ముందు మీ(బీజేపీ) చరిత్ర చూసుకోండి: మల్లికార్జున ఖర్గే

నవతెలంగాణ – హైదరాబాద్: దేశంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. నేతలు ఓటర్లను ఆకర్షిచేందుకు రకరకాల హామీలను ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీ తన మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘అది ముస్లిం లీగ్‌ మేనిఫెస్టో’  మాదిరిగానే ఉందని వ్యాఖ్యానించారు. బుజ్జగింపు రాజకీయాల కోసమే దాన్ని రూపొందించినట్లుగా కనిపించిందంటూ విమర్శలు చేశారు. మోదీ వ్యాఖ్యలపై తాజాగా కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే విరుచుకుపడ్డారు. మోడీ మతం పేరుతో దేశాన్ని విభజించడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై వ్యాఖ్యలు చేసేముందు.. వారి చరిత్ర ఏంటో తెలుసుకోవాలని దుయ్యబట్టారు. ‘వాళ్లు (బీజేపీ) ముందుగా వారి చరిత్ర చూసుకోవాలి. వారి సిద్ధాంతకర్త బెంగాల్‌లో ముస్లిం లీగ్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మతం పేరుతో వాళ్లే దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రధాని మోడీ మనస్సులో కేవలం హిందూ-ముస్లిం మాత్రమే ఉంది. మతం పేరుతో దేశాన్ని విభజించడం, సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి వాళ్లు ప్రయత్నిస్తున్నారు. మా కాంగ్రెస్ మేనిఫెస్టోని వాళ్లు సరిగ్గా చదవలేదు. మేము యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పాం. మహిళలకు సంవత్సరానికి రూ.1 లక్ష ఇస్తామని హామీ ఇచ్చాం. రైతులకు కనీస మద్దతు ధర (MSP) గ్యారెంటీ.. ఇవన్నీ ముస్లిం లీగ్‌లో భాగమా..?’ అని ఖర్గే ప్రశ్నించారు.

Spread the love