నా ఎన్నికల అఫిడవిట్‌పై దుష్ప్రచారం

– అన్ని విషయాలనూ కోర్టుకు నివేదిస్తాం : మంత్రి శ్రీనివాసగౌడ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తన ఎన్నికల అఫిడవిట్‌పై దుష్ప్రచారం జరుగుతోందని రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాసగౌడ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆ అఫిడవిట్‌లో ఎలాంటి టాంపరింగ్‌ జరగలేదంటూ స్పష్టంగా చెప్పిందని ఆయన గుర్తు చేశారు. ఈ క్రమంలో నాంపల్లి కోర్టు పోలీస్‌ స్టేషన్‌కు పిటిషన్‌ను పంపిస్తే ఏదో జరిగినట్టు ప్రచారం చేస్తున్నారని వాపోయారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన క్లీన్‌చిట్‌ను పిటిషన్‌దారుడు కోర్టులో దాఖలు చేయకపోవటం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని వివరించారు. ఈ నేపథ్యంలో కోర్టుకు అన్ని విషయాలనూ నివేదిస్తామన్నారు. న్యాయం తమ వైపే ఉందని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష కార్యాలయంలో ఎమ్మెల్యేలు ఏ.వెంకటేశ్వరరెడ్డి, కృష్ణమోహనరెడ్డితో కలిసి మంత్రి విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. పీసీసీ చీఫ్‌ రేవంత్‌… ప్రజాక్షేత్రంలో తనను, బీఆర్‌ఎస్‌ను ఎదుర్కోలేకే కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నారని విమర్శించారు. ఆయన వృత్తి రాజకీయాలైతే.. ప్రవృత్తి చీటింగ్‌, బ్లాక్‌ మెయిలింగ్‌ అని ఎద్దేవా చేశారు. ఆర్టీఐని అడ్డం పెట్టుకుని రేవంత్‌ కోట్లు సంపాదించారని చెప్పారు. తాను వక్ఫ్‌ భూములను కబ్జా చేశానంటూ ఆయన చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని కొట్టి పారేశారు.

Spread the love