కార్మిక వ్యతిరేకి, మతోన్మాద బీజేపీని ఓడించండి

– సీపీఐ(ఎం) అభ్యర్థి జహంగీర్‌ని గెలిపించండి : సీఐటీయూ ఆల్‌ ఇండియా కోశాధికారి ఎం.సాయిబాబు
నవతెలంగాణ-భువనగిరి
మతోన్మాద, కార్మిక వ్యతిరేకి బీజేపీని ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని, పేదల పక్షపాతి సీపీఐ(ఎం) భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ అభ్యర్థి ఎండీ జహంగీర్‌ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీఐటీయూ ఆలిండియా కోశాధి కారి ఎం.సాయిబాబు పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకర్ల సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌తో కలిసి ఆయన మాట్లాడారు. భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గంలో పోటీలో ఉన్న అభ్యర్థులలో ఎండీ జహంగీర్‌ 35 ఏండ్లుగా ప్రజా ఉద్యమాల్లో ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి అని,మిగతా అభ్యర్థులు వందల కోట్ల డబ్బులు సంపాదించి పదవుల కోసం రాజకీయాలకు వచ్చారని తెలిపారు.ఎన్నికలలో కార్మిక వర్గం చైతన్యయుతంగా ఆలోచించి ఓటు వేయాలని కోరారు. చట్టాలను రద్దుచేసి.. నాలుగు లేబర్‌ కోడ్లు తెచ్చి.. పని గంటలను 8 నుంచి 12 గంటలకు పెంచి.. కార్మికుని రోజువారి వేతనం రూ.178 మాత్రమే సరిపోతుందని చెప్పిన మతోన్మాద, కార్పొరేట్‌ బీజేపీ అభ్యర్థులను ఓడించాలని అన్నారు. ఫ్యూడల్‌ వ్యవస్థ విధానాల ను అవలంబిస్తూ కార్మికులను, ప్రజలను బానిసత్వం వైపు తీసుకెళ్లాలని బీజేపీ చూస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రతి కార్మికుని సమస్యపైనా,ఆశా,అంగన్‌వాడీ,మధ్యాహ్నం భోజనం గ్రామపంచాయతీ కార్మికులు ఇలా అన్ని రంగాల కార్మికులకు అండగా నిలబడి పోరాడిన జెండా సీఐటీయూ అని గుర్తు చేశారు. భువనగిరి పార్లమెంట్‌లో పోటీ చేస్తున్న ఎండీ. జహంగీర్‌కు సీఐటీయూ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని చెప్పారు.జహంగీర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కార్మికులకు సూచించారు. ఈ సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్‌, రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసరి పాండు, కల్లూరి మల్లేశం, జిల్లా సహాయ కార్యదర్శి మాయకృష్ణ, ఐద్వా రాష్ట్ర నాయకులు ఆశాలత, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, నాయకులు గాడి శ్రీను ఉన్నారు.

Spread the love