వరదలతో నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలి : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

నవతెలంగాణ-హైదరాబాద్ : వరద వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో తీవ్రనష్టం జరిగిందని.. వరదల వల్ల 10 నుంచి 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తెలిపారు. పంట పొలాల్లో ఇసుక మేటలతో రైతులు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక మేటలతో దెబ్బతిన్న రైతులకు రూ.15-20 వేల పరిహారం సరిపోదన్న జీవన్ రెడ్డి.. ఇసుక మేటలతో నష్టపోయిన రైతులకు రూ.50 వేల వరకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. “వరదలతో దెబ్బతిన్న చెరువులు, కుంటలు, కాల్వలకు పునరుద్ధరణ చర్యలు చేపట్టాలి. వరదలతో మత్స్యకారులు కూడా తీవ్రంగా నష్టపోయారు. రూ.కోట్ల సంపద కోల్పోయిన మత్స్యకారులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో తీవ్రనష్టం జరిగింది. వరదల వల్ల ఇళ్లు కోల్పోయిన వారిని కూడా ఆదుకోవాలి. కడెం ప్రాజెక్టుకు అదనపు గేట్లు ఏర్పాటు చేయాలి. సుందిళ్ల బ్యాక్‌వాటర్‌ వల్ల మంచిర్యాల పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుంది. కాళేశ్వరం ముంపు నిర్వాసితులను ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.” అని జీవన్ రెడ్డి మండలిలో డిమాండ్ చేశారు.

Spread the love