– ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక, బీమా సేవల సంస్థ
– ఆ సంస్థ ప్రతినిధులతో కేటీఆర్ సమావేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఇప్పటికే హైదరాబాద్ నగరం అంతర్జాతీయ దిగ్గజ సంస్థల గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు కేంద్రంగా మారింది. ఇదే క్రమంలో మరో ఆర్థిక సేవలు, బీమా దిగ్గజ సంస్థ మెట్‌లైఫ్ హైదరాబాద్ నగరంలో తన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మెట్‌లైఫ్ కేంద్ర కార్యాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆ సంస్థ సీనియర్ ప్రతినిధి బందంతో గురువారం సమావేశమయ్యారు. మెట్‌లైఫ్ సంస్థ ప్రపంచంలోనే అత్యధిక మందికి బీమా, ఆర్థిక సేవలు అందిస్తున్న సంస్థగా పేరుగాంచింది. అమెరికా ఫార్చ్యూన్ 500 జాబితాలో ఉన్న ఇంత పెద్ద సంస్థ హైదరాబాద్ నగరంలో తన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగంలో హైదరాబాద్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా మెట్‌లైఫ్ సంస్థ నిర్ణయం దోహదం చేస్తుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం బ్యాంకింగ్, ఫైనాన్స్ సేవలు, బీమా రంగాలను బలోపేతం చేసేందుకు రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి విస్తతంగా ప్రయత్నం చేస్తున్నదని, ఈ ప్రయత్నాలు ఫలించి అనేక దిగ్గజ సంస్థలు ఈ రంగంలో తమ కార్యకలాపాలను హైదరాబాద్ నగరం కేంద్రంగా విస్తరిస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే అనేక ప్రఖ్యాత సంస్థలు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను ఏర్పాటు చేశాయని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనేక అంతర్జాతీయ, దేశీయ సంస్థలు ఈ రంగంలో హైదరాబాద్ కేంద్రంగా విస్తృతమైన అభివృద్ధిని సాధిస్తున్నాయని, ఇలాంటి ఆకర్షణీయమైన హైదరాబాద్ నగరానికి మెట్‌లైఫ్ సంస్థను స్వాగతిస్తున్నట్టు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.న్యూయార్క్ నగరంలో విద్యార్థిగా, ఉద్యోగిగా పనిచేస్తున్న కాలంలో మెట్‌లైఫ్ కేంద్ర కార్యాలయ భవన రాజసం, నిర్మాణ శైలి తనను ఎంతో ఆశ్చర్యానికి గురి చేసేదని పేర్కొన్న కేటీఆర్, ఇదే కేంద్ర కార్యాలయంలో తన సొంత రాష్ట్రానికి పెట్టుబడులను కోరుతూ సమావేశం కావడం, తనకు అత్యంత సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు.
హైదరాబాద్‌లో జీహెచ్‌ఎక్స్ విస్తరణ
గ్లోబల్ హెల్త్ కేర్ ఎక్స్చేంజ్(జీహెచ్‌ఎక్స్) సంస్ధ హైదరాబాద్ నగరంలో తన విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. నగరం కేంద్రంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. హెల్త్‌కేర్ రంగానికి అద్భుతమైన అనుకూల వాతావరణం ఉందని, ముఖ్యంగా మానవ వనరులతో పాటు ఈ రంగానికి సంబంధించిన అనేక సంస్థల సమ్మిళిత ఈకో సిస్టం ఉన్నదని సంస్థ తెలిపింది.సంస్థ చీఫ్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ఆఫీసర్ క్రిస్టీ లియోనార్డ్ ప్రతినిధి బందంతో మంత్రి కేటీఆర్ న్యూయార్క్ నగరంలో గురువారం సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం సంస్థ తన విస్తరణ ప్రణాళికలను అధికారికం గా ప్రకటించింది. హెల్త్ కేర్ రంగం పూర్తిగా డిజిటల్ దిశగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిందని, ఇందులో భాగంగా హెల్త్‌కేర్ కంపెనీలు పెద్ద ఎత్తున డిజిటలీకరణ, ఐటీి ఆధారిత సేవలపై విస్తతంగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా జీహెచ్‌ఎక్స్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సీజే సింగ్ తెలిపారు. ఈ దిశలోనే హైదరాబాద్‌లో తమ విస్తరణ ప్రణాళికలు, గ్లోబల్ కాపబిలిటీ కేంద్రం ద్వారా సంస్థ లక్ష్యాలను అందుకుంటా మన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎక్స్ సంస్థ 2025 నాటికి తన ప్రస్తుత కార్యకలాపాలను మూడింతలు చేసే లక్ష్యంతో విస్తరణ ప్రణాళికలను చేపడుతుందని సంస్ధ బందం తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరం కేంద్రంగా ఇంజనీరింగ్, ఆపరేషన్ కార్యకలాపాలను విస్తరిస్తామని, తమ సంస్థ ఇన్నోవేషన్ లక్ష్యాలకు అనుగుణంగా ఈ విస్తరణ ఉంటుందని సంస్థ ప్రతినిధి బందం తెలిపింది.ప్రపంచ దిగ్గజ సంస్థలు నగరంలో తమ హెల్త్ కేర్ ఆధారిత టెక్నాలజీ ఆధారిత కార్యకలాపాలను విస్తరించేందుకు ముందుకు వస్తున్నాయని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. ఒకవైపు హెల్త్ కేర్, ఫార్మా, లైఫ్ సెన్సెస్ రంగానికి చేయూతను అందిస్తూనే ఐటీ ఆధారిత కార్యకలాపాలను పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరానికి ఆకర్షించేందుకు ప్రభుత్వం నిరంతరం కషి చేస్తుందని అన్నారు. ప్రభుత్వ ఆలోచనలను బలోపేతం చేసే దిశగా జీహెచ్‌ఎక్స్ సంస్థ తన విస్తరణ ప్రణాళికలను హైదరాబాద్ కేంద్రంగా ప్రకటించడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.