లిక్కర్‌ దరఖాస్తులు 1,31,490

Liquor Applications 1.31490— ఖజానాకు రూ.2,629.80 కోట్ల ఆదాయం
– అధికారికంగా వెల్లడించిన ఆబ్కారీ శాఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలకు దరఖాస్తులు భారీగా వచ్చాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆశావహులు ఈ ఏడాది పోటీపడ్డారు. దరఖాస్తుల చివరి రోజైన శుక్రవారం ఎక్సైజ్‌ కార్యాలయాలు కిటకిటలాడాయి. 2,620 దుకాణాలకుగాను 1,31,490 దరఖాస్తులు వచ్చాయి. శుక్రవారం చివరి రోజు కావడంతో 56,980 దరఖాస్తులు, గురువారం 30,469 దరఖాస్తులతో కలిపి రెండురోజుల్లోనే 87వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయంటే పోటి ఏ స్థాయిలో ఉందో చెప్పనక్కర్లేదు.
1,31,490 దరఖాస్తుల ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.2,629.80కోట్ల ఆదాయం వచ్చింది.దరఖాస్తుదారులు కార్యాలయాల వద్ద బారులు తీరడంతో దరఖాస్తుల ప్రక్రియ శుక్రవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలకు 1,31,490 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్‌ అధికారులు ప్రకటించారు. ఒక్కో మద్యం దుకాణానికి దాదాపు 50 మంది వరకు పోటీపడుతున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా సరూర్‌నగర్‌ లో 10,908 దరఖాస్తులు, శంషాబాద్‌లో 10,811 దరఖాస్తులు వచ్చాయి. ఇక అత్యల్పంగా కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో 967, ఆ తర్వాత ఆదిలాబాద్‌లో 979 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 21న లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాలను కేటాయించనున్నారు.

Spread the love