నవతెలంగాణ – ఆలేరు రూరల్
యోగతో శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని డాక్టర్ స్వప్న రాథోడ్ అన్నారు. సోమవారం ఆలేరు మండలం మదనపల్లి గ్రామంలోని లివింగ్ ట్రీ డిస్కవరీ హై స్కూల్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, అది మనస్సు శరీరం, ఆత్మల సమన్వయానికి దోహదపడే జీవన విధానమని పేర్కొన్నారు.
ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి కారణంగా ఒత్తిడిఆందోళన, అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని, ప్రతిరోజూ కొంత సమయం యోగాభ్యాసానికి కేటాయించడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు చిన్న వయస్సు నుంచే యోగాను అలవాటు చేసుకుంటే ఏకాగ్రత పెరగడంతో పాటు చదువులోనూ మంచి ఫలితాలు సాధించగలరని తెలిపారు.
అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ సలోమి గువ్వల మాట్లాడుతూ విద్యార్థుల సమగ్ర వికాసానికి యోగా ఎంతో అవసరమని అన్నారు. పాఠశాలలో విద్యార్థులకు విద్యతో పాటు ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించే కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నామని చెప్పారు. యోగా ద్వారా క్రమశిక్షణ,ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని, ప్రతి విద్యార్థి నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు. ఆ తర్వాత విద్యార్థులు వివిధ యోగాసనాలను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల మేనేజర్ డి.రమేష్, పి ఈ టి లు విజయకుమార్, సంధ్య, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.



