మేడిగడ్డ వద్ద భారీ శబ్దాలు..

మేడిగడ్డ వద్ద భారీ శబ్దాలు..– తాత్కాలికంగా ఆగిన మరమ్మతులు
నవతెలంగాణ-మహాదేవపూర్‌
జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ వద్ద భారీ శబ్దాలు రావడంతో మరమ్మతులను తాత్కాలికంగా నిలిపివేశారు. గత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపట్టి అనతి కాలంలోనే పూర్తి చేసిన కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధాన భాగమైన మేడిగడ్డ బ్యారేజీ గతేడాది కుంగిపోవడంతో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో రాబోయే వర్షాకాలంలో నీటిని విడుదల చేయడానికి ఎలాంటి ప్రమాదం ఏర్పడకుండా 7వ బ్లాక్‌లోని 1వ గేటు నుంచి 22వ గేటు వరకు రాష్ట్ర ప్రభుత్వం మరమ్మతులు చేపట్టింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం మేడిగడ్డ కుంగుబాటును సీరియస్‌గా తీసుకుని ఎన్‌డీఎస్‌ఏ కమిటీ నివేదిక ప్రకారం అధికారులను ఆదేశించడంతో ప్రాజెక్టు ఏడో బ్లాకులోని 18, 19, 20 21 పిల్లర్లు కుంగాయని నిర్ధారించారు. దిద్దుబాటు చర్యలకు పూనుకున్న రాష్ట్ర ప్రభుత్వం నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్‌ ప్రకారం ఎన్‌డీఎస్‌ఎ బృందం, ఎల్‌అండ్‌టీ సంస్థ బృందం రంగంలోకి దిగి పనులు చేపట్టాయి. ఈ క్రమంలో 16వ గేట్‌ ఎత్తే క్రమంలో భారీ శబ్దాలతో ప్రకంపనలు చోటు చేసుకున్నా యని ఇంజినీరింగ్‌ అధికారులు వారి ప్రయత్నాలను విరమించుకున్నారు. భారీ సైజులో ఉన్న గేట్లను ఎత్తే క్రమంలో పునాదిపై ఒత్తిడి పడి పిల్లర్లు మరింతగా కుంగే అవకాశం ఉందని అధికారులు అంచనాకు వచ్చినట్టు సమాచారం. గతంలో వచ్చిన వరదల కారణంగా బ్యారేజీకి దిగువన నీటి అడుగులో పెద్ద ఎత్తున ఇసుక కొట్టుకుపోవడంతో భారీ గుంత ఏర్పడింది. దాంతో గ్రౌటింగ్‌ పనుల ద్వారా గుంతను పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు. 7వ బ్లాక్‌ పిల్లర్ల వద్ద ఇసుక బస్తాలతో మరమ్మతులు చేపట్టగా పిల్లర్ల దిగువ భాగంలో నీటిని మోటార్లతో ఎత్తి పోస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇంజినీర్లు చేస్తున్న ప్రయత్నం సఫలమైతే రాబోయే రోజుల్లో మరమ్మతులు చేపట్టి ఎలాంటి ప్రమాదం లేకుండా గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. ఇదే విషయమై బ్యారేజీ పనుల్లో ఉన్న కొంతమందిని వివరణ కోరగా.. ఎలాంటి శబ్దం రాలేదని, ఇదంతా కట్టుకథ అని చెప్పారు.

Spread the love