వారి హ‌యంలోనే మిర్యాలగూడ అభివృధ్ది

– అనేక రకాలుగా కార్మికులకు అండగా సీపీఐ(ఎం)
– సాగర్‌ నీటి కోసం నిరవధిక నిరాహార దీక్ష
– ఎన్నో పనులకు రూపకల్పన చేసిన రంగన్న
నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు, రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రధాన కేంద్ర బిందువుగా ఉన్న మిర్యాలగూడ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. సాగర్‌ ఎడమ కాలువ పరిధిలోని మొత్తం మొదటి జోన్‌ పరిధిలో ఉన్న మిర్యాలగూడ నియోజవర్గం వ్యవసాయానికి ప్రధాన ఆధారం. పండించిన పంటను కొనుగోలు చేసినందుకు అవసరమైన రైస్‌ ఇండిస్టీని స్థానికంగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ రైస్‌ ఇండిస్టీ ఆసియా ఖండంలోనే వ్యాపారపరంగా రెండో స్థానంలో ఉంది. కార్మికులు వ్యవసాయ కూలీలు, పేద ప్రజలు, చిన్నచిన్న వ్యాపారులు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గం కమ్యూనిస్టులకు కంచుకోటగా నిలిచింది. వారి హయాంలోనే అభివృద్ధి జరిగింది.
నవతెలంగాణ-మిర్యాలగూడ
ముందుగా మిర్యాలగూడ పెద్దమునగాల నియోజకవర్గంగా ఉండేది. పెద్దమనగాల నియోజకవర్గంలో 1952లోనే రెండు పర్యా యాలు ఎన్నికలు జరిగాయి. ఒకసారి పీడీఎఫ్‌ అభ్యర్థి, అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి విజయం సాధించారు. 1951లో మిర్యాలగూడ నియోజకవర్గం ఏర్పడిన తరువాత నుంచి ఇప్పటి వరకు 15సార్లు ఎన్నికలు జరిగాయి. వీటిలో ఏడు పర్యాయాలు కాంగ్రెస్‌ అభ్యర్థులు, ఐదు పర్యాయాలు సీపీఐ(ఎం) అభ్యర్థులు గెలుపొందారు. ఒక పర్యాయం పీడీఎఫ్‌ అభ్యర్థి గెలుపొందారు. 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ (టీఆర్‌ఎస్‌) అభ్యర్థి నల్లమోతు భాస్కర్‌రావు గెలుపొందారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ(ఎం) తరపున జూలకంటి రంగారెడ్డి పోటీపడుతున్నారు. కాంగ్రెస్‌ నుంచి బీఎల్‌ఆర్‌ ఉన్నారు.
45 ఏండ్లుగా ప్రజా జీవితంలో జూలకంటి
జూలకంటి రంగారెడ్డి 45 ఏండ్లుగా ప్రజాజీవితంలోనే కొనసాగుతున్నారు డీవైఎఫ్‌ఐ నుంచి మొదలైన రాజకీయ ప్రస్థానం.. సీపీఐ(ఎం)లో జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా, ఆయా ప్రజా సంఘాల బాధ్యతల్లో ఉన్నారు. అప్పట్లో ఆయన రాశి సిమెంట్‌ ఫ్యాక్టరీ కార్మికుల కోసం ఉద్యమాలు చేశారు. సిమెంట్‌ ఫ్యాక్టరీ వద్ద నిరవధిక దీక్ష చేసి యాజమాన్యం దిగొచ్చేలా చేశారు. సాగర్‌ ఎడమ కాలువకు నీటి విడుదల చేయాలని నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్ర చేశారు.
నీటి విడుదల కోసం ఆర్డీఓ కార్యాలయం ఎదుట పక్షం రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేశారు.
రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని పాత వ్యవసాయ మార్కెట్‌ వద్ద నిరవధిక దీక్ష చేశారు. చివరి భూములకు నీళ్లు అందించాలని దామచర్ల మండలంలో అనేక లెఫ్ట్‌ ఇరిగేషన్లు మంజూరు చేయించి పంట భూములను సస్య శ్యామలం చేశారు.
పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య నివారణ కోసం బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మినీ రవీంద్రభారతిని మంజూరు చేయించారు. క్రీడాకారుల కోసం ఇండోర్‌ స్టేడియం, ప్రజలకు ఆహ్లాదం అందించేందుకు పందిళ్ల చెరువు వద్ద బోటింగ్‌ పార్కు ఏర్పాటు చేశారు. పట్టణ నడిబొడులో ఎన్‌ఎస్పీ క్యాంపులో సుందరయ్య పార్క్‌ ఏర్పాటు చేసి ప్రజలకు ఎంతో ఆహ్లాదాన్ని అందించే విధంగా తీర్చిదిద్దారు.
50 పడకల ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేశారు. నిరుద్యోగులకు ఉపయోగకరంగా ఉండేందుకు జిల్లాలోనే అతిపెద్ద గ్రంథాలయాన్ని నిర్మించారు. ఆ అభివృద్ధి పనులనే ప్రస్తుత ఎమ్మెల్యే తాను చేసినట్టు చెప్పుకోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. పది సంవత్సరాలుగా ఏ పదవీ లేకున్నా ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ ముందుండి అండగా నిలుస్తున్నారు. అందుకే ఆయనను నియోజకవర్గ ప్రజలు ప్రేమగా ‘రంగన్న’ అని పిలుచుకుంటారు.
కార్మికులకు అండగా..
నియోజకవర్గాన్ని గెలిచిన కమ్యూనిస్టు అభ్యర్థులు ఎంతో అభివృద్ధి చేశారు. ముఖ్యంగా రైస్‌ ఇండిస్టీలు ఎక్కువగా ఉండటం, అందులో కార్మికులు, సాగర్‌ ప్రాజెక్టు పరిధిలో ఆయకట్టు ఉండటంతో రైతులు, రైతు కూలీలు అధికంగా ఉన్నారు. ఈ రెండు వర్గాలకు కమ్యూనిస్టులు అండగా ఉండటం.. కష్టాల్లో పాలుపంచుకోవడంతో ఈ నియోజకవర్గం ఎర్రజెండాకు కంచుకోటగా ఉండేది.అరిబండి లక్ష్మీనారాయణ 1978, 1985, జూలకంటి రంగారెడ్డి 1994, 2004. 2009 ఎన్నికల్లో గెలుపొందారు. అరిబండి లకీëనారాయణ హయాంలో దాతల సహకారంతో మిర్యాలగూడలో కేఎన్‌ఎమ్‌ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశారు. నేరేడుచర్లలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయించారు. గోపాలపురం బ్రిడ్జి నిర్మించి ప్రజలందరికీ రాకపోకల సౌకర్యం కల్పించారు.

Spread the love