పెరిగిన భయాందోళనలు
– ఆర్థిక దోపిడీదారులు, లైంగిక వేధింపులకు పాల్పడ్డవారికి బీజేపీ వత్తాసు
– కాంగ్రెస్‌ను గెలిపిస్తేనే సెక్యులరిజానికి భద్రత : రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
హిందువులు, ముస్లింలకు మధ్య మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా పీఎం మోడీ వ్యాఖ్యలు చేయడం పట్ల కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రధాని వ్యాఖ్యలతో విదేశాల్లో, ముఖ్యంగా ఇస్లామిక్‌ దేశాల్లో ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న హిందువులు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. ఇప్పటికే తనకు అనేక మంది ఫోన్లు చేసి తమ భయాన్ని వ్యక్తం చేస్తున్నారనీ, భారతదేశంలో సెక్యులరిజాన్ని కాపాడాలంటూ కోరుతున్నారని తెలిపారు.
దాదాపు వేల మంది మహిళలను లైంగికంగా వేధించిన రేవణ్నకు విదేశాలకు వెళ్లేందుకు సహకరించిన బీజేపీ మహిళా వ్యతిరేక పార్టీ అని విమర్శించారు. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన వారినీ, రైతులను జీపుతో తొక్కించి చంపిన వారికి టికెట్లిచ్చి కమలం పార్టీ ప్రోత్సహించిందని దుయ్యబట్టారు. బ్యాంకులను మోసం చేసిన నీరవ్‌ మోడీ, చోక్సీ లాంటి వారు ఇప్పటికే దేశం వదిలి పారిపోతే, ఇప్పుడు మహిళలను వేధించిన వారిని కూడా విదేశాలకు పారిపోయేందుకు బీజేపీ సర్కార్‌ సహకరించిందని తెలిపారు.
చైనా సరిహద్దులు దాటి భారతదేశం లోపలికి వచ్చి ఆక్రమించుకుంటున్నా…పట్టించుకోని మోడీ సర్కార్‌, దేశంలో ముస్లింల మీదికి ఎగబడుతోందని తప్పుపట్టారు. బీజేపీ నాయకులు ఎన్నికల కోడ్‌ను పదే పదే ఉల్లంఘిస్తున్నా ఎన్నికల సంఘం మౌనంగా ఎందుకుందని ప్రశ్నించారు. ఆ పార్టీని ఓడించి, కాంగ్రెస్‌ను గెలిపిస్తే మహిళలకు, రైతులకు, అన్ని మతాల వారికీ దేశంలో భద్రత ఉంటుందని తెలిపారు.

Spread the love