– ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలి
– జిల్లా స్థాయి శిక్షణ తరగతుల్లో పార్టీ శ్రేణులకు పిలుపు
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
నవతెలంగాణ – అశ్వారావుపేట
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో పూర్తిగా విఫలమైందని, ప్రజా సమస్యలు క్షేత్రస్థాయిలో పేరుకుపోతున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీపీఐ(ఎం) చేపట్టిన “పోరుబాట” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, పార్టీ శ్రేణులు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గత మూడు రోజులుగా నియోజకవర్గం కేంద్రం అయిన అశ్వారావుపేటలో గత మూడు రోజులుగా విజయవంతం సాగిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజకీయ శిక్షణ తరగతు చివరి రోజు శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం తగిన బడ్జెట్ కేటాయింపులు చేయకపోవడంతో అవన్నీ నీటిమీద రాతలుగా మారాయని విమర్శించారు. ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు తదితర సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక రాజకీయ జోక్యంతో సాగుతుండటంతో అసలైన నిరుపేదలకు అన్యాయం జరుగుతోందన్నారు. విద్యారంగాన్ని ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని పేర్కొంటూ, కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా ప్రభుత్వ విద్యాసంస్థల సమస్యలపై ఉద్యమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు భూముల సమస్య తీవ్రంగా ఉందని, ఆదివాసీలు సాగు చేస్తున్న భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పోడు సాగుదారులపై ఫారెస్ట్, పోలీసు అధికారుల వేధింపులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. వలస ఆదివాసీ గ్రామాల పిల్లలకు ఎస్టీ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని, వారి విద్యా, సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం అడ్డంకులు సృష్టించకూడదన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలపై దాడి చేస్తోందని, హిందుత్వ భావజాలాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. ఆదివాసీ హక్కులు, గిరిజన చట్టాల పరిరక్షణ కోసం సీపీఐ(ఎం) నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులు సరఫరా చేయాలని, రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. నకిలీ విత్తనాలు, ఎరువులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.



