ఎంఐఎం తొలి జాబితా

ఎంఐఎం తొలి జాబితా– తొమ్మిది స్థానాల్లో పోటీకి నిర్ణయం
– 6 స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన
– ఇద్దరు సిట్టింగ్‌లకు మొండి చెయ్యి
– మిగతా స్థానాల్లో బీఆర్‌ఎస్‌కు మద్దతు : పార్టీ అధినేత అసదుద్దీన్‌ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో, హైదరాబాద్‌.
తెలంగాణ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను ఎంఐఎం విడుదల చేసింది. శుక్రవారం దారుసలాంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ అధినేత అసదుద్ధీన్‌ ఓవైసీ 6 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం 9 స్థానాల్లో పోటీ చేస్తున్నామని, సిట్టింగ్‌ స్థానమైన బహదూర్‌ పురాతో పాటు రాజేంద్ర నగర్‌, జూబ్లిహిల్స్‌ స్థానాల్లో అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. పోటీ చేస్తున్న తొమ్మిది నియోజక వర్గాల్లో ఎంఐఎంకు పట్టం కట్టాలని ఆయన ఓటర్లను కోరారు. కేసీఆర్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని,మరోసారి తెలంగాణలో ఎవ్వరి మద్దతు లేకుండా బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుందని తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నప్పటికి రాజేంద్రనగర్‌లో ప్రకాష్‌ గౌడ్‌ జూబ్లీహిల్స్‌లో మాగంటి గోపీనాథ్‌లను ఓడగొడతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని పగటి కలలు కంటోందని విమర్శించారు. బీజేపీ బీసీ ముఖ్యమంత్రి ప్రకటన పెద్ద జోక్‌ అని కొట్టి పారేసారు. బాబ్రీ మసీద్‌ కూల్చివేత పాపంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్‌ పాత్ర కూడా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరే నిజమైన సెక్యులర్‌ వాది అని కితాబు నిచ్చారు.సెక్రటేరియట్‌లో కూల్చిన మసీద్‌ను కేసీఆర్‌ సర్కార్‌ కొత్తగా నిర్మించి ముస్లింల మనోభావాలను కాపాడిందని గుర్తు చేశారు. ఇద్దరు సిట్టంగ్‌లకు మొండి చెయ్యిఎంఐఎం పార్టీ 2018లో పాగా వేసిన ఎడు సిట్టింగ్‌ స్థానాల్లో శుక్రవారం 6 స్థానాల అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో ఇద్దరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు మొండి చెయ్యిచ్చింది. చార్మినార్‌ నుంచి గెలిచిన ముంతాజ్‌ ఖాన్‌, యాకత్‌ పురా నుంచి గెలిచిన పాషా ఖాద్రిలను వయోభారం దృష్య్టా తప్పిస్తామని గతంలోనే ఎంఐఎం ప్రకటించింది. ఆ స్థానాల్లో మాజీ మేయర్‌ మాజిద్‌ హుస్సేన్‌, అక్భరుద్ధీన్‌ కుటుంబం నుంచి కొడుకు లేదా కూతురికి అవకాశం కల్పించనున్నట్టు పార్టీ వెల్లడించింది. అయితే అన్యూహంగా అక్భరుద్ధీన్‌ కుటుంబం నుంచి కాకుండా మరో మాజీ మేయర్‌ జుల్ఫీకర్‌ అలీ అహ్మద్‌కు చార్మినార్‌ టికెట్‌ కేటాయించారు. సెకండ్‌ లిస్టులో ఓవైసీ కుటుంబం నుంచి ఒకరికి అవకాశం కల్పించేందుకే మరో సిట్టింగ్‌ స్థానమైన బహదూర్‌ పుర టికెట్‌ను ఆపినట్టు తెలుస్తోంది.
ప్రకటించిన అభ్యర్థుల వివరాలు
1). చార్మినార్‌- జుల్ఫేఖర్‌ అహ్మద్‌
2). చాంద్రాయణ గుట్ట – అక్బరుద్దీన్‌ ఓవైసీ
3). మలక్‌ పేట్‌ – అహ్మద్‌ బలాల
4). నాంపల్లి – మాజిద్‌ హుస్సేన్‌
5). కార్వాన్‌ – కౌజర్‌ మోహినుద్దిన్‌
6). యాకత్‌ పుర – జాఫర్‌ హుస్సేన్‌ మీరజ్‌

Spread the love