– బహిరంగ క్షమాపణ చెప్పాలి
– బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ డిమాండ్
నవతెలంగాణ జన్నారం
మీడియాపై, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బోజ్జు పటేల్ బహిరంగ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం ఆ పార్టీ జన్నారం మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మండల అధ్యక్షుడు గుర్రం రాజారాంరెడ్డి అన్నారు.
ఈనెల 16న స్థానిక ఎమ్మెల్యే మీడియాపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అలాగే మాజీ సీఎం కేసీఆర్ గురించి మాట్లాడే స్థాయి మీకు లేదని, ఇకపై బీఆర్ఎస్ పార్టీపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తగిన విధంగా సమాధానం చెబుతామని హెచ్చరించారు.
అలాగే జన్నారం మండలం, పరిసర ప్రాంతాల్లో ఇసుక కొరత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతున్నారని విమర్శించారు. ఫారెస్ట్ శాఖ అధికారులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, ఇసుక సమస్యను వెంటనే పరిష్కరించాలని బిఆర్ఎస్ పార్టీ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మున్వర్ అలీ ఖాన్, సిటీమల భరత్, చెట్టుపల్లి సత్యం, రాములు నాయక్, శ్రీనివాస్ గౌడ్, జాడి గంగాధర్, పేరం శ్రీనివాస్, కళ్లెం శ్రీనివాస్ రెడ్డి, ప్రేమ్ సాగర్, ఇప్ప రాకేష్, బాధవత్ సాయికిరణ్, ఇప్ప మహేష్, అప్పని సాయి, దుమ్మల ఎల్లయ్య, బచ్చల శివ, ఐళ్లవేణి రవి పాల్గొన్నారు.



