ఆధునికతకు స్వయం ప్రకటిత అర్థాలు వున్నాయి. ఆధునికత వ్యక్తి పూజమాని, బానిసత్వం రూపుమాపి మానవతా దృక్పథంలో పురోగమన మార్గం ఎంచుకోమంటుంది. దొర, దొరసాని అని జమిందారులను పిలిచే మాటలు బానిసత్వపు పిలుపులవి. ఇంగ్లీషులో పిలిచే సర్, లార్డ్ వంటి పదాలు అధికారం చేతికి ఇస్తూ పిలిచే పదాలు వ్యక్తి పూజ పదాలు. శ్రీ, శ్రీమతి వంటివి, ఇంగ్లీషులో మిస్టర్, మిస్ వంటి పదాలు ఎదుటివారికి గౌరవం ఇస్తూనే ఒక సమానత్వం ప్రదర్శిస్తాయి. ఇలా వ్యక్తి స్వాతంత్య్రాన్ని, సమానత్వాన్ని గౌరవించడం అంతర్జాతీయంగా అందరూ ఆమోదించిన సామాజిక ఆధునికత.
అయితే కళారంగంలో ఏ దేశం వారు వారి కళా సంస్కృతులు, సంప్రదాయాల ప్రకారం వారి ఆధునికత నిర్ణయించుకున్నారు. అది వారి ఆధునికతగా ప్రకటించారు. జపాన్ వారు వారి ఇంకు, నీటి చిత్రాలను ఆధునిక చిత్ర పద్ధతి తూర్పు దేశాలలో ప్రచారం చేస్తూ వారి కళలను ప్రచారం చేశారు. భారతదేశం కూడా వచ్చారు. అదే మెక్సికన్‌లు సోషలిజం, సమానత్వం తెలిపే సమాజ కుడ్య చిత్రాలను, సగటు సమాజానికి సమాచారం తెలిపే విధంగా చిత్రించారు. అలాగే బ్రిటిష్ వారికి, వారి పాలనకు విరుద్ధంగా సమాచారాన్ని కుడ్య చిత్రాల ద్వారా ప్రచారం చేశారు. భారతీయులు, వారి కళా సంస్కృతులకు పునర్జీవింపచేయదలిచారు. భారతీయ చిత్రం, కళా పద్ధతి మాత్రమే యూరోపియన్ల కళా శిక్షణకు విరుద్ధంగా కొందరు వాడదలచుకుంటే, కొందరు పాశ్చాత్య కళా పద్ధతిలో మన సంస్కృతి చిత్రాలు వేసి ఇది వారి ఆధునికత అన్నారు.
బెంగాలీలు వారి సంస్కృతిని కళలలో ప్రతిబింబింపచేస్తే తెలుగువారు వారి కట్టు బొట్టు జీవన పద్ధతిని కళా పద్ధతిలో ప్రవేశపెట్టారు.
తెలుగు ప్రాంతంలో శతాబ్దాల క్రితం నుండి కళా సంస్కృతి సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇవ్వబడింది. ఇంగ్లీషు వారి రాక వారి కళాకారుల ఆగమనం ఈ తెలుగు సంస్థానాలలోనూ ఆవరించుకుంది. ఆ సమయంలో వచ్చిన రవివర్మ చిత్రాలు, ఆయన చిత్రాలకు ఓలియోగ్రాఫ్ పద్ధతిన తీసే ముద్రణ ప్రతులు తెలుగు ప్రాంతం చేరి భారతీయ సంస్కృతి పునరుజ్జీవన భావాలు, స్వదేశీ భావాలు ప్రబలాయి. రవి వర్మ మన పురాణేతి హాస చిత్రాలు తను ఆచరించిన ఆధునికతలో చిత్రించి ముద్రణ కళ ద్వారా ప్రతులను తీసి అందరికీ అందుబాటులోకి తెచ్చాడు.
ఈ విధంగా స్వదేశీ భావాలు, వారి వారి ప్రాంతీయ కళా సంస్కృతులకు వేదికగా చేసుకుని దేశమంతా పాకాయి. అందులో విదేశీ వస్తు బహిష్కరణ, బ్రిటిష్ కర్మాగారా వస్తు బహిష్కరణ, స్వదేశీ వస్తు ఆదరణ మొదలైనాయి. మన ఖాదీ వస్త్రధారణ, మన హస్తకళల ప్రాముఖ్యం పెరిగింది. నూలు వడికే రాట్నం, ఖాదీ వస్త్రానికి గుర్తుగా ఎన్నో తెలుగు ఇళ్లు చేరింది. తెలుగు సంప్రదాయాల పునర్జీవన చిత్రాలుగా రాట్నం చిత్రించడం మొదలైంది. తెలుగు ప్రాంతంలోనూ స్వదేశీ భావాలు, జాతీయ విలువలు నిలిపే జాతీయ కళశాలలు, పాఠశాలలు తెరిచారు. ఇంగ్లీషు విద్య నేర్పే స్కూళ్లను పక్కకు నెట్టి ఈ జాతీయ పాఠశాలలో చేరి పిల్లల చదువులు మొదలైనాయి. ఈ స్కూళ్ల సంఖ్య పెరిగింది. మచిలీపట్నంలో ఆంధ్ర జాతీయ కళాశాల, రాజమండ్రిలో జాతీయ పాఠశాల నిర్మాణం జరిగింది. మచిటీపట్నం జాతీయ కళాశాలలో ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్యతో పాటు చిత్రకళాభ్యాసం మీద కూడా చదువులు చేర్చింది.
ఈ కళాశాల నిర్మాణ ముఖ్యులు విద్యారంగంలో పనిచేసిన కె.హనుమంతరావు, కృష్ణపత్రిక సంపాదకుడు మంటూరు కృష్ణారావు, విద్యారంగం, రాజకీయం రెండింటా పనిచేసిన డా. పట్టాభి సీతారామయ్య. ఇక్కడ నేర్చిన దృశ్యకళలు స్వదేశీ విప్లవ ప్రచారంలో ముఖ్యసాయం అందించాయి. కానీ ఇక్కడ దృశ్య కళలు నేర్పేవారు లేక ఈ పాఠశాల బెంగాలుకు చెందిన అబనీంద్రనాథ్ టాగోర్, వారి శిష్యులు నందలాల్ బోస్ సలహాలపై ఆధారపడింది. ఈరంకి వెంకటశాస్త్రి ప్రత్యేక శిక్షణ లేకపోయినా చక్కటి డ్రాయింగ్ కళ వున్నందున ఈయనే ఇక్కడి పాఠాలు నేర్పాడు. ఇక్కడి ఓరియంటల్ కళ విభాగంలో బెంగాల్ కళాకారులు ప్రమోద్ కుమార్ చటర్జీ, రమేంద్రనాథ్ చక్రవర్తి, నందలాల్ బోస్ గారి విద్యార్థులు ఇక్కడ పాఠాలు నేర్ప ప్రారంభించారు. అజంతా, జపాన్, చైనా, మొగలు కళలు అబనీంద్రనాథ్ ఆనవాయితీలో నేర్పడం, యూరోపియన్లను విరోధించడం, అదే వారి ఆధునిక ప్రమాణ కళలుగా చూడబడింది. ఇక్కడ నేర్చిన కళాకారులు పింగళి వెంకయ్య మన జాతీయ పతాకం డిజైన్ చేశాడు. అడవి బాపిరాజు ఈ కళాశాల విద్యార్థి కాకపోయినా, ఉపాధ్యాయుల వద్ద కళలు నేర్చుకుని రచయిత, చిత్రకారుడయ్యాడు. జాతీయ కళాశాల ప్రిన్సిపాల్ అయ్యాడు. కొన్ని తెలుగు సినిమాలు.. ‘సతీ అనసూయ, మీరాబాయి, దృవ విజయం’ వంటి చిత్రాలకు 1940 కంటే ముందే ఆర్ట్ డైరెక్టర్ అయ్యాడు.
ఇక్కడి కళాశాల నుండి వెలువడిన కళాకారుల చిత్రాలు చూస్తే వీరు బెంగాలు వారి నీటి రంగుల పద్ధతిన చిత్రాలు వేసినా, చిత్ర విషయాలు వారి ప్రాంతపు జీవన సరళి, కట్టూ బొట్టూనే చిత్రించారు. వీరి చిత్రాలలో యూరప్ పద్ధతిన కాకపోయినా నిజమనిపించేలా వున్న చిత్రాలు వేశారు. పోతులూరి హనుమంతరావు వేసిన ‘మోటబావి’ చిత్రం చూసినా అల్లూరి సత్యనారాయణ వేసిన గురుదేవ్ (రవీంద్రనాథ్ టాగోర్) చిత్రం చూసినా ఫొటోగ్రాఫ్ ఆధారంగా చిత్రించిన చిత్రాలని, నిజమైన రూపాలకి దగ్గరగా ఆకారాలు చిత్రించారనీ అర్థం అవుతుంది. అంకాల సుబ్బారావు కూడా గ్రామీణ జీవనం, రైతులు, పండుగలు తెలుగు జీవన పద్ధతులను చిత్రించాడు. చంద్రుపట్ల వెంకటరామయ్య – తెలుగింటి సంక్రాంతి వాకిళ్లు, గంగిరెద్దుల మేళం చిత్రించాడు. పరికించి ఆలోచించవలసిన చిత్రం చంద్రుపట్ల బాపిరాజు వేసిన సిద్ధార్దుడు బుద్దుడిగా మారటానికి ఇల్లు వదిలి వెళ్తున్న దృశ్యం. అది తెలుగు కుటుంబాల ప్రయాణ కథ అనిపిస్తుంది. అంత తెలుగు తనం ఉట్టిపడుతుంది. ఎన్. వెంకటరావు వేసిన చిత్రం కుండకు రంగులు వేస్తున్న తెలుగు కుమ్మరిపిల్ల. ఆమె ముందు రాట్నం బొమ్మ కూడా చిత్రించబడింది. ఈ రాట్నం స్వదేశీ పోరాటానికి భారతదేశ ఏకత్వానికి గర్తు. ఇలా స్వదేశం, ప్రాంతీయత చూపుతూ తమ చుట్టుపక్కల జీవన సరళిని చూపి అది ఆధునికతగా తెలియజెప్పారు తెలుగు కళాకారులు.
గుర్రం మల్లయ్య శాంతినికేతన్ కూడా వెళ్లి శిక్షణ పొందాడు. అక్కడి చిత్ర పద్ధతి తీరు ఎక్కువగా కనిపించినా తెలుగు సంప్రదాయంలోనే వేశాడు. ఆయన తనకు నచ్చిన పద్ధతిన మాచెర్లలో ఆర్ట్ స్కూల్ నిర్మించాడు. అక్కడికే అబనీంద్రనాథ్ టాగోర్, ప్రమోద్ కుమార్ చటర్జీ, డి.పి. రారు చౌదరీ, రమేంద్రనాథ్ చక్రవర్తి వస్తూ పోతూ వుండడం వల్ల కళల మాధ్యమం ద్వారా స్వదేశీ భావాలు ఆ ప్రాంతాలలో చక్కగా ప్రబలాయి. ఈ కళాశాల ఎక్కువ కాలం నడిపించలేక పోవడంతో ప్రభుత్వందాన్ని హస్తకళల కేంద్రం చేసింది. ఎన్.వాసుదేవ్ వేసిన దేవదాసి చిత్రంలో డ్రాయింగ్ లోపం కనిపించింది. మచిలీపట్నం నుండి కళాశాల విద్యార్థులకు వేరే కళాశాల సంస్థలకు వెళ్లి కళాభ్యాసం చేయటానికి ఫెలోషిప్‌లు ఇచ్చేవారు. శారద పత్రిక సంపాదకుడు కౌతా శ్రీరామశాస్త్రి కొడుకు కౌతా ఆనందమోహన శాస్త్రి ఈ ఫెలోషిప్ అందుకుని మైసూర్ వెళ్లి వెంకటప్పయ్య వద్ద చిత్ర కళ అభ్యాసం చేశాడు. వెంకటప్పయ్య అబనీంద్రనాథ్ టాగోర్ శిష్యుడు. ఆనంద్ మోహన్ 1934 వరకు అహమదాబాద్ సారాబాయి సంస్థలో పనిచేశాడు. 1940లో అనారోగ్యం వలన మరణించారు. ఇతని తమ్ముడు కౌతా రామమోహనశాస్త్రి రాయల్ కాలేజీ లండన్‌కి వెళ్లి చదువుకుని వచ్చి, ముద్రణ కళ (ప్రింటు కళ) సదుపాయం దొరకక నీటి రంగుల వాష్ టెక్నిక్‌లో మచిలీపట్నం, కావలిలో పనిచేశాడు. తన అన్నగారి కళల మీద పుస్తకం తీశాడు.
చిత్ర వీరభద్రరావు 1920 నుండీ 28 వరకూ శాంతినికేతన్‌లో చదువుకున్నాడు. ఇతను కళల కోసమే కాదు కళావేదికలకోసమూ పనిచేవాడు. లక్కో ఆర్ట్ పాఠశాలలో అధ్యాపకుడిగా పనిచేశాడు. మద్రాస్ ఆర్ట్ కాలేజీకి వైస్ ప్రిన్సిపాల్‌గా, శాంతినికేతన్ కళాభవన్‌కి ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు. హస్తకళల వృద్ధికి ఎంతో పనిచేశాడు. కుటీర పరిశ్రమల కళలకు పనిచేయటమే కాక, భారతీయ హస్తకళల సంస్థ ఇండియన్ హాండిక్రాఫ్ట్స్ బోర్డ్ మద్రాసు విభాగంలో పనిచేశాడు. ఇంత కాలం కె.జి.సుభ్రమణ్యంగారు కళాకారుడు హస్తకళల సంస్థలో పనిచేశారని మటుకే ప్రచారం జరిగింది. కె. జి. గారి చదువులు కూడా పూర్తయినవో లేవో, అంతకుముందే వీరభద్రరావు గారు ఆ సంస్థకి మంచి పదవులలో పని చేశారు. శిల్పి అనే పత్రికని తెలుగు, ఇంగ్లీషులో ప్రచురించారు. హస్తకళల మీద పుస్తకాలు రాశారు. విశాఖపట్నంలో చిత్రకళా పరిషత్‌ని నెెలకొల్పారు. విన్న శేషారావు కూడా భీమవరం నుండి వెళ్లి శాంతినికేతన్‌లో చదువుకున్నాడు. భీమవరం చుట్టుపక్కల భారతీయ కళాసంప్రదాయాలలో పనిచేయవలసిన అవసరం గురించి ప్రచారం చేశాడు. మన దైనందిన విషయాలను, విశేషాలను చిత్రాలుగా వేయమని ప్రోత్సహించేవాడు. ఆ విషయాలు తెలుగు వారి జీవన సరళిని తెలుపుతాయి కదా! చాలామంది కళాకారులు మచిలీపట్నం నుండి శాంతినికేతన్ వెళ్లారు. కారణం మనకు తెలిసిందే. ఇక్కడ సలహా సంప్రదింపులు బెంగాల్ కళాకారులు కదా ఇచ్చింది. కానీ ఎస్.వి.ఎస్. రామారావు, తేజోమూర్తుల కేశవరావు మద్రాసు ఆర్ట్ స్కూల్‌కి వెళ్లారు డి.పి.రాయచౌదరి వద్ద కళాభ్యాసం చేయటానికి.
తేజోమూర్తుల కేశవరావు వేసిన భక్తకన్నప్ప చిత్రం తెలుగు పురాణ కథే. వింజమూరి వెంకటరావు వేసిన గోపిక చిత్రం తెలుగు పడుచు. మచిలీపట్నం ఆంధ్ర జాతీయ కళాశాల తెలుగు కళావేదికను అభివృద్ధి చేయడానికి ఎంతో సహాయపడింది. ఇది బెంగాల్ కళాకరుల కొమ్మలా బాల్యం గడిపినా తెలుగు జీవన సరళి, సంప్రదాయాలు చూపిస్తూ తెలుగు కళగా నిలబడింది. అడవి బాపిరాజు, గోఖలే వంటి కొంతమంది కళాకారులు కార్టూన్లు, పత్రికలకు చిత్రాలు వేయటమే కాక సినిమాలకు చేసిన కళా దర్శకత్వం తెలుగు కళ వృద్ధి చేయటంలో తోడ్పడింది. దూది వడికే రాట్నం చిత్రం చాలామంది వారి చిత్రంలో చేర్చారు. చదలవాడ క్రిష్ణయ్య వేసిన దసరా గిలకలు వంటి చిత్రాలు మన తెలుగు పండగలని చిత్రంగా వేసి, తెలుగు సంప్రదాయం ఇది అని చెప్పినట్లైంది. రాజమండ్రి జాతీయ పాఠశాల : ఈ ప్రాంతం కళాసంస్కృతి సాహిత్యాలకు శతాబ్దాలుగా ప్రాముఖ్యం పొందింది. బ్రిటీష్ వారి రాక ఇక్కడి సాహిత్య సంస్కృతులను కొనసాగించడం ఆపలేకపోయింది. కాలానుగుణంగా మార్పులూ చేసుకుంది.
19వ శతాబ్దం నాటికి సామాజిక, రాజకీయ, సాహిత్య కళా సంప్రదాయాలకు ముఖ్య కేంద్రం అయింది. అక్కడి గోదావరి నదికి ధవళేశ్వరంలో ఆనకట్ట కట్టడంలో నీటి వనరులు పెరిగి ఆ ప్రాంతం వృద్ధి చెందింది. పురోగమన ఆలోచనలతో ఇంగ్లీషు పాఠశాలలు, అలాగే జాతీయ పాఠశాల, దేశీయ భావాల విద్యాకేంద్రం తెరిచారు. పాత సమాజపు అంధ విశ్వాసాలను పోగొట్టాలని కందుకూరి వీరేశలింగం, న్యాయపతి సుబ్బారావు, ఉన్నవ లక్ష్మినారాయణ వంటివారు స్త్రీ విద్యాభివృద్ధికి పనిచేశారు. రాత్రి చదివించే పాఠశాలలు తెరిచారు. మన ఖాదీ ప్రాముఖ్యం, విదేశీ బహిష్కణనే కాదు, విదేశీ వస్తువులు మంటల్లో దహనం చేయటం వంటి బ్రిటిష్ వారికి విరోధం చూపే చర్యలూ జరిగాయి.
రాజమండ్రిలో నాటక వేదికా బలమైనది. ఇక్కడ యూరోపియన్ చిత్రకళ, ఆధునిక నాటక కళ కూడా ప్రబలి వున్నాయి. ఇంగ్లీషు వారి నాటక ప్రదర్శనలకు వేదిక వెనుక తెరలు, దాని మీద చిత్రాలు గీసే ఆనవాయితీ వుంది. ఆ పద్ధతి ఇక్కడ నాటక ప్రదర్శనలలోనూ మొదలైంది. కళాకారులు చాలామంది ఈ పనులలో నిమగమైనారు. కానీ నాటక విషయం, కథలు వారి ప్రాంతీయ కథలు, సామాజిక సందేశాలే అందించారు. నాటకంలో ఎ.ఎస్.రామ్ నాయకత్వాన ఈ తెరలపై చిత్రాలు వేదిక వెనుక కట్టే పరదాలు చిత్రీకరణ జరిగేది. ఈయన విద్యార్థులను ఫొటో గ్రాఫుల ఆధారంగా చిత్రించమని ప్రోత్సహించారు. ఈయన ఇచ్చిన స్వేచ్ఛలో బెంగాలు వారికి మల్లే నీటి రంగుల పలుచని చిత్రాలే వేయాలి అనే నిర్బంధం లేదు.
కౌల్డ్రే అనే బ్రిటిషరు, ఇక్కడి ప్రభుత్వ ఆర్ట్ కాలేజికి ప్రిన్సిపాల్‌గా వచ్చాడు. ఈయన ఇక్కడి విద్యార్థులను జె.జె.ఆర్ట్ స్కూల్ బొంబాయికి వెళ్లమని ప్రోత్సహించాడు. ఈ కళా స్కూలు యూరోపియన్ పద్ధతిన కళా పాఠాలు నేర్పుతారు. ఇది బెంగాలు వారి పద్ధతి కంటే వేరుగా వుంటుంది. దామెర్ల రామారావు చక్కటి చిత్రం గీయగల పటిమ మరింత నేర్చుకోవాలనే జిజ్ఞాస వున్నవాడు. ఇతనిని కౌల్డ్రే గారు జె.జె. స్కూల్‌కి పంపారు. దామెర్ల తరువాత ఎస్.ఎస్.చేమకూరు, సి.బి.రావు, వి.వి.బాగీరథీ, జె.జె.స్కూలులో కళలు నేర్వ అక్కడికి వెళ్లారు. భగీరథ గారి ప్రకృతి దృశ్యాలు ఇంగ్లీషు వారి చిత్రాలలా అనిపిస్తాయి. ప్రకృతి దృశ్యాలు వేసిన మొదటి తరం తెలుగు చిత్రకారుడిగా నిలిచాడు. ఆ సమయాన అందరూ మన సమాజ జీవన, సంప్రదాయాల చిత్రాలే వేశారు. భగీరథ చిత్రాలు మన ప్రదేశాల చిత్రాలేను. వరదా వెంకటరత్నం, ఎ.సుబ్బారావు బొంబాయి వెళ్లలేదు కానీ దామెర్ల రాసిన ఉత్తరాల ద్వారా ఎంతో శ్రద్దగా చిత్రం వేయటం నేర్చుకున్నారు. దామెర్లకి మరిన్ని కళాకేంద్రాలు చూడగలిగే కళాకారులను కలిసే స్కాలర్‌షిప్ వచ్చింది.
శాంతినికేతన్ వెళ్లి అక్కడ కళాకారులను, ఆ సంస్థ నిర్మాణ కర్త రవీంద్రనాథ్ టాగోర్‌ని కలిశాడు. గుజరాత్‌కి వెళ్లి తనతో పాటు జె.జె కళాశాల బొంబాయిలో చదువుకన్న వారిని కలిసి వచ్చాడు. చివరకు రాజమండ్రికి వెళ్లి ఒక కొత్త పద్ధతిన, ఆలోచనలతో కళలను చిత్రించే ‘ఆంధ్ర సొసైటీ ఆఫ్ ఇండియన్’ని నిర్మాణం చేశాడు. మన సమాజ విషయాలే కానీ, పద్ధతిలో నియంత్రణ లేనట్టి, చిత్రకళా పాఠశాల నిర్మాణం చేశాడు. తాను సెక్రటరీ, ఒ.జె. కౌల్డ్రే అధ్యక్షుడు, ఎ.ఎస్.రామ్ ఉపాధ్యాక్షుడిగా ఈ పాళశాల ముందుకు నడిచింది. రామారావు చిన్నతనంలోనే మరణించినా వరదా వెంకటరత్నం, రామారావు భార్య, చెల్లెలు ఈ కళాశాలను ముందుకు తీసుకెళ్లారు. ఈ కళాశాలలో చేరి ఎంతో మంది స్త్రీలు కళాకారులయ్యారు. (”స్త్రీ ఆధునిక కళాకారిణిగా శతాబ్దయానం (1920-2020) సమాజ ప్రతిబింబం” అనే నా పుస్తకాన్ని నవతెలంగాణ ముద్రణాలయం వారు నవంబర్, 2024 లో ప్రచురించారు. ఆ పుస్తకంలో ఎందరో ఆనాటి తెలుగు కళాకారిణుల కళలు వ్యాసాలుగా రాసాను. 1-3-2020 న దామెర్ల రామారావు గురించి విపులంగా నా వ్యాసం, నవతెలంగాణ వారి సోపతి లో ప్రచురిత మయింది. అందువలన ఇప్పుడు మళ్ళీ వివరణ రాయలేదు ఇందు కొంత సమాచారం డా సుధా రెడ్డి గారి ‘ఆర్ట్ ఇన్ ఆంధ్ర’ పుస్తకం లోనించి తీసుకోబడింది.)
డా||యం.బాలామణి, 8106713356



