నవతెలంగాణ – పరకాల
తెలంగాణ ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను పరకాల మండలంలోని పోచారం ప్రాథమికోన్నత పాఠశాలలో నూతనంగా ప్రభుత్వ ప్రీ-ప్రైమరీ పాఠశాలను ప్రారంభించనున్నట్లు మండల విద్యాధికారి చిలువేరు సురేందర్ ప్రకటించారు. ఈ క్రమంలో ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ మరియు ఆయా పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ఆయన తెలిపారు.
ఇన్స్ట్రక్టర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ (10+2) లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలని, ముఖ్యంగా ప్రారంభ బాల్య విద్య (ఇసిఇ) లేదా ప్రాథమిక బోధనలో శిక్షణ పొందిన వారికి ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ఆయా పోస్టుకు కనీసం 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని సూచించారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో స్థానిక నివాసితులకే (ముందుగా హాబిటేషన్, తర్వాత గ్రామ పంచాయతీ, మండలం, జిల్లా ప్రాతిపదికన) మొదటి ప్రాధాన్యత కల్పిస్తామని స్పష్టం చేశారు.
నోటిఫికేషన్ నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు, మాజీ సైనికులకు 3 ఏళ్ల వయో సడలింపు వర్తిస్తుందని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను, సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో కలిపి ఈ నెల 8వ తేదీలోపు పోచారం ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సమర్పించాలని కోరారు. మరింత సమాచారం కోసం ప్రధానోపాధ్యాయులు రవ్వ జగదీష్‌ను 7893798066 నంబర్‌లో సంప్రదించవచ్చని ఎంఈఓ సూచించారు.



