నేటి నుంచి మేడారం మహాజాతర

From today Medaram Mahajatara– వెలసిన గుడారాలు.. బయలెల్లిన పగిడిద్దరాజు
– నేడు కన్నెపల్లి నుంచి రానున్న సారలమ్మ
– రేపు చిలకలగుట్ట నుంచి సమ్మక్క
– జాతరకు రూ.105 కోట్లతో ఏర్పాట్లు
– 12 వేల మంది సిబ్బందితో భారీ బందోబస్తు
– మేడారం నుంచి నవతెలంగాణ
ప్రాంతీయ ప్రతినిధి బి.దయాసాగర్‌
మేడారం సమ్మక్క, సారక్కల మహా జాతర బుధవారం ప్రారంభం కానుంది. ఈనెల 21వ తేదీ నుండి 24వ తేదీ వరకు జరిగే ఈ జాతరకు లక్షలాది మంది సందర్శకులు తరలిరానున్నారు. ఇప్పటికే చాలా మంది తమ మొక్కులు చెల్లించుకున్నారు. జాతరలో భాగంగా మహబూబాబాద్‌ జిల్లా పూనుగొండ్ల గ్రామం నుంచి సమ్మక్క భర్త పడగ రూపంలోనున్న పగిడిద్దరాజు, కన్నాయిగూడెం మండలంలోని కొండాయి నుంచి గోవిందరాజులును, తాడ్వాయి మండలం కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకొని బుధవారం మేడారంలోని గద్దెలపై ప్రతిష్ఠించనున్నారు. గురువారం సాయంత్రం చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొని వచ్చి గద్దెలపై ఉంచనున్నారు. అధికారిక లాంఛనాలతో ఉద్విగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. లక్షలాది మంది ప్రజల నడుమ యాటలు, కోళ్ల బలులతో సమ్మక్కను తీసుకువచ్చే రహదారిపై రక్తతర్పణం చేస్తారు. శివసత్తులు, కొమ్ము వాయి ద్యాలు, ఆదివాసీ యువతీయువకుల సంప్రదాయ నృత్యాల నడుమ భారీ పోలీసు బందోబస్తుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. కాగా, జాతరకు ప్రయాణీకుల సౌకర్యార్ధం ఆర్టీసీ 6 వేల బస్సులను ఏర్పాటు చేసింది.
పడగ రూపంలో బయలెల్లిన పగిడిద్దరాజు
మహబూఐబాబాద్‌ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామం నుంచి సమ్మక్క భర్త పగిడిగిద్దరాజుకు పెనుక వంశానికి చెందిన ప్రధాన పూజారి పెనుక రాజేశ్వర్‌ తదితరులు ఊమంగళవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆచార వ్యవహారాలతో పగిడిద్దరాజును పెళ్లి కుమారుడిగా ముస్తాబు చేశారు. అనంతరం అక్కడ నుంచి మేడారానికి అటవీ మార్గంలో కాలినడకన కర్లపెల్లి, గుండ్లవాగు మీదుగా గోవిందరావుపేట మండలం లక్ష్మీపురం చేరుకుంటారు. గోవిందరావుపేట మండలం లక్ష్మీపురం గ్రామంలో రాత్రి బస చేయడానికి పగిడిగిద్దరాజు పూజారుల కోసం నిర్మించిన భవనాన్ని మంగళవారం మంత్రి సీతక్క ప్రారంభించారు. పగిడిద్దరాజు పూజారులు బుధవారం మధ్యాహ్నం జంపన్నవాగు వద్దకు చేరుకుంటారు. అలాగే, కన్నాయిగూడెం మండలం కొండాయి నుంచి గోవిందరాజులును పూజారి దబ్బకట్ల గోవర్ధన్‌ తీసుకొని బుధవారం సాయంత్రం జంపన్నవాగు సమీపంలోకి వస్తారు. ఆ తర్వాత సారలమ్మను తీసుకొనివచ్చే క్రమంలోనే పగిడిద్దరాజు, గోవిందరాజులను కూడా తీసుకొని వచ్చి మేడారంలోని గద్దెలపై ప్రతిష్ఠిస్తారు.
నేడు గద్దెలకు సారలమ్మ, రేపు సమ్మక్క..
కన్నెపల్లిలో తొలుత ములుగు జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ వేణుగోపాల్‌ సారలమ్మ దేవాలయంలో అధికారిక లాంఛనాలతో పూజలు చేస్తారు. అనంతరం ప్రధాన పూజారి కాకసారయ్యతో పాటు ఇతర పూజారులు సారలమ్మను ఆదివాసీల డోలు, కొమ్మువాయిద్యాలతో తీసుకొని బుధవారం మేడారం గద్దెలపై ప్రతిష్టిస్తారు. గురువారం మధ్యాహ్నం చిలుకలగుట్టలోని సమ్మక్క దేవాలయంలో పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత ప్రధాన పూజారి కొక్కెర కృష్ణ సమ్మక్కను తీసుకుని బయలుదేరుతారు. ఈ క్రమంలో అధికారిక లాంఛనాలలో భాగంగా ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్‌ శబరీష్‌ గాలిలోకి కాల్పులు జరిపి సమ్మక్కకు ఆహ్వానం పలుకుతారు. భారీ భద్రత నడుమ, రోప్‌ పార్టీ మధ్యలో పూజారులు, మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ఎస్పీ డాక్టర్‌ శబరీష్‌ ఆధ్వర్యంలో సమ్మక్కను పూజారి కొక్కెర కృష్ణ తీసుకుని గద్దెలపైకి తీసుకువచ్చి ప్రతిష్ఠిస్తారు.
శుక్రవారం నాటికి గద్దెలపై సమ్మక్క, సారలమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజులు కొలువుతీరి ఉండటంతో ఆదివాసీలు మొక్కులు సమర్పించుకుంటారు. జాతర ముగింపులో భాగంగా ఈనెల 24న సాయంత్రం సమ్మక్క, సారలమ్మల వనప్రవేశం నేపథ్యంలో పగిడిగిద్దరాజును తీసుకొని పూజారులు మళ్లీ పూనుగొండ్ల గ్రామానికి చేరుకొని 26వ తేదీన దేవాలయంలో ప్రతిష్ఠిస్తారు. ఈనెల 28, 29 మార్చి 1వ తేదీలలో తిరుగువారం జాతర జరుపుకుంటారు.
జాతరకు రూ.105 కోట్లతో ఏర్పాట్లు
మేడారం జాతరను అత్యంత వైభవంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.105 కోట్లతో వివిధ శాఖల కింద పలు పనులను ప్రారంభించి పూర్తి చేసింది. జాతర విజయవంతానికి మంత్రి సీతక్కతో పాటు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌ పలుమార్లు మేడారం వచ్చి ఏర్పాట్లను సమీక్షించారు. ఆర్‌డబ్ల్యుఎస్‌ శాఖ ఆధ్వర్యంలో తాగునీటికి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేశారు. మరుగుదొడ్లు, మినీ డంపింగ్‌ యార్డులనూ ఏర్పాటుచేశారు. పారిశుద్ధ్యం నిర్వహణకు 4000 మంది సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు. జాతరలో నిరంతర విద్యుత్‌ నందించడానికి కొత్తూర్‌, మేడారంలలోని సబ్‌స్టేషన్‌లలో పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్ధ్యాన్ని పెంచారు. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మేడారంలోని కళ్యాణమండపంలో రూ. ఒక కోటితో 50 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేశారు.
12 వేల మంది సిబ్బందితో భారీ బందోబస్తు
మేడారంలో శాంతిభద్రతల పరిరక్షణతోపాటు ట్రాఫిక్‌ రద్దీ నియంత్రణకు ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్‌ శబరీష్‌ నాయకత్వంలో 12 వేల మంది సిబ్బందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 500 సీసీ కెమెరాలతో మొదటిసారి శాశ్వత ప్రాతిపదికన రూపొందించిన పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ నుంచి జాతరతోపాటు పరిసర ప్రాంతాలను పర్యవేక్షించనున్నారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి
– రద్దీకనుగుణంగా సౌకర్యాల పెంపు
– పెరుగుతున్న భక్తుల తాకిడి
– సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్‌ వెల్లడి
మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరను గిరిజన సాంప్రదాయాల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. భక్తులకు ఎలాంటి లోటుపాట్లు జరగొద్దనే సంకల్పంతో ముఖ్య మంత్రి రూ. 105 కోట్ల నిధులను మంజూరు చేశారు. తెలంగాణలో మహా కుంభమేళగా ప్రసిద్ధి గాంచిన అతి పెద్ద ఈ గిరిజన జాతర రెండేండ్లకొకసారి మాఘ మాసంలో నాలుగు రోజుల పాటు జరుగుతుంది. ఈ జాతరకు రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి సైతం భక్తులు తండోపతండాలుగా తరలి వస్తారు. ప్రతి ఏడాది వారి తాకిడి పెరుగుతూనే వుంది. ఇప్పటికే 58 లక్షలకు పైగా భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు. భక్తుల తాకిడికి అనుగుణంగా ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. తాత్కాలిక ఏర్పాట్లతో పాటు ఈ ఏడాది శాశ్వత ఏర్పాట్ల పైనే ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే భక్తులకు వివిధ శాఖల ద్వారా నివాసానికి ఉన్న షెడ్లతో పాటు అదనంగా మరికొన్ని నిర్మాణాలను పూర్తి చేశారు. వరంగల్‌ నుంచి మేడారం మార్గంలో రూ. 1.65 కోట్ల చొప్పున మూడు షెడ్లను నిర్మించారు. వన దేవతలు గద్దెలకు చేరటానికి ముందు రోజు నుంచి తిరిగి వనంలోకి వెళ్లేవరకు భక్తులు నాలుగు రోజుల పాటు గుడారాలు వేసుకొని అమ్మవార్ల సన్నిధిలో ఉండడం ఆనవాయితీ. ఈ మేరకు గుడారాలతో భక్తులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం, జిల్లా యంత్రంగం ముందుచూపుతో ి ఏర్పాట్లు చేసింది.
జాతర నిర్వహణకు. త్రాగు నీరు, మరుగుదొడ్లు, అదనపు స్నాన ఘట్టాలు, బ్యాటరీ ట్యాప్స్‌, అంతర్గత రోడ్లు, వైద్యం, వసతి, పారిశుద్ధ్యం, నిరంతర విద్యుత్‌ సరఫరా, రహదారుల అభివృద్ధి , క్యూలైన్‌, తదితర ఏర్పాట్లను పూర్తి చేసింది. జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో అనేక మార్లు పర్యటించింది. గత జాతర అనుభవాలను పరిగణనలోకి తీసుకొని లోపాలను సరిదిద్దింది. ఏర్పాట్లను విస్తృత పరిచింది. భక్తులకు ఇబ్బందుల్లేని దర్శనమే లక్ష్యంగా జిల్లా, రాష్ట్ర యత్రంగాలు ప్రత్యేక దృష్టి సారించాయి. జాతరకు ముందు ఏర్పాట్లను పంచయత్‌ రాజ్‌, గ్రామీణాభివృద్ధి , స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన సూచనలు చేశారు. ఉన్నతాధికారులు కూడా పలుమార్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి పనులను పర్యవేక్షించారు. రెవెన్యూ, గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, బీసి సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రత్యేకంగా మేడారంలో పర్యటించి పనులను పరిశీలించారు. మొత్తంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా జాతరను విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనులు పుర్తి చేశాయి. రవాణా వ్యవస్థను నియంత్రించేందుకు వాహనాల పార్కింగ్‌ స్థలాలను గద్దెలకు దూరంగా ఏర్పాటు చేయడం, రోడ్ల వెడల్పు, నూతన రోడ్లు, మరమ్మత్తులు చేసి ట్రాఫిక్‌ సమస్యలను అధిగమించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.
నిరంతర నిఘా : జాతర జరిగే అన్ని ప్రాంతాల్లో 300 ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. పర్యవేక్షణ కోసం 300సీసీ కెమెరాలు, డ్రోన్‌ కెమెరాలను ఏర్పాటు చేసి సెంట్రల్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా నిరంతర పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా మెరుగైన సేవలు అందించేందుకు ఆలయ పరిసర ప్రాంతాలను 10 జోన్లు, 38 సెక్టార్లు, 60 సబ్‌ సెక్టర్లుగా విభజించి సెక్టార్ల వారీగా అధికారులు సిబ్బందిని నియమించారు. సెక్టోరల్‌ అధికారులకు ఇచ్చిన వాకిటాకీ ద్వారా వివరాలు తెలుసుకుంటూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్త్తున్నారు. దాదాపు 16 వేల మంది ఉద్యోగులు మేడారం విధుల్లో పాల్గొననున్నారు.
రవాణా శాఖ : భక్తుల రవాణాకు ఆర్టీసీ ఆరువేల బస్సులను ఏర్పాటు చేసింది. రవాణా సౌకర్యాలకోసం ప్రభుత్వంరూ.2.25 కోట్ల నిధులు మంజూరు చెసింది. తాత్కాలిక బస్‌ స్టాండ్‌తో పాటు, సీసీ కెమెరాలు, టికెట్‌ బుకింగ్‌ కౌంటర్లు, లైటింగ్‌, రైలింగ్‌, త్రాగు నీటి సౌకర్యం తదితర ఏర్పాట్లు చేసి రవాణాకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టింది.
ఆర్‌డబ్ల్యుఎస్‌ : ఆర్‌డబ్ల్యుఎస్‌ శాఖ ద్వారా రూ.13.50కోట్లతో పనులు చేపట్టారు. 17 ఇన్‌ ఫిల్టరేషన్‌ వెల్స్‌ , 495 ప్రాంతాల్లో ఐదువేల నల్లాలను ఎర్పాటు చేశారు. విద్యుత్‌ అంతరాయం కలగకుండా 40 జనరేటర్లు ఎర్పాటు చేశారు. 8,400 తాత్కాలిక మరుగుదొడ్లను 500 ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఏడు ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు ఏర్పాటు చేస,ి తాగునీరు అందిస్తున్నారు. మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు 300 మంది సిబ్బందిని నియమించారు.
పంచాయతీరాజ్‌ : జాతరకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తోన్న నేపథ్యంలో పారిశుధ్యం ఇక్కడ పెద్ద సవాలుగా మారింది. దానిపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం నాలుగు వేల మంది కార్మికులను ఏర్పాటు చెసింది. పారిశుధ్య నిర్వహణకు మేడారంకు ఆవల డంపింగ్‌ యార్డులు, జాతర పరిసర ప్రాంతాల్లో 300 మిని డంపింగ్‌ యార్డులు ఏర్పాటు చేశారు. పారిశుధ్య కార్మికులతో గద్దెల వద్ద, పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసే విదంగా చర్యలు తీసుకుంటున్నారు.
విద్యుత్‌ శాఖ: జాతరలో నిరంతరం విద్యుత్‌ సరఫరాకు రూ.3.97కోట్లతో పనులు చేపట్టారు. నూతనంగా 210 ట్రాన్స్‌ఫార్మర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
వైద్య శాఖ : భక్తుల ఆరోగ్య పరిరక్షణకు వైద్య ఆరోగ్య శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. మేడారం కల్యాణ మండపంలో కోటి రూపాయలతో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేసి 25 మంది వైద్యులు, 120 మంది వైద్యాధికారులు, 857 పారా మెడికల్‌ సిబ్బందిని ప్రభుత్వం నియమించింది. పరిసర గ్రామాల్లో 75 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి అవసరమైన మందులు అందుబాటులో ఉంచింది. క్యూ లైన్ల వద్ద మినీ క్యాంపులు ఏర్పాటు చేశారు. తాడ్వాయిలో 10 పడకలు, పస్రలో ఐదు పడకల ఆసుపత్రులతోపాటు 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేశారు. జాతరలో ప్రత్యేకంగా 30 మొబైల్‌ అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు.
పోలీస్‌ శాఖ : శాంతి భద్రతల పరిరక్షణకు, జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్‌ శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. 12 వేల పోలీస్‌ సిబ్బందితో 300 సిసి కెమెరాలు, డ్రోన్‌ కెమెరాలతో జాతర పరిసర ప్రాంతాల్లో 33 పార్కింగ్‌ స్థలాలను ఎర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నదని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమీషనర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు..

Spread the love