– ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ చేతుల మీదుగా కరపత్రాల ఆవిష్కరణ
నవతెలంగాణ-సత్తుపల్లి
ఏఐటీయూసీ ఖమ్మం జిల్లా 17వ మహాసభలను జయప్రదం చేయాలని ఆ మహాసభల ఆహ్వాన సంఘ కమిటీ నాయకులు దండు ఆదినారాయణ, నిమ్మటూరి రామకృష్ణ కోరారు. మంగళవారం మహాసభల కరపత్రాలను ఆహ్వానసంఘ గౌరవాధ్యక్షురాలు, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ చేతుల మీదుగా మంగళవారం స్థానిక లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాలులో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ మాట్లాడారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం, వారి సమస్యలపై నిరంతరం పోరాడే సంఘం ఏఐటీయూసీ అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు.
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక కోడ్‌లకు వ్యతిరేకంగా పోరాడాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఆగస్టు 23, 24 తేదీలలో సత్తుపల్లి వేదికగా ఏఐటీయూసీ జిల్లా మహాసభలు ఘనంగా జరగనున్నాయని ఆదినారాయణ, రామకృష్ణ తెలిపారు. ఏఐటీయూసీ ఆవిర్భవించిన తర్వాత సత్తుపల్లిలో ప్రథమంగా జిల్లా మహాసభలు నిర్వహించడం గర్వకారణమని వారన్నారు. రాబోయే రోజుల్లో కార్మికుల హక్కుల రక్షణ కోసం భవిష్యత్ పోరాటాల కార్యాచరణను ఈ మహాసభల్లో రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. సత్తుపల్లి, పరిసర ప్రాంతాల ప్రజలు, కార్మికులు ఈ మహాసభలకు పూర్తి సహకారాన్నిందించి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మహాసభల చీఫ్ ప్యాట్రన్ డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్, సత్తుపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, ఆహ్వాన సంఘం కోశాధికారి తడికమళ్ల యోబు, గాదె చెన్నకేశవరావు, బీసీ సంఘం నాయకులు, డీసీసీబీ డైరెక్టర్లు పాల్గొన్నారు.



