యావత్‌ తెలంగాణకే చీమలధరి ఆదర్శం

– వంద శాతం డిజిటలైజేషన్‌ గ్రామం : చేవెళ్ల ఎంపీ డాక్టర్‌ జి.రంజిత్‌రెడ్డి
– గ్రామంలో ఉచిత వైఫై సేవలు ప్రారంభం
నవతెలంగాణ-వికారాబాద్‌ ప్రతినిధి
యావత్‌ తెలంగాణ రాష్ట్రానికే చీమలధరి గ్రామం ఆదర్శమని చేవెళ్ల ఎంపీ డాక్టర్‌ జి.రంజిత్‌రెడ్డి అన్నారు. ఎన్నో ఇబ్బందులు, ఇక్కట్లను ఎదుర్కొని చీమలధరి నేడు ఈ ప్రగతిని సాధించిందన్నారు. గ్రామం వంద శాతం డిజిటలైజేషన్‌ గ్రామం(ఈ-విలేజ్‌)గా పేరుగాంచిందని కొనియాడారు. మంగళవారం భారత 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట మండలం చీమలధరి గ్రామ పంచాయతీ-బీఎస్‌ఎన్‌ఎల్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఉచిత వైఫై సేవలను ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌, సర్పంచ్‌ నాసన్‌పల్లి నర్సింహ్మారెడ్డితో కలిసి ఎంపీ రంజిత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపికైన ఈ గ్రామంలో పారదర్శకంగా ఇంటర్నెట్‌ సేవలందించడంపై హర్షం వ్యక్తం చేశారు. గ్రామంలో ఉచిత వైఫై సేవలు అందించడంలో స్థానిక సర్పంచ్‌ నరసింహారెడ్డి కృషి ఎనలేదన్నారు. ఎవరు గ్రామంలోకి వచ్చినా తక్షణమే ఇంటర్‌నెట్‌ ఆన్‌ చేసి ఉంటే ఓటీపీ వస్తుందని సంబంధిత ఓటీపీ ద్వారా వైఫై కనెక్ట్‌ అవుతుందని తెలిపారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ గ్రామాన్ని రూపొందించినట్టు చెప్పారు. తాను ఐటీ విభాగానికి సంబంధించి పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సభ్యుడిగా ఉన్నానని అయితే, తన పార్లమెంటరీ నియోజకవర్గంలోనే ఒక ఈ-విలేజ్‌ ఉండటం గర్వంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని గ్రామాలు చిలమలధరి మాదిరి ఐటీలో ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలను పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్‌ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదని చెప్పారు.

Spread the love