Tuesday, June 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅమానవీయ ఘటనపై మేయర్‌ సీరియస్‌

అమానవీయ ఘటనపై మేయర్‌ సీరియస్‌

- Advertisement -

శవానికి చోటివ్వని ఘటనపై కదిలిన యంత్రాంగం
శ్మశానంలో తలదాచుకున్న కుటుంబానికి పరామర్శ, భరోసా..
కరీంనగర్‌లో రూ.2 కోట్లతో నాలుగు ‘కర్మకాండ నిలయాల’ ఏర్పాటుకు ముందడుగు
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి

మానవత్వం మంటగలవడంతో ఒక నిరుపేద కుటుంబం శ్మశానంలో బతుకు వెళ్లదీస్తున్న హృదయవిదారక ఘటనపై ‘నవతెలంగాణ’ దినపత్రిక ఈనెల 26న ప్రచురించిన ‘శ్మశానమే శరణాలయం’ కథనం జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పుల బాధతో తనువు చాలించిన ఆటో డ్రైవర్‌ శ్రీకాంత్‌ మృతదేహాన్ని అద్దె ఇంట్లోకి రానివ్వకుండా, ఆ కుటుంబాన్ని గెంటేసిన యజమాని అమానుష వైఖరిని పత్రిక ఎండగట్టిన తీరుపై యంత్రాంగం కదిలింది. కరీంనగర్‌ మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌, సీపీఐ(ఎం) నాయకులు, ఇతర ప్రజాసంఘాలు తక్షణమే స్పందించారు. శ్మశానంలో బిక్కుబిక్కుమంటున్న ఆ అభాగ్యులను పరామర్శించి, వారికి అండగా ఉంటామని భరోసా ఇవ్వడమే కాకుండా.. భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితి మరే పేద కుటుంబానికీ రాకుండా శాశ్వత పరిష్కార మార్గాలను కార్పొరేషన్‌ ప్రకటించింది. కరీంనగర్‌ నగరపాలక సంస్థ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. అద్దె ఇంట్లో నివసించే వారు చనిపోతే, ఆ అభాగ్య కుటుంబాలు శ్మశానాల్లో తలదాచుకోవాల్సిన దుస్థితిపై కేంద్ర మంత్రి బండి సంజరు కుమార్‌ మేయర్‌తో మాట్లాడారు.

నగరంలోని నాలుగు దిక్కులా అత్యాధునిక ‘కర్మకాండ నిలయాల’ నిర్మాణానికి మేయర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో భవనానికి రూ.50 లక్షల చొప్పున మొత్తం రూ.2 కోట్లతో జీ-ప్లస్‌ వన్‌ అంతస్తుల్లో సకల సౌకర్యాలతో ఈ భవనాలు నిర్మించనున్నారు. సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల, వరంగల్‌ రహదారుల వెంబడి ఉన్న శ్మశానవాటికల సమీపంలో స్థల పరిశీలన పూర్తయ్యిందని తెలిపారు. ఇకపై కరీంనగర్‌లో నివసించే నిరుపేదలు ఎవరు ఎక్కడ చనిపోయినా, వారి ఆధార్‌ వివరాలతో సంబంధం లేకుండా ‘ఒక్క రూపాయి’కే అంత్యక్రియలు నిర్వహించేలా ‘ఆఖరి సఫర్‌’ పథకంలో మార్పులు చేస్తామని ప్రకటించారు. చనిపోయిన రోజు నుంచి కర్మకాండలు ముగిసే వరకు కుటుంబ సభ్యులు ఇక్కడే ఉండొచ్చని, నిర్వహణ కోసం పేదలపై భారం పడకుండా అతి తక్కువ ఫీజును నిర్ణయిం చనున్నామని చెప్పారు. మేయర్‌ ప్రకటిం చిన కర్మకాండ నిలయాలు త్వరలోనే కార్యరూపం దాల్చితే, అద్దె ఇండ్లలో నివసించే వేలాది పేద కుటుంబాలకు పెద్ద ఊరట లభించనుంది.

ఇందిరమ్మ ఇల్ల్ణు ఇవ్వాలి సీపీఐ(ఎం) డిమాండ్‌
‘సమాజంలో మానవ విలువలు ఎంతలా దిగజారిపోతున్నాయో ఈ ఘటనే నిదర్శనం. ఆ అభాగ్య కుటుంబానికి తక్షణమే రాజీవ్‌ గృహకల్ప లేదా ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలి. పసిపిల్లల బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలి’ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -