రైతుల జీవితాల్లో వెలుగు

– సంబురంగా రైతు దినోత్సవ వేడుకలుొ వినూత్నంగా ఎడ్లబండ్లతో ర్యాలీలు
నవతెలంగాణ- మొఫిసిల్‌ యంత్రాగం
వలసలను అరికట్టి, రైతుల జీవితాల్లో వెలుగులు నింపి, రైతే రాజుగా నేడు గ్రామ గ్రామాన రైతులు ”రైతు దినోత్సవాన్ని” ఆనంద ఉత్సాహాలతో సంబరాలు చేసుకుంటున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వనపర్తి జిల్లా నాగవరంలో జరిగిన రైతు దినోత్సవం వేడుకలకు మంత్రి నిరంజన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకు ముందు ట్రాన్స్‌పోర్ట్‌ కార్యాలయం నుండి నాగవరం రైతు వేదిక వరకు జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ తో కలిసి ఎడ్ల బండిపై ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎండాకాలంలో సైతం చెరువులు అలుగులు పారుతూ రెండు పంటలను పుష్కలంగా పండిస్తున్నాయని రాష్ట్ర ఎక్సైజ్‌, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్‌ వి. శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు అయన మహబూబ్‌ నగర్‌ మండలం కోడూరులో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతును రాజును చేయడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, రైతు సంక్షేమం కోసం దేశంలో ఏ రాష్ట్రం తీసుకొని సంస్కరణలను సీఎం కేసీఆర్‌ తీసుకొచ్చారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రైతు దినోత్సవాన్ని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని అన్ని రైతు వేదికల్లో కోలహాలంగా ఉత్సవాలు నిర్వహించారు. రైతులు ఎడ్లబండ్ల ర్యాలీలు, ట్రాక్టర్లలతో ఊరేగింపుగా రైతు వేదికలకు చేరుకున్నారు. కులమతాలకతీతంగా సహఫంక్తి భోజనాలు చేశారు. కందుకూర్‌ మండలంతోపాటు మరికొన్ని మండలాల్లో నిర్వహించిన రైతు దినోత్సవం వేడుకలకు మంత్రి సబితాఇంద్రారెడ్డి హాజరయ్యారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి క్లస్టర్‌ రాంక్య తండాలో జరిగిన కార్యక్రమానికి మంత్రి పువ్వాడ అజరుకుమార్‌, ఎంపీ నామ నాగేశ్వరరావు హాజరయ్యారు. రైతుల మోముపై చిరునవ్వే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. రైతు బంధు కింద రాష్ట్రంలో 65 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుబాంధవుడని రాష్ట్ర విద్యుత్‌ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట మండలపరిధిలోని యండ్లపల్లి గ్రామంలో మూసి ఆయకట్టు రైతాంగం భారీ ఎత్తున రైతు దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. కలెక్టర్‌ వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి ముఖ్యఅతిథిóగా హాజరయ్యారు. ఎడ్లబండ్ల ప్రదర్శన,ట్రాక్టర్ల ప్రదర్శనతో పాటు కోలాటం, భజన, బృందాలతో ర్యాలీ నిర్వహించారు. నల్లగొండ జిల్లా చిట్యాలలోని ఉరుమడ్ల గ్రామంలో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి హాజరయ్యారు. నల్లగొండ, యాదాద్రి జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో ప్రదర్శనలు జరిపారు. ఎమ్మెల్యేలు, ఛైర్మెన్‌లు, అధికారులు పాల్గొన్నారు. సంగారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, కామారెడ్డి, ఆదిలాబాద్‌, హైదరాబాద్‌(బోయిన్‌పల్లి) వరంగల్‌, ములుగు తదితర జిల్లాల్లో జరిగిన వేడుకలలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల కలెక్టర్‌లు తదితరులు పాల్గొన్నారు.

Spread the love