సామాజిక దృక్పథంతో సాహిత్యం రావాలి: నిఖిలేశ్వర్

నవతెలంగాణ – హైదరాబాద్
వ్యక్తి కేంద్రంగా సాహిత్యం వస్తున్న తరుణంలో సామాజిక దృక్పథంతో సాహిత్యం రావాలని ప్రముఖ విప్లవ కవి నిఖిలేశ్వర్ అన్నారు. హోరు గాలి కవితా సంపుటి ఆవిష్కరణ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన నిఖిలేశ్వర్ “హోరు గాలి” కవితకి సంపుటిని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అనేక రకాలుగా చీలిపోయి ఉన్న సమాజానికి శాంతారావు తనదైన దిశానిర్దేశం చేశారని తెలిపారు. వీక్షణం సంపాదకులు ఎన్. వేణుగోపాల్ మాట్లాడుతూ..సమకాలీన ఘటనలకు, పరిణామాలకు అనివార్య పర్యవసానం, తన సుదీర్ఘ ప్రజాజీవితంలో ఎదురైన అనుభవాలను కవిత్వీకరించారని తెలిపారు. నవతెలంగాణ సంపాదకులు ఆర్. సుధా భాస్కర్ మాట్లాడుతూ.. ‘ప్రజలు నడుస్తున్నారు చరిత్ర పొడవునా ‘ అంటూ కాలంతో పాటు తానూ నడుస్తూ, తన వ్యాఖ్యానాలను కవితలుగా గుదిగుచ్చారని అన్నారు. నాలుగైదు దశాబ్దాల పాటు కళా సాహిత్య రంగంలో కొనసాగుతున్న వ్యక్తి శాంతారావు. ఆయన బాల సాహితీవేత్త కూడా. ఆయన లౌకిక ప్రజాస్వామ్య సమాజాన్ని కోరుకునే వ్యక్తి శాంతి రావు. ఆయనలో అంతర్మధనంగా ఒక జ్వలనం ఆయనలో ఉంది. అందుకు ఆయన నమ్మిన సిద్ధాంతం పట్ల ఉన్న నిబద్ధతకు ఈ హోరు గాలి కవితా సంపుటి ఒక నిదర్శనం అని సభకు అధ్యక్షత వహించిన తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.ఆనందాచారి అన్నారు. ఈ సభలో తెలంగాణ సాహితి రాష్ట్ర నాయకులు అనంతోజు మోహన్ కృష్ణ, సలీమ, ఏబూషి నర్సింహా, మేరెడ్డి రేఖ, కొండా రవీంద్ర, ముజాహిదీన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love