మేడారం..జనారణ్యం.. ఇప్పటికే వనదేవతలను దర్శించుకున్న లక్షలమంది కి పైగా భక్తులు

నవతెలంగాణ – తాడ్వాయి 

మేడారం జాతరకు భక్తులు ఇంకా వస్తూనే ఉన్నారు. వనదేవతలను దర్శించుకునేందుకు.. దేశం నలుమూలల నుంచి గిరిజనులు మేడారానికి తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా.. ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆసియాలోనే అతిపెద్ద జాతర మేడారానికి భక్తులు తరలివస్తూనే ఉన్నారు. ఇప్పటికే కోటి మందికిపైగా భక్తులు దర్శించుకున్నట్టు తెలుస్తోంది. ఇంకా వచ్చే అవకాశం ఉంది. మేడారంలో ఎటు చూసినా.. జనాలే కనిపిస్తున్నారు. జంపన్న వాగులో స్నానాలు ఆచరించి.. అమ్మవార్లను దర్శించుకునేందుకు వస్తున్నారు. క్యూ లైన్లలో నిలుచుని అమ్మవారి నామస్మరణ చేస్తున్నారు. ఇప్పటికే ప్రముఖులు సైతం దర్శనం చేసుకుంటున్నారు. రాష్ట్ర మంత్రులు సీతక్క కొండ సురేఖ పొన్నం ప్రభాకర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు డైరెక్టర్లు ముఖ్యమైన ప్రభుత్వ పెద్దలు వివిధ పార్టీల రాజకీయ నేతలు వనదేవతలను దర్శించుకుని.. ఎత్తు బంగారం సమర్పించుకున్నారు. రాష్ట్ర మంత్రులు సైతం.. మేడారాన్ని దర్శించుకున్నారు. మంత్రి సీతక్క.. అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. రెండు సంవత్సరాలకు ఓసారి జరిగే.. ఈ జాతరకు తెలంగాణతోపాటు.. ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. మేడారం గ్రామం.. ములుగు జిల్లా కేంద్రానికి 44 కి.మీ దూరంలో అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఈ జాతర నాలుగు రోజులపాటు జరుగుతుంది. మెుదటి రోజున.. మొదటి రోజు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు మేడారం గద్దెల పైకి చేరుతారు. రెండో రోజు చిలుకల గుట్ట నుంచి ఊరేగింపుగా సమ్మక్కను తీసుకొస్తారు. కుంకుమ భరిణె రూపంలో అమ్మవారు గద్దెల పైకి వస్తారు. మూడో రోజు వనదేవతలు.. భక్తులకు దర్శనమిస్తారు. నాలుగో రోజు సాయంత్రం వన దేవతలు తిరిగి వన ప్రవేశం చేస్తారు. దీంతో జాతర ముగుస్తుంది.

Spread the love