అబద్ధాల పునాదులపై బీఆర్‌ఎస్‌

– రైతుబంధుపై కాకిలా అరుస్తున్న కేసీఆర్‌ : డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

నవతెలంగాణ – బోనకల్‌
అబద్ధాల పునాదులపై బీఆర్‌ఎస్‌ పుట్టిందని, రైతుబంధుపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాకిలా అరుస్తున్నారని డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సీపీఐ(ఎం), సీపీఐ బలపరుస్తున్న ఖమ్మం పార్లమెంట్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డితో కలిసి బోనకల్‌ మండల కేంద్రంలో సోమవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు ఖమ్మం జిల్లాలో కలిశారని, మరో పార్టీ అభ్యర్థికి ఇక్కడ స్థానం లేదని అన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ అడ్రస్‌ గల్లంతవుతుందని, ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదన్నారు. రాజీవ్‌, ఇందిరాసాగర్‌ ప్రాజెక్టుల రీ డిజైన్‌ పేరుతో అంచనాలను రూ.25 వేల కోట్లకు పెంచి ఖమ్మం జిల్లాకు చుక్క నీరు ఇవ్వని దుర్మార్గుడు కేసీఆర్‌ అని విమర్శించారు. పదేండ్లు పాలించిన మీరు ఏనాడైనా మొదటి వారంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వేశారా అని ప్రశ్నించారు.
జిల్లాలో ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌, కమ్యూనిస్టుల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ ఉండేదని, ఇవాళ కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని అన్నారు. ఈ కూటమికి తెలుగు తమ్ముళ్లు సైతం మద్దతు ఇస్తున్నారని వివరించారు. ఖమ్మం జిల్లా భూములను సస్యశ్యామలం చేసేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి రూ.1400 కోట్లతో రాజీవ్‌, ఇందిరా సాగర్‌ ఎత్తిపోతల పథకాలు చేపడితే, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రీ డిజైన్‌ పేరుతో రూ.25 వేల కోట్లకు అంచనాలు పెంచిందని చెప్పారు. ఇప్పటి వరకు రూ.8 వేల కోట్లు ఖర్చు చేసి చుక్క నీరు అందించలేదన్నారు. రాజీవ్‌, ఇందిరా సాగర్‌ ఎత్తిపోతల పథకాలు పూర్తిచేసి ఖమ్మం జిల్లా రైతుల కాళ్లు కడుగుతామన్నారు. మొదటి దశలో రూ.5 లక్షలతో ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్ల్లను చేపట్టనున్నామని అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రూ.ఆరు లక్షలతో ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని తెలిపారు.
అయోధ్య రాముడు పేరుతో మోడీ రాజకీయాలు
రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి
అయోధ్య రాముడి పేరుతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజకీయాలు చేస్తున్నారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్‌ రెడ్డి విమర్శించారు. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్‌ రూ.7 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారని, లక్ష 50 వేల కోట్ల రాష్ట్ర సంపదను కేసీఆర్‌ దోచుకున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ వయసుకు తగ్గట్టుగా మాట్లాడాలని హితవు పలికారు. గత సంవత్సరం నాగార్జున సాగర్‌ నుంచి రైతులకు సాగునీరు ఇవ్వకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, సాగర్‌ నీటిని ఆంధ్ర ప్రాంతానికి ఇచ్చిన ఘనుడు కేసీఆర్‌ అని విమర్శించారు. బీజేపీకి బీ టీం బీఆర్‌ఎస్‌ అన్నారు. అనంతరం ఎంపీ అభ్యర్థి రామసహాయం రాఘురామిరెడ్డి, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వర్లు, సీపీఐ జాతీయ నాయకులు బాగం హేమంత్‌రావు మాట్లాడారు.

Spread the love