Sunday, May 10, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఇందిరమ్మ ఇండ్లకు లొకేషన్‌ ప్రాబ్లం

ఇందిరమ్మ ఇండ్లకు లొకేషన్‌ ప్రాబ్లం

- Advertisement -

రెండు మూడడుగులు అటూ ఇటైనా సాంకేతిక సమస్య కొలతల్లో ఏ కొంచెం తేడా వచ్చినా చిక్కులే..!
మండలానికి 20-50 మంది లబ్దిదారుల ఇబ్బందులు
టెక్నికల్‌ అంశాలతో నెలల తరబడి నిలుస్తున్న బిల్లులు

నవతెలంగాణ -ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా చేపట్టిన నిర్మాణాలకు ‘లొకేషన్‌’ సమస్య ఇబ్బందికరంగా మారింది. అక్షాంశ రేఖాంశాల్లో ఏ కొంచెం తేడా వచ్చినా సాంకేతిక సమస్య తలెత్తుతోంది. తద్వారా బిల్లులు నిలిచిపోతున్నాయి. పునాదుల వరకు నిర్మాణాలు పూర్తి చేసుకొని రెండు నెలలు కావొస్తున్నా బిల్లులు రావట్లేదు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలానికీ 20 నుంచి 50కి పైగా ఇంటి నిర్మాణాలు నిలిచిపోయాయి. మొదటి దశ బిల్లులు వస్తేనే కానీ నిర్మాణ పనులు ముందుకు సాగేలా లేవు. ఆర్థిక పరిస్థితులు బాగోలేకనో.. మరేదైనా కారణంతో ఆలస్యంగా నిర్మాణాలు చేపట్టిన మరికొందరు సైతం లొకేషన్‌ లోపాల కారణంగా సతమతమవుతున్నారు.

కొంచెం తేడా వచ్చినా అంతే…!
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మొత్తం 4.5 లక్షల ఇండ్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి దశలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3.5 లక్షల ఇండ్లను మంజూరు చేయగా, 2.73 లక్షల నిర్మాణాలు ప్రారంభించారు. సుమారు లక్ష ఇండ్ల వరకూ ఇప్పటివరకూ పూర్తయ్యాయి. మిగిలిన ఇండ్లలో మండలానికి 20-50కి పైగా బిల్లులు వివిధ సాంకేతిక సమస్యలతో నిలిచిపోతున్నాయి. దీనిలో ప్రధానంగా లొకేషన్‌ సమస్యతో నిలిచేవి ఎక్కువగా ఉంటున్నాయి. ఇప్పటికే కొంతమంది లబ్దిదారులు ఇండ్ల నిర్మాణాలు చేపట్టి మొదటి దశ బిల్లుల కోసం రెండు నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అనేక ప్రాంతాల్లో లొకేషన్‌ కనెక్టు కాకపోవడంతో ఇండ్లు బేస్మెంట్‌ వద్దే ఆగిపోయాయి. కొన్నిచోట్ల ఒక ఊరి వారి లొకేషన్‌ మరో ఊరిలో చూపిస్తోంది. కొన్ని చోట్ల పొంతన లేకుండా లొకేషన్‌లు చూపిస్తున్నాయి. వివిధ కారణాలతో కొన్ని ఇండ్ల నిర్మాణాలు జాప్యం కావడంతో అక్షాంశ రేఖాంశాల్లో ఏ కొంచెం తేడా వచ్చినా లొకేషన్‌ సమస్యగా చూపిస్తోంది. లొకేషన్‌ కనెక్టు కాకపోవడంతో పునాదుల వరకు నిర్మాణాలు జరిగిన ఇండ్లూ ఆగిపోయాయి.

నిలిచిపోతున్న నిర్మాణ పనులు
మొదటి విడతలోనే ఇల్లు మంజూరైన సంతోషంలో చాలామంది లబ్దిదారులు అప్పు చేసి మరీ నిర్మాణ పనులు ప్రారంభించారు. పంచాయతీ కార్యదర్శి ముగ్గు పోసిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు మొబైల్‌లో ఫొటో తీసుకొని అప్‌లోడ్‌ చేశారు. పునాదులు తీసుకొని ఇంటి నిర్మాణం ప్రారంభించాలని చెప్పారు. పునాదులు తీసి బేస్మెంట్‌ స్థాయి వరకు నిర్మాణం పూర్తి చేశారు. మొదటి బిల్లు కోసం పంచాయతీ కార్యదర్శిని సంప్రదించగా యాప్‌లో లొకేషన్‌ అప్‌లోడ్‌ కావడం లేదంటున్నారు. ఇప్పటికీ రెండు నెలలు గడిచినా బిల్లులు రావట్లేదని లబ్దిదారులు వాపోతున్నారు.

అధికారులకు ఫిర్యాదు చేసినా..
తమ ఇంటి లోకేషన్‌ కనెక్ట్‌ కాకపోవడంపై అధికారులకు లబ్దిదారులు ఫిర్యాదులు చేస్తున్నారు. వారు వచ్చి పరిశీలించి పై అధికారులకు పంపుతున్నారు. నేరుగా హౌసింగ్‌ ఎండీకి సమస్యను చేరవేసినా.. నెలలు గడుస్తున్నా బిల్లులు రావడం లేదు. స్థలాల మార్పులు ఏమైనా జరుగుతున్నాయా? ఒకరికి వచ్చిన ఇంటిని మరొకరు ఏమైనా నిర్మించుకుంటున్నారా..? ఇలాంటి సందేహాలు ఉన్నతాధికారులకు తలెత్తుతున్నాయి. వీటిని వెంటనే నివృత్తి చేసుకొని బిల్లులు మంజూరు చేయాల్సిన అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు.

మొదలు పెడదామనుకునే లోపే..
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం సింగరాయపాలెంకు చెందిన మంకెన స్రవంతికి జులై 18, 2025లో ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. అనివార్య కారణాలు, ఆర్థిక ఇబ్బందుల వల్ల వెంటనే ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించలేకపోయారు. నెల రోజుల కిందట నిర్మాణం చేపడుదామని నిర్ణయించుకున్నారు. విషయాన్ని గ్రామపంచాయతీ కార్యదర్శికి చేరవేశారు. వారు వచ్చి ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయబోయే సరికి లొకేషన్‌ సమస్య చూపిస్తోంది. అక్షాంశ రేఖాంశాల్లో ఏ కొంచెం తేడా వచ్చినా ఇలాంటి పరిస్థితి వస్తోందని అధికారులు చెబుతున్నారు. విషయాన్ని హౌసింగ్‌ ఎండీకి చేరవేసి నెల రోజులవుతున్నా అనుమతులు మంజూరు కాలేదు. ఇంటి నిర్మాణం ప్రారంభించలేదు.

అక్షాంశ రేఖాంశాల్లో వ్యత్యాసాలు
ఖమ్మం జిల్లాలో అనేక చోట్ల అక్షాంశ రేఖాంశాల్లో వ్యత్యాసాల వల్ల లొకేషన్‌ సమస్య ఏర్పడుతోంది. కొన్ని నిర్మాణం ప్రారంభించక ముందు తలెత్తితే.. మరికొన్ని ఒకటి, రెండు బిల్లులు పడ్డాక నిలిచిపోతున్నాయి. ఈ విషయమై ఎండీ దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో సమస్య పరిష్కారం అవుతుంది.
-శ్రీనివాసులు, గృహనిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌, ఖమ్మం

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -