నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్
రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రానికి వెళ్తున్న క్రమంలో పందిళ్ల నుంచి హుస్నాబాద్ బస్‌స్టేషన్ వరకు సాధారణ ప్రయాణికులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా బస్సులోని మహిళా ప్రయాణికులు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు రాఖీలు కట్టి తమ ఆత్మీయతను చాటుకున్నారు. మహిళా ప్రయాణికులు రాఖీలు కట్టడంతో మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ప్రయాణికులను ఆత్మీయంగా పలకరిస్తూ వారి ప్రయాణ అనుభవాలను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి ప్రతి కుటుంబంలో సంతోషాన్ని, ఐక్యతను నింపాలని మంత్రి ఆకాంక్షించారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాఖీ పౌర్ణమి వేడుకలు
హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు, కార్యకర్తలు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు రాఖీలు కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళా సోదరీమణులతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆప్యాయంగా ముచ్చటిస్తూ, వారిని పలకరించి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం మహిళా సోదరీమణులకు స్వీట్లు తినిపించి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాఖీ పౌర్ణమి అన్నాచెల్లెళ్ల, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధానికి ప్రతీక అని అన్నారు. మహిళల భద్రత, గౌరవం, సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రతి కుటుంబంలో సోదర, సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలు మరింత బలపడాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషం, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు.



