మేడిగడ్డ కుంగింది… పాపాల పుట్ట పగిలింది

Madigadda sagged... The mound of sins is broken– కేసీఆర్‌ క్రిమినల్‌ పొలిటీషియన్‌
– ఒక వ్యక్తి పాదాల కింద తెలంగాణ సమాజం నలిగిపోతోంది
– నేను కందిపప్పు…కేటీఆర్‌ గన్నేరు పప్పు
– రైతు బంధు మాదే..కేసీఆర్‌ కాపీ కొట్టారు
– కమ్యూనిస్టులతో చర్చలు కొనసాగుతున్నాయి :’మీట్‌ ది ప్రెస్‌’లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాటం చేశామని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు సోనియాగాంధీ అణుబాంబు లాంటి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి కోరుకున్నారని తెలిపారు. ఒక వ్యక్తి పాదాల కింద తెలంగాణ సమాజం నలిగిపోవడం సహించలేమన్నారు. తెలంగాణ రాష్ట్ర యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ (టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌లో శుక్రవారం నిర్వహించిన ‘మీట్‌ ది ప్రెస్‌’ రేవంత్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి సీనియర్‌ సంపాదకులు కె రామచంద్రమూర్తి సమన్వయకర్తగా వ్యవహరించారు. ప్రజాపక్షం సంపాదకులు కె శ్రీనివాసరెడ్డి, విరాహత్‌ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పాలనలో నీళ్లు, నిధులు నియామకాలు సాధించుకున్నామా? ఒకసారి ఆలోచన చేయాలని రేవంత్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘కేసీఆర్‌ ఎప్పుడూ చెప్పే మాట. మట్టికి పోయిన ఇంటోడు పోవాలని అంటాడు. ఆయన చెప్పినవి ఏవి వచ్చాయి. రాచరిక పోకడలు కనిపించేలా సర్కార్‌ ముద్ర ఉంది. త్యాగాలు గుర్తు చేసేలా ఉండాలి కానీ అలా లేదు. ఉద్యమంలో టీజీ అని రాసుకుంటే, కేసీఆర్‌ వచ్చాక టీఆర్‌ఎస్‌ కనిపించేలా టీఎస్‌ రాసిండు. తెలంగాణ తల్లి కూడా భుజకీర్తులతో కనిపిస్తుంది’ అన్నారు. ‘కమ్యూనిస్టులు మాకు సహజసిద్ధ మిత్రులు. చర్చల కోసం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కమిటీ వేశాం. ఆ కమిటీ సమన్వయం చేస్తున్నది.నిర్ధిష్టమైన నిర్ణయం వెలువడగానే మీతో పంచుకుంటాం.ఆ ప్రక్రియ ముగియలేదు. చర్చలు కొనసాగుతున్నాయి’ అని ఆయన వెల్లడించారు.
రైతులకు ఎకరానికి ఏటా రూ. 10వేలు ఇస్తామని 2014లోనే కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో పెట్టింది. దాన్నే కాపీ కొట్టి కేసీఆర్‌ రైతు బంధు పేరుతో ఇస్తున్నారని తెలిపారు. ఓడిపోవడంతో ఆ విషయాన్ని చెప్పుకోలేక పోయామనీ, అధికారంలోకి వస్తే అమలు చేసే ఉండేవారమని పేర్కొన్నారు. ‘నియంత కంటే ఎక్కువగా ఉంది కేసీఆర్‌ పాలన. కేసీఆర్‌ నియంత కాదు క్రిమినల్‌ పొలిటిషియన్‌. కోట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదు. కర్నాటకలో కాంగ్రెస్‌ గెలవడం ద్రోహం, నేరం అంటున్నారనీ, మరి బీజేపీ గెలవాలా?’ అని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన, అంతర్జాతీయ ప్రమాణాలతో రోడ్లు, రాచకొండ గుట్ట పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే ప్రణాళికలున్నాయని తెలిపారు. అర్బన్‌, సెమీ అర్బన్‌, రూరల్‌ హైదరాబాద్‌కు కనెక్టివిటీ ఇవ్వనున్నామన్నారు.సీఎం జర్నలిస్టులను కూడా ఆగం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు. మేడిగడ్డ స్తంభం మూడు అడుగుల మేర కుంగిపోయిందన్నారు . పిల్లర్‌ దిగువన ఇసుక ఉందన్న విషయం నీటిపారుదల శాఖ ఇంజినీర్లకు తెలియదా? అని ప్రశ్నించారు. పిల్లర్లు కుంగాయి కాబట్టే మేడిగడ్డ బ్యారేజీ జాయింట్‌లో గ్యాప్‌ పెరిగిందన్నారు. కేసీఆర్‌ పాపాల వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందన్నారు. కేసీఆర్‌ తన లోపాలను కప్పిపుచ్చుకునేందుకే పక్క రాష్ట్రాల అంశాన్ని తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ దశాబ్ద పాలన-బీఆర్‌ఎస్‌ దశాబ్ద పాలనపై చర్చకు సిద్ధం..మా పార్టీ నుంచి నేను, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వస్తాం… మిగతా. పార్టీల నుంచి ఇద్దరు చొప్పున రండి..చర్చ పెడితే పాలకు పాలు, నీళ్లకు నీళ్లు బయట పడతాయని సవాల్‌ విసిరారు. అసెంబ్లీ ఎన్నికల్లో చుక్క మందు, డబ్బు లేకుండా వెళదామని బీఆర్‌ఎస్‌ పార్టీతో సహా ఇతర పార్టీలను రేవంత్‌ రెడ్డి కోరారు. విధివిధానాలపై ఈ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళదామని తెలిపారు. ధరణి రద్దు చేస్తామంటే, కేసీఆర్‌కు ఎందుకంత దుఃఖం? అని ఎద్దేవా చేశారు. ‘2018లో తెలంగాణ సెంటిమెంటును నిద్రలేపి కేసీఆర్‌ రాజకీయంగా లాభం పొందారు. 2018లో చంద్రబాబు రూపంలో కేసీఆర్‌ కు అవకాశం దొరికింది. కానీ పదేండ్లలో కేసీఆర్‌ గుడ్‌ విల్‌ జీరోకు చేరింది’ అన్నారు. బీజేపీ, ఎంఐఎం బీఆర్‌ఎస్‌ కూటమి ఒక వైపు, కాంగ్రెస్‌, కోదండరాం, కలిసివస్తే కమ్యూనిస్టులు, ప్రజా సంఘాల మావైపు ఉన్నాయన్నారు. వందశాతం ప్రజలు ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించి తీరతారని చెప్పారు.
కేటీఆర్‌ కు రేవంత్‌ రెడ్డి కౌంటర్‌
‘నేను కందిపప్పు లాంటివాన్ని.. కందిపప్పు ఆరోగ్యానికి మంచిది. మా కొడంగల్‌, తాండూరు ప్రాంతాల్లో కంది పప్పుకు మంచి పేరుంది. అందుకే నేను కందిపప్పు. కానీ మంత్రి కేటీఆర్‌ గన్నేరు పప్పు లాంటివారు. తింటే చస్తారు. ఆరోగ్యం బాగుండాలంటే కందిపప్పు, ముద్దపప్పును తీసుకోండి.. గన్నేరు పప్పును కాదు’ అని రేవంత్‌ రెడ్డి మంత్రి కేటీఆర్‌పై సెటైర్‌ వేశారు.

Spread the love