– జంట జలాశయాల నుంచి హైదరాబాద్‌కు అదనపు నీరు
– సమీక్షలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్ వెల్లడి
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ నగరంలో తాగునీటి సరఫరాలో ఎలాంటి అవాంతరాలు ఉండకూడదని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం. దానకిశోర్ జలమండలి అధికారులను ఆదేశించారు.వేసవిలో తాగునీరు, ట్యాంకర్ సరఫరా తదితర అంశాలపై జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డితో పాటు ఇతర ఉన్న తాధికారులతో హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో శనివారం సమీక్ష నిర్వ హించారు. సెక్షన్ల వారీగా నీటి సరఫరా, ట్యాంకర్ బుకింగ్స్, డెలివరీ, లైన్‌మెన్ల పనితీరు తదితర అంశాలపై ఆయన ఆరా తీశారు. మేనేజర్, జనరల్ మేనేజర్, సీజీఎంలు క్షేత్ర స్థాయిలో లైన్‌మెన్ల పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నగర తాగునీటి అవసరాలకు జంట జలాశయాల నుంచి అదనంగా 20 ఎంఎల్డీల నీరు వాడుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. భవిష్యత్తు అవసరాల కోసం నీటిని శుద్ధి చేసేందుకు మిరాలం, ఆసిఫ్ నగర్ దగ్గరున్న ఫిల్టర్ బెడ్స్ వంద శాతం పనిచేసేలా మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. లైన్ మెన్లు ఉద్దేశ పూర్వకంగా ప్రజలకు నీటి సరఫరాలో ఆటంకాలు కల్పిస్తే విధుల నుంచి తప్పిస్తామని హెచ్చరించారు.
జలమండలి రూపొందించిన నాణ్యత యాప్‌లో నీటి సరఫరా, క్వాలిటీ వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని చెప్పారు. సరఫరా వేళలు, నాణ్యత విషయంలో తేడా వస్తే అలాంటి వారిని తొలగించాలని ఆదేశించారు.వినియో గదారుల నుంచి డిమాండ్ ఎదుర్కొనేందుకు అదనంగా 5 కేఎల్ సామర్థ్యం కలిగిన వంద ట్యాంకర్లను సమకూర్చుకుంటున్నట్టు తెలిపారు. ఇరుకుగా ఉన్న కాలనీలు, బస్తీలు, కలుషిత నీటి ప్రభావిత ప్రాంతాలకు నీటి సరఫరా చేసేందుకు 2.5 కేఎల్ సామర్థ్యం కలిగిన 70 మినీ ట్యాంకర్లను కూడా తీసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ట్యాంకర్ డిమాండ్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో అదనపు ఫిల్లింగ్ స్టేషన్స్, ఫిల్లింగ్ పాయింట్స్ ఏర్పాటు చేసుకోవాలన్నారు.
నాగార్జున సాగర్‌లో ఎమర్జెన్సీ పంపింగ్‌కు ఏర్పాట్లు
నాగార్జున సాగర్‌లో ఎమర్జెన్సీ పంపింగ్ కోసం ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్టు ఎం. దానకిశోర్ స్పష్టం చేశారు. ఈ నెల 15వ తేదీ తర్వాత ఏ క్షణమైనా పంపింగ్ చేసే అవకాశముందని వివరించారు. హైదరాబాద్‌లో జలమండలి ఏర్పాటు చేసిన చలివేంద్రాలకు మంచి ఆదరణ వస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే 101 కేంద్రాలను ఏర్పాటు చేశామని వీలైతే మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమీక్షలో ఈడీ. డా. ఎం. సత్యనారాయణ, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్. ప్రవీణ్ కుమార్, టెక్నికల్ డైరెక్టర్ రవి కుమార్, ఆపరేషన్స్ డైరెక్టర్-2 స్వామి, సీజీఎంలు, జీఎంలు, మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.