అబద్ధాలే మీ ఆయుధాలు

Lies are your weapons– వంచనలే మీ సిద్ధాంతాలు : సీఎంపై రేవంత్‌ రెడ్డి విమర్శలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
‘అబద్ధాలే మీ ఆయుధాలు…వంచనలే మీ సిద్ధాంతాలు’ అంటూ టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌, మంత్రులపై ట్వీట్‌ చేశారు. ‘నాటకాలే మీకు తెల్సిన విద్యలు. మీరు ఇచ్చి తప్పిన హామీలకు లెక్కలేదు. మీకింకా పాలించే హక్కు లేదు. ఈ గడ్డ మరువదు మీరు పెట్టిన గోస… మీపై లేనే లేదు భరోసా.ముక్కు నేలకు రాసినా, పొర్లి పొర్లి దండాలు పెట్టినా, పారవు మీ పాచికలు. తప్పవు మీకు శంకరగిరి మాన్యాలు’. అంటూ హెచ్చరించారు.
కాంగ్రెస్‌లో చేరికలు
వివిధ పార్టీల ముఖ్య నాయకులు, విద్యార్థి జేఏసీ నాయకులు భారీగా కాంగ్రెస్‌లో చేరారు. వీరంతా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.నారాయణపేట జెడ్పీ చైర్‌పర్సన్‌ వనజ ఆంజనేయులుగౌడ్‌, మక్తల్‌ నియోజకవర్గానికి చెందిన సర్పంచులు శివరాం రెడ్డి, నర్సింహులు, మునిస్వామి, బీజేపీ మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షులు రహీం పటేల్‌, ఉపసర్పంచ్‌ కృష్ణయ్య గౌడ్‌ తదితరులు కాంగ్రెస్‌లో చేరారు. కొడంగల్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అనుచరులు పల్లెగడ్డ వెంకటయ్య, గడ్డం రవి, చందు, నర్సింహులు గౌడ్‌, మద్దూరు మండలానికి చెందిన పలువురు కార్యకర్తలు కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గానికి చెందిన మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ దొడ్ల ఈశ్వర్‌రెడ్డి, ఎంపీటీసీ డి.వెంకట్‌రెడ్డి, సర్పంచ్‌లు ఎస్‌.లింగారెడ్డి, ఎం.యాదగిరి, మాజీ సర్పంచ్‌ ఏ.సుబ్బారెడ్డి, ఇతర సీనియర్‌ నాయకులు, పలువురు కార్యకర్తలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన ఎంపీటీసీ శ్రీనివాస్‌, సర్పంచ్‌ వెంకటేశం, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, పలువురు కార్యకర్తలు హస్తం గూటికి చేరారు. సికింద్రాబాద్‌, తుంగతుర్తి నియోజకవర్గాలకు చెందిన పలువురు కార్యకర్తలు భారీ సంఖ్యలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.
ఓయూ విద్యార్థి నేత కోట శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో వివిధ యూనివర్సిటీల విద్యార్థి సంఘాల నేతలు, పరిశోధక విద్యార్థులు కాంగ్రెస్‌లో చేరారు. తెలంగాణ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పెంచాల సతీష్‌, ఎస్‌ఎఫ్‌ఐ మాజీ ఓయూ అధ్యక్షులు డాక్టర్‌ మాండ్ల రవి, టీవైఎఫ్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు మోహన్‌రాజ్‌, టీవీఎస్‌ కాకతీయ యూనివర్సిటీ నాయకులు కూనూరి రంజిత్‌, టీఎస్‌పీ జేసీ రాష్ట్ర చైర్మెన్‌ కె. చంద్రశేఖ, ఇతర విద్యార్థి సంఘాల నేతలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

 

Spread the love