నాయకుడిని కాదు సేవకుడిని..: ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

– నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక…
– ప్రజలకు అందుబాటులో ఉండటానికే క్యాంపు కార్యాలయంలోకి
నవతెలంగాణ – అశ్వారావుపేట
తాను రాజకీయ నాయకుడిని కాదని ప్రజా సేవకుడిగా నియోజకవర్గ అభివృద్ధికి కష్టపడి పని చేస్తానని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ స్పష్టం చేశారు.అభివృద్ధి,సంక్షేమం రెండు కళ్ళు గా భావించి నియోజక వర్గం ప్రజలు నాకు ఇచ్చిన రాజకీయ అవకాశాన్ని వినియోగించి సామాజిక బాధ్యతగా సేవ చేస్తానని అన్నారు.స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి శుక్రవారం ఆయన దంపతులు లాంచనంగా గృహ ప్రవేశం చేశారు.సర్వమత ప్రార్థనలు, పూజలు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీతో పాటు నాపై ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రజలకు ఎల్లప్పుడూ కృతజ్ఞతా భావంతో ఉంటాను అన్నారు. నియోజకవర్గ ప్రజలు, పార్టీ శ్రేణులకు ఎటువంటి కష్టం రానీయకుండా అందుబాటులో ఉంటానని భరోసా ప్రకటించారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించటమే తన లక్ష్యమని చెప్పారు. పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించటానికి క్యాంపు కార్యాలయం,గండుగులపల్లి నివాసం, ప్రతి మండల కేంద్రంలో కంప్యూటరీకరణ తో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యం కోసం గుమ్మడవల్లి, వినాయకపురం, పట్వారీ గూడెంతో పాటు ఇతర మండల కేంద్రాల్లో 24 గంటల వైద్య సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కోన్నారు.
           108 వాహనాన్ని అశ్వారావుపేట తరలింపుకు అధికారులతో మాట్లాడినట్లు చెప్పారు. సింగరేణి నిధులను నియోజకవర్గ అభివృద్ధికి కేటాయించాలని జిల్లా అధికారులతో మాట్లాడానని, ప్రజలకు అవసరమైన అన్ని మౌళిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని వివరించారు. అశ్వారావుపేట సెంట్రల్ లైటింగ్ పనులను వ్యవసాయ కళాశాల నుండి రాష్ట్ర సరిహద్దు వరకు భద్రాచలం రోడ్డులో పెట్రోల్ బంక్ వరకు విస్తరించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశామని, త్వరలోనే నిధులు మంజూరు అవుతాయని చెప్పారు. నియోజకవర్గ మండలాల్లో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను ప్రణాళికాబద్ధంగా నిర్మించేందుకు కృషి చేస్తానని హమీ ఇచ్చారు.జర్నలిస్టుల  సంక్షేమానికి సొంతంగా నిధిని ఏర్పాటు చేస్తానని ప్రకటించారు.అనారోగ్య సమస్యలు,ఇతర అవసరాలకు ఈ నిధి ఉపయుక్తంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ లు ఖచ్చితంగా అమలు అవుతాయని,ఈ పథకాలు నిరుపేద ప్రజలకు ఆర్ధిక దన్నుగా నిలుస్తాయని తెలిపారు. ప్రజలు కూడా ప్రభుత్వ సంక్షేమ పధకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థిక పరిపుష్టి సాధించాలని ఆకాంక్షించారు. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా జీవిత భరోసా కల్పిస్తుందని అన్నారు.
ఆనంతరం దమ్మపేట మండలం మల్కారం, అశ్వారావుపేట మండలం వినాయకపురం, కొత్తమామిళ్ళవారిగూడెం గ్రామాలకు చెందిన చల్లా శ్రీనివాస్, విజయ, సీతమ్మలకు సీఎం ఆర్ ఎఫ్ ఎల్వోసీ పత్రాలను అందించారు. పట్టణంలో తెలంగాణ ఉద్యమ నేత ముబారక్ బాబా ఇంటికి వెళ్ళి ఆయన తల్లి ఫాతీమాబేగం ను పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అక్కడ నుండి డ్రైవర్స్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు షేక్ సర్దార్ ను పరామర్శించారు. ఆయన తండ్రి లాల్ సాహెబ్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు జూపల్లి రమేష్, మొగళ్ళపు చెన్నకేశవ రావు, తుమ్మ రాంబాబు, సత్యనారాయణ చౌదరి, బత్తిన పార్ధసారధి, రావు గంగాధర్ రావు, రాజయ్య, బత్తుల అంజి, చిన్నం శెట్టి యుగంధర్, చెన్నారావు తదితరులు పాల్గొన్నారు.
Spread the love